కృష్ణయ్యను దూరం చేసుకొని చంద్రబాబు తప్పు చేసారేమో?

కాపులకు రిజర్వేషన్లు కల్పించడం కోసం తెదేపా ప్రభుత్వం మంజునాద్ కమీషన్ వేయడం, ముద్రగడ పద్మనాభం ఉద్యమం మొదలుపెట్టగానే కాపులకు తప్పకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే హామీ ఇస్తుండటంతో ఊహించినట్లుగానే బీసి సంఘాలు అప్రమత్తమయ్యాయి. తమకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వెనుకడబోమని హెచ్చరించాయి. ప్రతిపక్షాల నుండి బీసీ సంఘాల నుండి ఇటువంటి హెచ్చరికలు, విమర్శలు రావడం విచిత్రం కాదు కానీ బీసీ సంఘాల నేత, తెదేపా ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూడా వారితో గళం కలిపి చంద్రబాబు నాయుడుని హెచ్చరించడం తెదేపా జీర్ణించుకోలేకపోవచ్చును.

అయితే అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ఆయనను పార్టీలోకి తీసుకొని తెదేపా తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు, ఎన్నికలలో ఓడిపోయిన తరువాత ఆయనను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కనపడేశారు. పార్టీలో నేతలు కూడా ఆయనని పట్టించుకోకపోవడంతో ఆయన క్రమంగా తెదేపాకు దూరం అయ్యేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్దపడుతుండటంతో, ఆర్. కృష్ణయ్య కూడా “బీసీల సంగతేమీ చేసారు?” అని చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నారు.

కాపులు లక్ష మంది కలిసి విద్వంసం సృష్టిస్తే వారికి భయపడి రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తే మేము ఐదు లక్షల మందితో సభలు నిర్వహించి తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కర్ర ఉన్న వాడిదే బర్రె అనే మాటయితే తాము కూడా పోరాడి తమ హక్కులను కాపాడుకోగలమని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులకు ఏవిధంగా అనేక హామీలు ఇచ్చేరో, అదేవిధంగా బీసీలకు కూడా అనేక హామీలు ఇచ్చిన సంగతి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు.

బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడానికి వెనకాడుతున్న ముఖ్యమంత్రి, కాపులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా అమలు చేస్తున్నారని కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రం ఎవరి జాగీరు కాదని అందరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వదలచుకొంటే చట్ట సవరణ చేసి వారి కోసం అదనంగా కోటాను ఏర్పాటు చేసుకొంటే మాకేమి అభ్యంతరం లేదు కానీ కాపులను తీసుకువచ్చి బీసీలలో చేర్చి మాకు అన్యాయం చేస్తామంటే చూస్తూ కూర్చోమని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ పరిణామాలతో తెదేపా ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారయింది. ఈ పరిణామాలను ఊహించబట్టే ప్రభుత్వం జస్టిస్ మంజునాద్ కమీషన్ వేసి సమయం తీసుకొంటోంది. కానీ ఇప్పుడు రెండు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు చాలా అత్యవసరంగా ఈ సమస్యను కూడా పరిష్కరించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రతిపక్షాలు బహుశః సరిగ్గా ఇటువంటి పరిణామాలనే ఆశిస్తున్నాయేమో? చంద్రబాబు నాయుడు ఎన్నికల తరువాత ఆర్. కృష్ణయ్యకు పార్టీలో తగు ప్రాధాన్యం ఇచ్చి, ఆయన సేవలను వినియోగించుకొని ఉండి ఉంటే బహుశః ఈ సమస్యను ఆయన సహాయంతో పరిష్కరించగలిగి ఉండేవారేమో? ఆయనను దూరం చేసుకోవడం వలన చివరికి ఆయన కూడా ప్రభుత్వానికి శత్రువుగా తయారు చేసుకొన్నట్లయింది. చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొన్నా ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com