మా సినిమా చూడండి.. నచ్చకపోతే డబ్బులు వాపస్.
మా సినిమా చూడండి.. నచ్చకపోతే.. మా ఇంటికొచ్చి కొట్టండి..
– ఇలాంటి స్టేట్ మెంట్లు చాలా చూశాం. ఓ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇదో మార్గం. జనం ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి దర్శకులు, నిర్మాతలు చేసే ట్రిక్. ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా దర్శకుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. `సినిమా నచ్చకపోతే.. నా చెప్పుతో నేనే కొట్టుకొంటా` అని ప్రెస్ మీట్ల సాక్షిగా చెప్పాడు. ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర సరైన స్పందన లేదు. దాంతో ఆ దర్శకుడు అన్నంత పని చేశాడు. తనని తాను చెప్పుతో కొట్టుకొంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `బార్బరిక్`. ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సరైన స్పందన రాలేదు. దాంతో దర్శకుడు మనస్తాపానికి గురయ్యాడు. ”ఓ థియేటర్‌కి వెళ్లా. అక్కడ పది మంది కూడా లేరు. నేను దర్శకుడ్ని అని చెప్పకుండా సినిమా ఎలా ఉంది? అని అడిగా. అందరూ చాలా పాజిటీవ్ గా స్పందించారు. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావడం లేదు? అనేది అర్థం కావడం లేదు. మలయాళం నుంచి సినిమాలు తీస్తే.. అక్కడి నుంచి మంచి కంటెంట్ వస్తే, థియేటర్లకు వెళ్తున్నారు కదా. అలాంటప్పుడు ఇక్కడి సినిమాలు ఎందుకు చూడరు? నేను ఓ నిర్ణయానికి వచ్చా.. ఇక మలయాళంలోనే సినిమా తీస్తా. అక్కడ హిట్ కొట్టి నిరూపించుకొంటా” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు. అంతే కాదు.. ”ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకొంటా అన్నాను. ఇప్పుడు అదే పని చేస్తా” అని ఆవేశంతో తన చెప్పు తీసుకొని తానే కొట్టుకొన్నారు.
ఏ సినిమాకు జనం వస్తారో, దేనికి రారో చెప్పలేని పరిస్థితి ఎదురైంది. కొన్ని సినిమాలు బాగానే ఉన్నా, ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో చూసుకొందాంలే అని ప్రేక్షకులు సైతం ఫిక్సయిపోతున్నారు. అందుకే చాలా సినిమాలకు కలక్షన్లు రావడం లేదు. ఎవరి సినిమాపై వాళ్లకు ప్రేమ ఉంటుంది. కాదనలేం. కానీ ప్రేక్షకులూ ఆ సినిమాల్ని అంతగా ప్రేమించాలంటే కంటెంట్ ఉండాలి. ఈ విషయాన్ని దర్శకులు గుర్తించుకొంటే మంచిది.