బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ బాట పట్టేసింది. భారత్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే తాము ఊరుకోబోమని బంగ్లాదేశ్ ను కబ్జా చేసిన నోబెల్ శాంతి బహుమతి విజేత మహమ్మద్ యూనస్ సలహాదారుడు ప్రకటించాడు. ఏం చేస్తాడంటే భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటాడట. ఆయన మాజీ ఆర్మీ చీఫ్ కూడా. ఆయన ప్రకటన ఇప్పుడు బంగ్లాపై కూడా భారత్ గురి పెట్టాల్సిన అవసరాన్ని కల్పిస్తోంది.
బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం పాకిస్తాన్ ను భారత్ ఓడించింది. బంగ్లాకు విముక్తి కల్పించింది భారత్. అయితే ఇప్పుడు వారు భారత్ పైనే రంకెలేస్తున్నారు. పొరుగుదేశం అని భారత్ సఖ్యతగా ఉంటే రెచ్చిపోతున్నారు. స్వదేశంలో అంతర్యుద్ధాన్ని సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తరిమేసి.. ప్రజల మద్దతు లేని వారు పాలన చేస్తున్నారు. వారే దేశ భవిష్యత్ ను డిసైడ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ లో అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్లీ అక్కడ హసీనా నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేందుకు భారత్ సహకరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందాల్సిన బంగ్లాదేశ్ ను నిలువునా నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కోసం భారత్ పై దాడి చేస్తామంటున్నారు. వారికి సరైన బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.