గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నిర్మాతలంతా ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు తీసే మూడ్‌లోకి వస్తున్నారు. పెద్ద స్టార్లతో, క్రేజీ కాంబినేషన్లను సెట్ చేసిన బెల్లంకొండ సురేష్… కొన్నాళ్లుగా సినిమా ఊసులేం పట్టించుకోలేదు. తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా ప్రమోట్ చేసుకొనే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ… బడా హీరోలతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నట్టు టాక్. ఈమద్య బెల్లంకొండ నందమూరి బాలకృష్ణని కలిశాడట. ‘మీ డేట్లు కావాలి… మీతో సినిమా చేయాలనివుంది’ అని రిక్వెస్ట్ చేశాడట. బెల్లంకొండ బ్యానర్లో ఇది వరకు లక్ష్మీనరసింహా సినిమా చేశాడు బాలయ్య. ఆ సినిమా హిట్టయినా.. తరువాత బాలయ్య – బెల్లంకొండల మధ్య అనుబంధం దెబ్బతింది.
బాలయ్య ఇంట్లో కాల్పుల వ్యవహారం తరవాత.. వీరిద్దరికీ కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆ తరవాత మళ్లీ మామూలైపోయారు. అప్పటి నుంచీ.. బాలయ్యతో ఓ సినిమా చేయాలని శతవిథాలా ప్రయత్నిస్తున్నాడు బెల్లంకొండ. అప్పుడెప్పుడో బి.గోపాల్ – బాలయ్య కాంబినేషన్ కూడా సెట్ చేశాడు. కానీ అది పట్టాలెక్కలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి తరవాత బాలయ్య – బెల్లంకొండ మధ్య సినిమాకి సంబంధించిన చర్చలు నడిచినట్టు తెలుస్తుంది. బెల్లంకొండ బ్యానర్లో సినిమా చేయడానికి బాలయ్య ఓకే అన్నాడట. ‘మంచి కథ తెచ్చుకో.. సినిమా చేసి పెడతా’ అని మాట ఇచ్చినట్టు టాక్. దాంతో బెల్లంకొండ బాలయ్యకు తగిన కథ కోసం అన్వేషణ ప్రారంభించేశాడని తెలుస్తోంది. ఓ అగ్ర రచయితతో బాలయ్య కోసం కథ రాయించుకొనే పనిలో ఉన్నాడని, అది ఆయనకు వినిపించి.. అప్పుడు దర్శకుడి కోసం అన్వేషణ మొదలెడతాడని తెలుస్తోంది. బాలయ్య తన 101వ చిత్రం భవ్య ఆర్ట్స్‌కి చేయాల్సివుంది. 102వ సినిమాగా బెల్లంకొండకు ఛాన్స్ ఇవ్వొచ్చు.