బాగుపడాలనుకున్న వాడ్ని బాగు చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ.. చెడిపోవాలనుకున్నవాడ్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఇదే. బంగ్లాదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రం గత దశాబ్ద కాలంలో ఎంతో వేగంగా మారిపోయింది. షేక్ హసీనా నేతృత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ దేశం, ఇప్పుడు అనిశ్చితి , అల్లకల్లోల పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రజాస్వామ్యం లేదు. జీవితం చివరి దశలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్..తన అధికారం కోసం దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఓ దశలో భారత్ ను అధిగమించిన బంగ్లా వృద్ధిరేటు
షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఆశ్చర్యకరమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్ రంగం ప్రపంచస్థాయికి ఎదగడంతో దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. తలసరి ఆదాయంలో ఒక దశలో భారతదేశాన్ని కూడా అధిగమించి, దక్షిణాసియాలో ఒక ఆర్థిక శక్తిగా బంగ్లాదేశ్ అవతరించింది. మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ రంగంలో సంస్కరణలు, పేదరిక నిర్మూలనలో ఆ దేశం చూపిన వేగం అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? మొత్తం అల్లకల్లోలం. ప్రజాస్వామ్య పాలకులు లేరు. ఎవరికీ బాధ్యతలేదు. టెర్రరిస్టులతో పాలకులు కలిసి టెర్రర్ రాజకీయాలు చేస్తున్నారు.
దారి తప్పిన బంగ్లా యువత
అభివృద్ధి జరుగుతూంటే దాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాల్సిన బంగ్లా యువత రాజకీయ నేతల చేతుల్లో పావుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశపెట్టిన కోటా విధానంపై రెచ్చగొట్టడంతో విద్యార్థులు రె్చిచపోయారు. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు కేటాయించిన 30 శాతం కోటాపై మొదలైన నిరసనలు, క్రమంగా హసీనా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి దేశాన్ని అగ్నిగుండంగా మార్చాయి. బంగ్లా జాతిపితను కూడా వారు ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. నిజానికి ఆ ప్రభుత్వమే కావాలని హింసను రేపుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
హిందువులపై దాడులతో అరాచకం
రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని ఛాందసవాద శక్తులు రెచ్చిపోతున్నాయి. మైనారిటీలైన హిందువులపై దాడులు జరగడం వంటివి దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ప్రస్తుతం ఆ దేశంలో సుమారు 1.31 కోట్ల మంది హిందువులు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ రాజకీయ మార్పులు బంగ్లాదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, గార్మెంట్ పరిశ్రమ సంక్షోభంలో పడటం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ దేశం మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే యూనస్ .. చేస్తున్న రాజకీయంతో అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు.
