ఓ మంచి మాట చెప్పడానికి తనకు దొరికిన ప్రతీ వేదికనీ వాడుకోవడం క్రిష్‌కి అలవాటు. అంతేకాదు.. మనదైన సంస్క్రృతి, సంప్రదాయాల్ని మళ్లీ గుర్తు చేస్తుంటాడు. గౌతమి పుత్ర శాతకర్ణిలో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రమిది. ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమాలో భారీ డైలాగులు, రాజకోట, దర్బార్, యుద్దాలు.. ఇవి మాత్రమే కాదు. ఇంకా చాలా చాలా ఉన్నాయ్. మరీ ముఖ్యంగా మనదైన సంప్రదాయాల్ని చూపించబోతున్నాడుక్రిష్. ఈ సినిమాలో బుర్రకథకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటి ఉందట. అది చిత్రానికి చాలా కీలకమైన భాగంలో వస్తుందని సమాచారం. ఈ బుర్రకథలోనే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు. బాలయ్యకు పద్యాలన్నా, శ్లోకాలు వల్లించడమన్నా చాలా ఇష్టం. అందుకే… అక్కడక్కడా అవి కూడా వినిపిస్తాయట. ఏదో.. పద్యాలు, శ్లోకాలు వాడుకోవాలని కాకుండా.. వాటి అంతరార్థం అందరికీ అర్థమయ్యేలా సీన్లు డిజైన్ చేశారని తెలుస్తోంది. దాంతో తెలుగు భాషపై, ఇక్కడ సంప్రదాయాలపై మరింత గౌరవం పెరుగుతుందని క్రిష్ భావిస్తున్నాడు. ఉగాది పండగ గౌతమి పుత్రుని హయాంలోనే ప్రారంభమైంది. ఉగాది విశిష్టతను చెబుతూ.. బాలయ్య పలికే సంభాషణలు ఈ సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది. మొత్తానికి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని విజువల్ వండర్గానే కాకుండా.. హ్యూమన్ వాల్యూస్‌తో తీస్తూ.. దీనినో సాంస్క్రృతిక వారధిగా నిలపడానికి క్రిష్ ప్రయత్నిస్తున్నాడని చెప్పాలి. ఫలితం ఎలాగున్నా… ఆయన ప్రయత్నం మాత్రం గొప్పదే.