బంగ్లాదేశ్ ఇప్పుడు రాక్షస మూకల చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ పౌరుడైన దీపూ చంద్రదాస్ అనే హిందువును అక్కడి యువకులు కొట్టి తలకిందులుగా వేలాడ దీసి.. సజీవంగా నిప్పు పెట్టారు. ఆయన నిప్పుల్లో కాలిపోతూ ఉంటే.. రాక్షసుల్లా చుట్టూ నృత్యాలు చేశారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. కానీ అది బంగ్లాదేశ్ గొడవ. అయితే మన దేశానికీ బాధ కలిగించే అంశాలు అందులో ఉన్నాయి. దేశ విభజన సమయంలో వారు ఇండియాను ఎంచుకోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల వారు బంగ్లాదేశీయులు అయ్యారు .. లేకపోతే భారతీయులు అయ్యేవారు. అంతకు మించి హిందువులు.
బంగ్లాలో ఘోరమైన పరిస్థితులు
బంగ్లాదేశ్‌లో హింస హిందువుల కేంద్రంగా సాగుతోంది. మైమెన్సింగ్ జిల్లాలో దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని గుంపుగా చేరి అత్యంత కిరాతకంగా కొట్టి చంపి ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసింది. కేవలం పని ప్రదేశంలో జరిగిన చిన్న వివాదానికి దైవదూషణ ముద్ర వేసి అతడిని అంతమొందించారు. అంతకుముందు ఇక్విలాబ్ మంచో ప్రతినిధి ఉస్మాన్ హదీ మృతి తర్వాత జరిగిన అల్లర్లలో మైనారిటీల ఆస్తులు, మతపరమైన స్థలాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దారుణాలు జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా , ప్రముఖులు మౌనంగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.
స్పందన లేని సమాజం – ఎందుకిలా ?
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రఫా ఉదంతంపై గొంతు ఎత్తిన వారు, ఇప్పుడు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణహోమంపై మాత్రం మాట్లాడలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే నినాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ఆ చిత్రాన్ని పంచుకున్నారు. కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను వీధుల్లో కొట్టి చంపుతున్నా, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా.. అదే సెలబ్రిటీలు పెదవి విప్పడం లేదు.
బంగ్లా హిందువులు మనుషులు కాదా?
అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న విషయాలపై స్పందించే వీరు, తమ పొరుగు దేశంలో సొంత మతానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోతుంటే స్పందించకపోవడం వారి సౌకర్యవంతమైన సామాజిక స్పృహ ను బయటపెడుతోందని విమర్శలు వస్తున్నాయి. రఫా విషయంలో మానవతావాదం గుర్తుకువచ్చిన వారికి, బంగ్లాదేశ్‌లోని హిందూ మహిళల ఆర్తనాదాలు, మైనారిటీల వేదన ఎందుకు వినిపించడం లేదనేది ప్రధాన ప్రశ్న. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్‌లో వేలాది ఇళ్లను తగులబెట్టారు, వందలాది మందిపై దాడులు చేశారు. ఈ గణాంకాలు భయానకంగా ఉన్నప్పటికీ, ప్రపంచ వేదికలపై వీటి గురించి మాట్లాడే గొంతులు తక్కువయ్యాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కూడా అంతే తీవ్రంగా ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నప్పుడు ఎంతటి ఆవేదన ఉందో సేవ్ బంగ్లాదేశ్ మైనారిటీస్ అన్నప్పుడు కూడా అంతే నిబద్ధత అవసరమని అనుకోవచ్చు. అది ఆ దేశ అంతర్గత విషయమని.. చంపుకుంటోందని ఆ దేశ పౌరుల్నే అనుకుంటే మాత్రం.. ఎప్పుడూ ఇతర అంశాలపై స్పందించకుండా ఉండటమే మంచిది.
