బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బహిరంగసభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోదీ, షాలే కాదు పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్య మంత్రులు.. అధికార కేంద్రాలన్నీ హైదరాబాద్లో కొలువు దీరతాయి. తన గురించి బాగా ఫోకస్ కావడానికి ఇంతకు మించిన చాన్స్ రాదనుకుంటున్నారేమో బండి సంజయ్ వన్ మ్యాన్ షో ప్రారంభించారు. అన్నీ తానే ఉండి చూసుకుంటున్నారు.
ముందుగా బీజేపీ తరపున 33 కమిటీల్ని నియమించారు. అందులో ఇతరులెవ్వరు లేరు. అంతా అనుచరులే. ఈ ముఫ్పై మూడు కమిటీలతో రోజూ రెండు పూట్ల ఏదో ఓ కార్యక్రమం ఉండేలా చూసుకుంటున్నారు. ఓ రోజు జన సమీకరణ సన్నాహాల సమావేశాలు పెట్టేందుకు జిల్లాలకు వెళ్తున్నారు. మరో రోజు ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఎక్కడుకు వెళ్లినా మీడియాలో రావాల్సిన.. పొందాల్సిన ప్రచారానికి మాత్రం లోటు రానీయడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మూడు వందల మంది పాల్గొంటారు. ఆ తర్వాత మోదీని మెప్పించేలా బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేశారు.
యాభై లక్షల ఆహ్వానాలని.. ఇంటింటికి వెళ్లి అందర్నీ పిలుస్తామని.. కనీసం పది లక్షల మందిని జన సమీకరణ చేస్తామని బండి సంజయ్ చెబుతున్నారు. జిల్లాల వారీగా.. పోలింగ్ బూత్ల వారీగా టార్గెట్లు పెడుతున్నారు. టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్థులకు ప్రత్యేకంగా టార్గెట్ పెడుతున్నారు. ఎలా చూసినా.. ఎక్కడ చూసినా తాను మాత్రమే ఫోకస్ అయ్యేలా చూసుకుంటున్నారు. బండి సంజయ్ హడావుడి చూసి బీజేపీలోని ఇతర పార్టీల నేతలు ఆశ్చర్యపోతున్నారు.