Band Melam Movie Review
తెలుగు360 రేటింగ్: 1.5/5
రొటీన్ కథల్ని రోకలి బండతో తరిమి కొడుతున్న కాలం ఇది. మామూలు కథలు పనికి రావడం లేదు. పైగా చిన్న సినిమాలకు. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ఏదో ఓ మ్యాజిక్ చేయాలి. ‘చూడకపోతే.. ఏదో మిస్ అయిపోతాం’ అనే ఫీలింగ్ కలిగించాలి. సినిమాలో అరవై సీన్లుంటే కనీసం పదింటి గురించైనా పది మందికీ చెప్పుకొనేలా ఉండాలి. లేకపోతే.. ‘వచ్చింది.. వెళ్లింది’ అన్నట్టే ఉంటుంది వ్యవహారం. అచ్చం ‘బ్యాండ్ మేళం’లా.
ఈ సినిమా గురించి కాస్తో కూస్తో మాట్లాడుకొన్నారంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ‘కోర్టు’ సినిమాతో ఆకట్టుకొన్న జంట ఈ సినిమాలో మళ్లీ జట్టు కట్టింది. రెండోది.. కోన వెంకట్ నిర్మాత. రైటర్ గా స్టార్ హోదా చూసిన వ్యక్తి కోన వెంకట్. నిర్మాతగానూ కొన్ని హిట్లు ఉన్నాయి. ఆయన ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ‘ఈ సినిమా ఆడకపోతే.. నేను రాసే తరువాతి సినిమా చూడొద్దు’ అని భారీ స్టేట్ మెంట్ పాస్ చేశారు. ఈమధ్య చిన్న సినిమాలకు కాలం కలిసి వస్తోంది కాబట్టి ‘బ్యాండ్ మేళం’ కూడా ఆ తరహా సినిమా అవుతుందని ఆశ పడ్డారు. కానీ… చివరికి నిరాశే ఎదురైంది.
కథలోకి వెళ్దాం. గిరి (రోషన్). రాజీ (శ్రీదేవి) ఇద్దరూ బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇంట్లో వాళ్లు కూడా ఇద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకొంటారు. కానీ పెద్దయ్యాక పరిస్థితులు మారతాయి. రెండు కుటుంబాల మధ్య అంతరాలు పెరుగుతాయి. గిరి జులాయిగా తిరుగుతుంటాడు. రాజీ బాగా చదువుతుంది. టెన్త్ ఫెయిల్ అయ్యాడని గిరిపై కోపం పెంచుకొంటుంది రాజీ. తనేమో బీటెక్ లోకి వెళ్లిపోతుంది. గిరి మాత్రం తన బ్యాచ్ తో ఓ బ్యాండ్ మేళం ట్రూప్ పెట్టుకొని పెళ్లిళ్లకూ, పేరంటాలకూ డప్పులు కొట్టి, పాటలు పాడి కాలక్షేపం చేస్తుంటాడు. కానీ మనసులో మాత్రం రాజీపై ప్రేమ ఉంటుంది. రాజీని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకొంటాడు. మరి తన ప్రయత్నం నెరవేరిందా, లేదా? రాజీ మనసులో ఎవరున్నారు? ఈ బావా మరదళ్ల కథ ఏ తీరానికి చేరింది? అనేది తెరపై చూడాలి.
స్టోరీ లైన్‌గా చెప్పుకొంటే ‘ఉయ్యాల జంపాల’ లాంటి కాన్సెప్టులు కొన్ని గుర్తొస్తాయి. కథలో విషయం లేదు. కానీ రాతలో, తీతలో కొత్తగా ఆలోచించే స్కోప్ ఉంది. కాకపోతే దర్శకుడు అటుగా ఆలోచించలేదు. ‘ప్రేక్షకులకు ఇది చాల్లే.. ఇంత కంటే ఏం కోరుకొంటారు’ అని దర్శకుడు ఫిక్సయిపోయి సన్నివేశాల్ని రాసుకొన్నాడా అనిపిస్తుంటుంది. ఫస్ట్ సీన్ నుంచి.. ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. తెరపై రోషన్ లౌడ్ గా నటిస్తుంటాడు. రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు, ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా నవ్వించడానికి నానా పాట్లు పడుతుంటుంది. కానీ ప్రేక్షకులకే నవ్వు రాదు. ఈ సినిమాని ప్రేమకథలా చూడాలా? బావా మరదళ్ల అనుబంధం కోణంలో చూడాలా? లేదంటే చదువు – సంధ్యా లేని హీరో, తన టాలెంట్ తో ఎదిగిన కథలా భావించాలా.. అనేవి అర్థం కావు. ఏ ఎమోషన్ లోనూ సీరియస్ నెస్ లేదు. కనీసం హీరో క్యారెక్టర్లో కూడా.
బావ మరదళ్ల కథ అనుకొంటే… కనీసం వారిద్దరి ఎమోషన్ ని బిల్డ్ చేసే ఒక్క సీన్ కూడా సరిగా పడలేదు. హీరోపై గానీ, హీరోయిన్ పై గానీ సింపతీ పుట్టలేదు. వారిద్దరూ కలిస్తే బాగుండేది అనే ఆశ కూడా ప్రేక్షకుల్లో ఉండదు. అలాంటప్పుడు కథని ఎవరి కోణం నుంచి ఫాలో అవ్వాలి? ఎందుకు అవ్వాలి? మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్నది హీరో గోల్. ఆ గోల్ కూడా సీరియస్ గా తీసుకోడు. నాలుగు గోడలు లేపి, పైన రేకులు అమర్చి.. దాన్ని స్టూడియో అనుకోమంటే ఎలా? ప్రేక్షకులు ఎప్పుడో అప్ డేట్ అయిపోరు. మేకర్స్ ఎందుకు అవ్వరు?
ఆ స్టూడియో కట్టే ప్రయత్నాలైనా నిజాయితీగా జరిగాయా అంటే.. అదీ లేదు. అందుకోసం హీరో అండ్ గ్యాంగ్ దొంగతనాలు చేస్తుంటే ఈ కథ ఎక్కడికి పోతోంది? అనిపిస్తుంటుంది. ఇంట్రవెల్ వచ్చేసరికే ఈ సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. రెండో సగం అయితే సహనానికి మరింత పరీక్ష పెడుతుంది. లేచిపోయే వ్యవహారం, అనంతరం సాగే డ్రామా ఈ కథకు చాలా కీలకం అనుకొన్నాడు దర్శకుడు. కానీ అక్కడ కూడా సీరియెస్ నెస్ లేదు. కథానాయిక వెనుక ఉండే ట్విస్ట్ రివీల్ చేయడం కూడా పైపైన వ్యవహారంలా మారిపోయింది. మధ్యలో పాటలు బాగున్నా మనసుకు హత్తుకోవు. ఒకట్రెండు సీన్లు బాగా డీల్ చేసినా అవి కంటికి ఆనవు. క్లైమాక్స్ పై చిత్రబృందం చాలా నమ్మకాలు పెట్టుకొంది. కానీ అది కూడా ప్రభావవంతంగా తీయలేకపోయాడు దర్శకుడు.
రోషన్ మంచి నటుడే. తనలో ఎనర్జీ కనిపించింది. కానీ చాలాచోట్ల ఓవర్ చేశాడన్న ఫీలింగ్ వస్తుంది. శ్రీదేవి ఎప్పట్లా సహజంగా కనిపించింది. తన పాత్రకు సెకండాఫ్‌లో స్కోప్ లేకుండా పోయింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కనిపించినవాళ్లంతా కొత్తవాళ్లే. ఒకట్రెండు పంచ్‌లు వేయడం మినహా వాళ్లూ చేసిందేం లేదు. విజయ్ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. కానీ కథలోని లోపాల వల్ల అవి కూడా కనెక్ట్ కాలేదు. నేపథ్య సంగీతంలో తన మార్క్ లేదు. అంత ఎఫెక్ట్ పెట్టేంత సీన్లు దర్శకుడు రాయలేదనుకొంటా. తెలంగాణ జానపద గీతాలు, ప్రైవేటు ఆల్బమ్స్ లో పాపులర్ అయిన కొన్ని పాటలు అక్కడక్కడ వినిపిస్తాయి. ఆ పాటలు వచ్చినప్పుడు కూడా థియేటర్లో జోష్ కనిపించలేదు. సినిమా క్వాలిటీ పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఓ విషయంలో మాత్రం దర్శకుడ్ని మెచ్చుకోవాలి. కోన వెంకట్ రాసిన ‘ఢీ’ సినిమాలోని పాయింటే అటు తిప్పి, ఇటు తిప్పి.. మళ్లీ మళ్లీ ఆయనకే చెప్పి ఒప్పించి సినిమా తీశాడు. తన ‘ఢీ’లోని పాయింటే దర్శకుడు ఎత్తేశాడన్న విషయం కోన వెంకట్ కి అర్థమైందో లేదో..?
తెలుగు360 రేటింగ్: 1.5/5
