`పెద్దకూర’, `తోటకూర’…రెండూ తప్పే

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ దుమారం రేపుతోంది. చదువు నిమిత్తం వచ్చిన విద్యార్థులు తమ ఆకలి తీర్చుకోవడానికి ఏరకమైన ఆహారం తినాలన్న విషయంపై కచ్చితంగా వారికి స్వేచ్ఛ ఉంటుంది. దీన్ని కాదనలేము. కాకపోతే గొడ్డుమాంసం కూర (పెద్దకూర) తినడాన్ని ఓ ఉత్సవంలాగా, పండుగలాగా, రెచ్చగొట్టే విధంగా చేసుకోవడం దగ్గరే వివాదాం రాజుకుంటోంది. పెద్దకూర (గొడ్డుమాంసం) తినండి, లేదా పందిమాంసం తినండి, కాదంటే తోటకూర తినండి. ఎవ్వరికీ ఎలాంటి పట్టింపులు లేవు. కాకపోతే చదువుకునే చోట రెచ్చగొట్టే రీతిలో ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టడం, దాన్ని అతిపెద్ద సవాలుగా, రాజకీయ వివాదంగా మార్చడంవల్లనే పోలీసులు ఆంక్షలు విధించాల్సి వస్తున్నది.

దేశప్రజలకు తినడానికి తిండిగింజలున్నాయోలేదో నాయకులు ఆలోచించాలి. అంతేకానీ దేశంలో ఎవరు బీఫ్ తింటున్నారు?, మరెవరు పందిమాంసం తింటున్నారో ఆలోచించనక్కర్లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గోడు కావాలన్నదే మన లక్ష్యం. ఒకప్పుడు నాయకులు ఈ మూడింటిమీద శ్రద్ధపెట్టేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు దురుద్దేశాలతో విద్యార్థులతో కలిసి గొడ్డుమాంసం పేరిట నానాయాగీ చేస్తున్నారు. చేయిస్తున్నారు. దీంతో ఇదో పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది.

మనదేశ రాజ్యాంగంలో తినే ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉన్నదో ఏ రకమైన ఆహారాన్ని ఎంచుకోవాలన్న విషయంలోనూ అంతే స్వేచ్ఛ ఉన్నదన్నది అప్రకటితంగా సాగిపోతున్న భావన. అయితే ఈ స్వేచ్ఛ చివరకు రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీయడం మొదలైంది. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ చేసుకోవడం మొదటినుంచీ వివాదమే సృష్టిస్తోంది. పెద్దకూర పండుగ అన్నప్పుడల్లా ఉత్కంఠ చోటుచేసుకుంటూనే ఉంది. ఒకరు తినే ఆహారాన్నీ, కట్టుబొట్టుతీరును, ఆలోచనలను మరొకరు చిన్నచూపు చూడటం తప్పే. అయితే దేశమంతటా అసహనం పేరుకుపోయిందన్న పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. చివరకు ఇది ఎక్కడిదాకా దారితీసిందంటే, హిందూ దళితులు తమకుతాము ఆ మతం నుంచి దూరమయ్యేటంతవరకు వెళుతోంది.

నిజానికి ఒకరు పెద్దకూర పండగ చేసుకోమనండీ, ఇంకొకరు తోటకూర పండుగ చేసుకోమనండి. అది వాళ్లవాళ్ల ఇష్టం. కాకపోతే యూనివర్శిటీ మార్గదర్శాలకు అనుగుణంగా ఉండాలవి. హింసాత్మక సంఘటనలకు పాల్పడటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు విషయాన్ని పక్కనబెట్టి ఇరువర్గాలవాళ్లు మాటల యుద్ధానికి దిగడం, హింసకు పాల్పడటం కచ్చితంగా తప్పే.

బిజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక చురక అంటించారు. ఉస్మానియాలో పెద్దకూర పండుగ చేసుకుంటే దాన్ని అడ్డుకుంటామని అంటున్నారాయన. డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్శిటీలోని కొన్ని విద్యార్థి సంఘాలు బీఫ్ పండుగ జరుపుకుంటామనడంతో వివాదం మరోసారి రాజుకుంది. దీనిచుట్టూ రాజకీయాలు ముసురుకోవడం మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదులు చేసేదాకా ఈ వ్యవహారం వెళ్ళింది. విద్యార్థిసంఘాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ నాయకులు మాత్రం దీన్ని విద్యార్థుల `ఆత్మగౌరవ పోరాటం’గా చిత్రీకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఊగిపోతున్నారు. బీఫ్ ఫెస్టివల్ ని అడ్డుకోవడాన్ని, మరికొందరు `హిందూమతోన్మాదుల పెత్తనం’గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు(5-12-15) అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారట. ఏడవ తేదీన నెక్లెస్ రోడ్డులో 5కె రన్ కూడా పెడుతామంటున్నారు.

ఈ మధ్య ఒక మాట వినిపించింది – `వాళ్లు గొడ్డుమాంసం పండగ పెడితే, మేము పందిమాంసం పండుగ చేస్తాం’ – ఇలాంటి వాఖ్యల వల్ల సహనం కుచించుకుపోతుంది. అసహనం పెట్రేగిపోతుంది. ఫలితంగా ఒకరిపై మరొకరు దాడులకు దిగే పరిస్థితి తలెత్తుంది. బీఫ్ పండుగ జరిపే రోజునే (10-12-15) పోటీగా పోర్క్ ఫెస్టివల్ (పందిమాంస పండుగ) జరుపుతున్నామనీ, దానికి అందరూ ఆహ్వానితులేనంటూ కటౌట్లు వెలిశాయి. ఈ పోర్క్ ఫెస్టివల్ ని అదేరోజు పెట్టడంతో బీఫ్ ఫెస్టివల్ కి వ్యతిరేకంగా ఏర్పాటుచేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పందికూర పండుగ ఏర్పాటు చేసిన ఓయు జేఏసీ వాళ్లు మాత్రం తామెవరికీ మద్దతుగా కానీ, లేదా వ్యతిరేకతతో కానీ ఈ ఫెస్టివల్ పెట్టడంలేదని అంటున్నారు. ఎవరి అలవాట్ల ప్రకారం పండుగలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు ఫెస్టివల్స్ ఆర్ట్స్ కాలేజీ వద్దనే జరగబోతున్నాయి. అయితే మరోపక్క ఉస్మానియా విశ్వవిద్యాల పరిధిలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఓయూ క్యాంపస్ బయట ఎలాంటి ఫెస్టివల్స్ నైనా పెట్టుకోవచ్చని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు ఉన్నవి దేనికి? చదువుకోవడానికే కానీ, రాజకీయాలు చేయడానికి కాదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఈమధ్య అన్నారు. కావాలంటే ఇంట్లోనో, లేదా షాదీఖానాలోనే బీఫ్ తినండంటూ ఆయన సూచనకూడా చేశారు.

తిండి విషయంలో హక్కులను మరింత నొక్కి చెప్పాలని ఈ తరహా ఫెస్టివల్స్ నిర్వాహకులు భావించిఉండవచ్చు, అలాంటి ఫెస్టివల్స్ కి ప్రముఖనాయుకులు, మేధావులు హాజరై రాజకీయాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి పండుగలు (స్నాతకోత్సవం, జాతీయ పండుగలు, సంస్థాపక దినోత్సవం వంటివి) చేసుకోవాలో, మరేవి చేసుకోకూడదో కచ్చితమైన మార్గదర్శకాలుండాలి. వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా చేయాలంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా ?

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com