ఎన్నికల్లో ఓడిపోయాక.. జగన్ పక్క నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన బాలినేని.. ఒంగోలు రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అసలు ఆయన ఒంగోలులో ఉండటం లేదు. హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే ఇక నుంచి కనీసం రెండు రోజులు ఒంగోలుకు కేటాయిస్తానని ప్రకటించారు. ఎందుకంటే .. ఆ రెండు రోజులు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లపై యుద్ధం చేసి వెళ్తారట.
జనసేనలో బాలినేని చేరికను దామచర్ల స్వాగతించలేదు. అక్కడ దామచర్ల, బాలినేని మధ్య దశాబ్దాల వైరం ఉంది. అందుకే పార్టీలకు అతీతంగా గతంలో బాలినేని చేసిన అరాచకాలపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాలినేని కుమారుడి విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో తమను టార్గెట్ చేశారని.. తాము తప్పు చేయలేదని అంటున్నారు. వైసీపీ, టీడీపీ కలిసి తనను టార్గెట్ చేస్తున్నాయని బాలినేని చెప్పుకుంటున్నారు. అందుకే ఇక నుంచి వారానికి రెండు రోజులు ఒంగోలులోనే ఉండి.. దామచర్ల అవినీతిని బయటపెడతానని సవాల్ చేశారు.
నిజానికి బాలినేని వ్యూహం.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి టిక్కెట్లు ఎక్కువగా ఇప్పించుకోవాలన్నదేనని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బాలినేని వర్గం తమ నేతకు ఉన్న పాత కేడర్‌ను తిరిగి యాక్టివేట్ చేస్తుంటే, దామచర్ల వర్గం అధికారిక పనులు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణులు తమ నేతలే ఒంగోలుకు అసలైన బాస్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రాజకీయ వైరం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


