Beauty Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కొత్త కథల్ని చెప్పడం చాలా తేలిక. తెలిసిన కథల్ని ఆసక్తిగా చెప్పడమే కత్తిమీద సాము. `ఇది తెలిసిన కథే` అనిపించినా, మన కథే కదా, మనలాంటి వేదనే కదా అనిపించుకొందంటే – ఆ సినిమా నిలబడుతుంది. ‘బ్యూటీ’లో ఆ లక్షణాలు ఉన్నాయి. తెలిసీ తెలియని తనంలో, ప్రేమో, ఆకర్షణో తెలియని సందిగ్థంలో, కనీ పెంచిన అమ్మానాన్నకంటే నెల రోజుల క్రితం పరిచయమైన అబ్బాయే ఎక్కువ అనిపించినప్పుడు ఓ అమ్మాయి తీసుకొనే నిర్ణయం ఎంతమందిని బాధ పెడుతుందో, ఎన్ని హృదయాల్ని గాయపరుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి కథలు, వెతలూ పేపర్లలో చదువుతున్నాం. టీవీల్లో చూస్తున్నాం. ఇలాంటి కథనే ఓ సినిమాగా మలిస్తే అది ‘బ్యూటీ’ అవుతుంది.
విశాఖపట్నంలో క్యాబ్ డ్రైవర్ గా జీవితం సాగిస్తుంటాడు నారాయణ రావు (నరేష్). కూతురు అలేఖ్య (నీలఖి) అంటే నారాయణకు పంచ ప్రాణాలు. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుతుంటాడు. పుట్టిన రోజున తనకో బైక్ కావాలని మారాం చేస్తుంది అలేఖ్య. కానీ ఆ తండ్రికి ఆర్థిక స్థోమత సరిపోదు. దాంతో అలేఖ్య అలుగుతుంది. తల తాకట్టు పెట్టయినా సరే – కూతురికి బైక్ కొనాలని నిర్ణయించుకొంటాడు నారాయణ. అన్నట్టుగానే సాయింత్రానికి బైక్ వచ్చేస్తుంది. అంతకు ముందే.. అర్జున్ (అంకిత్ కొయ్య) అనే కుర్రాడితో గొడవ రూపంలో మొదలైన పరిచయం, స్నేహంగా మారి, అటు పిమ్మట ప్రేమగా ఎదుగుతుంది. తెలిసీ తెలియని వయసులో, ఆకర్షణలో చేసిన చిన్న చిన్న తప్పులు, అవి పెద్ద వాళ్లకు తెలిసిపోతాయేమో, తన జీవితం ఏమైపోతుందో అనే కంగారులో అర్జున్‌ని ఒప్పించి… హైదరాబాద్ పారిపోయేలా ప్రేరేపిస్తుంది. ఈ సంగతి తెలిసి ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. నిండా పద్దెనిమిదేళ్లు నిండని తన కూతురు హైదరాబాద్ లో ఎన్ని కష్టాలు పడబోతోందో అని ఊహించుకొని.. మరు క్షణమే హైదరాబాద్ బయల్దేరతాడు. మరి ఆ తండ్రికి ఈ కూతురు దొరికిందా? మహా నగరంలో అలేఖ్య ఎన్ని కష్టాలు పడింది? అర్జున్ ఎలాంటి వాడు? ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికింది? అనేది తెరపై చూడాలి.
కథగా చెబితే.. ‘ఇది మామూలే కదా’ అనిపిస్తుంది. కానీ నారాయణరావు స్థానంలోనో, అలేఖ్య స్థానంలోనో ఉండి ఆలోచిస్తే… ‘ఇది మన జీవితంలో జరిగితే’ అనే భయం వేస్తుంది. కొన్ని కథలు మళ్లీ మళ్లీ చెప్పుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అవి కథలు కావు.. హెచ్చరికలు. ‘బ్యూటీ’ అలాంటి జాబితాలో చేరుతుంది. కూతురంటే ఆ తండ్రికి ఎంతిష్టమో, ఆ కూతురి గొంతెమ్మ కోరికలు ఏమిటో చెబుతూ కథని చాలా సింపుల్ గా మొదలెట్టారు. ప్రతీ ఇంట్లో జరిగే తంతే.. తెరపై కనిపిస్తుంటుంది. ఈతరం పిల్లలు దేనికి అలగాలో, ఏం అడగాలో తెలియని అమాయకత్వంలో ఉన్నారు. తండ్రి స్థోమత ఏమిటి? తమ ఆర్థిక స్థితుగతులు ఏమిటి? అనేది ఆలోచించడం లేదు. అలేఖ్య కూడా అంతే. తండ్రి క్యాబ్ డ్రైవర్ అయినా.. బైక్ కావాలని గోల పెడుతుంది. అవన్నీ సగటు ప్రేక్షకుడికి కనెక్టింగ్ అంశాలే. అలేఖ్య అర్జున్ ప్రేమలో పడిపోవడానికి పెద్దగా కారణాలు కూడా ఉండవు. ఈ వయసులో ఇలానే ప్రేమ మొదలవుతుందేమో అని సర్దుకుపోవాలి. ఇంట్లోంచి అలేఖ్య పారిపోవాలి అని అనుకోవడానికి బలమైన కారణాలు సెట్ చేశాడు దర్శకుడు. అవన్నీ ఆర్గానిక్ గా అనిపిస్తాయి. ఓ మధ్యతరగతి ఇల్లాలు తన పరువు కోసం పడే తాపత్రయం.. బంగారు దుకాణం సీన్లో దర్శకుడు బాగా చూపించగలిగాడు. ఆ సీన్‌ని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఎమోషనల్ టచ్‌తో సాగుతుంది.
ద్వితీయార్థం కూడా తెలిసిన కథే, తెలిసిన సంగతులే తెరపై సన్నివేశాలుగా సాగుతుంటాయి. అలేఖ్య, అర్జున్ ఇల్లు వెదుక్కొంటూ హైదరాబాద్ అంతా తిరగడం బోర్ కొట్టిస్తుంటుంది. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డబ్బులు కక్కుర్తి పడిన వైనం, దాన్నుంచి పండిన డ్రామా ఇవన్నీ కాస్త డ్రామాని ఎలివేట్ చేశాయి. ఈకాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ల ఆలోచన ఉలా వుంది? ఎందుకు మాయ మాటల్ని నమ్మి మోసపోతున్నారు? అనే విషయాల్ని సంభాషణలు, సందేశాల రూపంలో కాకుండా సన్నివేశాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కాస్త కంగారు పెడుతుంది. క్లైమాక్స్ ఊహించినదే. కాకపోతే ఇంకాస్త బలంగా ఉండుంటే బాగుండేది. కుమారి 21 ఎఫ్ కథ, కథనం మామూలుగానే సాగుతుంది. క్లైమాక్స్ ఊపేస్తుంది. అదే ఆ సినిమా ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేసింది. అలాంటి క్లైమాక్స్ ఇక్కడా ఉండి ఉంటే బాగుండేది. ఇంకాస్త బలమైన ముద్ర వేసేది.
అంకిత్ కొయ్య నటన డీసెంట్ గా ఉంది. తనలో మరో కోణం ఎలివేట్ అవ్వడానికి ఈ పాత్ర ఉపయోగపడింది. నీలఖికి ఇదే తొలి సినిమా అంటే నమ్మబుద్ది కాదు. అంత చక్కగా ఇమిడిపోయింది. ఈకాలం అమ్మాయిలకు ప్రతిరూపమైన పాత్ర. బాగా చేసింది. ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేష్ తన అనుభవాన్ని రంగరించారు. వాసుకికి కూడా గుర్తుండిపోయే పాత్ర పడింది. బంగారం దుకాణం సీన్లో తన నటన కచ్చితంగా కదిలిస్తుంది.
ఆర్వీ సుబ్బు అందించిన కథలో సహజత్వం ఉంది. తెలిసిన కథే అయినా కనెక్ట్ అయ్యే ఎమోషన్ దాగుంది. స్వతహాగా జర్నలిస్ట్ కాబట్టి సమాజంలో జరుగుతున్న సంగతులే కథ రూపంలో చెప్పాలన్న బలమైన ఇంటెన్షన్ కనిపించింది. ఇంట్రవెల్ సీన్… ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకొంటాయి. అయితే.. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ కాస్త ఎంటర్టైన్మెంట్ పంచే అవకాశం ఉంది. మరీ ఇంత సీరియస్ మోడ్ లో సాగాల్సిన అవసరం కూడా లేదు. లవ్ స్టోరీ కాస్త కొత్తగా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది. సంభాషణలు కూడా ఇంకా పదునుగా ఉండాలి. కొన్ని చోట్ల డైలాగులు అస్సలు ఎలివేట్ కాలేదు. చిన్న సినిమా అయినా, మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకొన్నారు. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. విజయ్ బుల్గానిన్ పాటల్లో ‘కన్నమ్మా’ రిపీట్ మోడ్‌లో వినేలా వుంది.
‘బ్యూటీ’ కథ కాదు. ఓ హెచ్చరికలా భావించొచ్చు. తెలిసిన సంగతులే తెరపై చెప్పినా అవసరమైన విషయం కాబట్టి దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సినిమా తల్లిదండ్రులు చూడకపోయినా ఫర్వాలేదు. కూతుర్లు మాత్రం తప్పకుండా చూడాలి. ప్రేమకూ, ఆకర్షణకూ మధ్య తేడా తెలుసుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమకంటే మించింది, గొప్పదీ లేదని అర్థం చేసుకోవాలి.
తెలుగు360 రేటింగ్: 2.5/5