బీఆర్ఎస్ హయాంలో వావివరసల్లేకుండా ట్యాపింగ్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తాను సేకరించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు ఇచ్చారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని తర్వాత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కవిత, హరీష్ రావు పేర్లు కూడా ట్యాపింగ్ జాబితాలో ఉన్నాయన్నారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లను పెట్టి ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు.
న్యాయమూర్తుల ఫోన్లతో పాటు బంధువుల ఫోన్లనూ వదల్లేదని .. ఈ పనికి పాల్పడిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నేరుగా కేసీఆరే ఈ ట్యాపింగ్ చేయించారని తెలుస్తున్నప్పటికీ ఆయనను అరెస్టు చేయబోమని ప్రకటించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. అరెస్టులు చేస్తామో లేదో చెప్పాల్సింది అధికారులన్నారు. రేవంత్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ ఏది చెప్పమంటే అదే చెబుతున్నారన్నారు. కమిషన్లు, విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అన్ని ఆధారాలు ఉన్నాకేసీఆర్ కుటుంబంలో ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం ఏమిటని మండిపడ్డారు. ట్యాపింగ్ విషయంలో కేంద్ర హోంశాఖ ఉన్న అధారాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. అలాగే బండి సంజయ్ ఫోన్ ఎలా ట్యాప్ చేశారు.. అన్నది వివరించారు. ఆయన ఫోన్ కాల్స్ కొన్నివందల రికార్డింగులు ఉన్నట్లుగా కనిపించడంతో బండి సంజయ్ షాక్ కు గురయ్యారు.