2017నాటి డ్రగ్స్ కేసు మళ్లీ తెరవాలని.. అప్పటి విచారణాధికారి అకున్ సబర్వాల్కే ఆ బాధ్యతలు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు మరోసారి డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలడంతో ఈ అంశంపై బండి సంజయ్ సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు.
2017లో అకున్ సబర్వాల్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ డ్రగ్స్ కేసు విషయంలో చేసిన విచారణ ఓ సంచలనం. కానీ ఆ తర్వాత ఆ కేసు అతీ గతీ లేకుండా పోయింది. అకున్ సబర్వాల్ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన తెలంగాణకు వచ్చారో లేదో స్పష్టత లేదు. కానీ ఆ విచారణ మాత్రం ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది.
రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన వద్ద లభించిన ఫోన్ ను విశ్లేషించిన పోలీసులకు డ్రగ్స్ మూలాలు దొరికాయి. దాంతో ఆ వివరాల ఆధారంగా అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలందర్నీ.. హీరోయిన్లను ప్రశ్నించారు. వారి నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. అందరూ దొరికిపోయినట్లుగా మీడియా లీకులు వచ్చాయి. ఈ కేసుల్ని ప్రత్యేకంగా సిట్ గా ఏర్పాటు చేసి అకున్ సబర్వాల్కు అప్పగించారు.చాలా సీరియస్ గా సాగిన విచారణ హఠాత్తుగా స్లో అయిపోయింది. చివరికి ఆ కేసులన్నీతేలిపోయాయి. అందరూ క్లీన్ గా బయటకు వచ్చారు.
అయితే వారు ఇచ్చిన స్టేట్ మెంట్లలో కేసీఆర్ కుటుంబసభ్యులే డ్రగ్స్ సరఫరా చేస్తారని చప్పారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఆ స్టేట్ మెంట్లన్నీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ తీసుకున్నారని ఆయనను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన ట్వీట్ పాత వ్యవహారాలన్నిటినీ గుర్తు చేస్తోంది. మరి ప్రభుత్వం ఈ డిమాండ్ ను పరిశీలనలోకి తీసుకుంటుందా లేదా అన్నదే సందేహం.
