తెలుగు ప్రజలకు సంక్రాంతి పెద్ద పండగ. అందుకని, పెద్ద హీరోలు తాము నటించిన సినిమాలను ఈ పండక్కి విడుదల చేయాలని అనుకుంటారు. దాంతో హీరోల మధ్య పోటీ తప్పడం లేదు. బాలకృష్ణకు సంక్రాంతి ఎంతో స్పెషల్. పెద్ద పండక్కి విడుదలైన బాలయ్య మెజారిటీ సినిమాలు హిట్టే. దాంతో రెండేళ్లుగా సంక్రాంతికి తన సినిమాను విడుదల చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘యన్.టి.ఆర్’ బయోపిక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా బోయపాటి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయిస్తున్నాడు. దాంతో పెద్ద పండక్కి మరోసారి ‘నందమూరి vs మెగా’ పోటీ నెలకొంది. గతేడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ విడుదల అయ్యాయి. రెండూ విజయాలు సాధించాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘జై సింహా’, పవన్‌కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాగా… బాలకృష్ణ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. పవన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలు రానున్నాయి. ఎవరి సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. అన్నట్టు… సంక్రాంతి బరిలో రామ్ చరణ్ కూడా హిట్ హీరో అనిపించుకున్నాడు. అతని ‘నాయక్’, ‘ఎవడు’ సినిమాలు సంక్రాంతికి విడుదలై విజయాలు సాధించాయి. అయితే… ఇప్పటివరకూ సంక్రాంతి బరిలో బాలకృష్ణ, రామ్‌చరణ్ సినిమాలు పోటీ పడలేదు. వచ్చే ఏడాది తొలిసారి కానుంది.