తెలుగు సినిమాలో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ అన్నీ చాలా ప్లాన్డ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ప్రీవిజువలైజేషన్ కూడా ముందుగానే క్లియర్‌గా చూసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక కీలక అంశం మాత్రం ఇంకా తగిన ప్రాధాన్యత పొందడం లేదు.. అదే సంగీతం.
ఒకప్పుడు తెలుగు సినిమాలో సంగీతం అంటే ప్రధానంగా పాటలే. షూటింగ్‌కి ముందే పాటలు సిద్ధం చేసుకునే వారు. కానీ కాలం మారింది. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) సినిమా అనుభవాన్ని పూర్తిగా మార్చే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో థియేటర్స్‌లో కిక్ రావాలంటే బీజీఎం కీలకం.
కానీ బీజీఎం చేయడం పాటల కంటే చాలా క్లిష్టం. కథలో ప్రతి క్యారెక్టర్ ఆర్క్, ఎమోషన్, ఎత్తుపల్లాలను అర్థం చేసుకుని, వాటికి తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేయాలి. దానికి చాలా సమయం కావాలి.
హాలీవుడ్ సినిమాల్లో పాటలు ఉండవు. అక్కడ స్క్రిప్ట్ స్టేజ్ నుంచే డైరెక్టర్, కంపోజర్ కలిసి ట్రావెల్ అవుతారు. కథకు సరిపోయే సౌండ్, వాయిద్యాలు, ఆ ఫీల్‌ను తెచ్చే మ్యూజిషియన్స్.. అన్నింటిపైనా ప్రత్యేక దృష్టి పెడతారు. కొంతమంది డైరెక్టర్లు అయితే తమ కథకు ప్రత్యేకమైన సౌండ్ కోసం కొత్త ప్రీసెట్స్ కూడా డెవలప్ చేయిస్తారు. అందుకే అక్కడి సినిమాల్లో ప్రతి సీన్‌కి ప్రత్యేకమైన మ్యూజికల్ ఐడెంటిటీ కనిపిస్తుంది.
ఇండియన్ సినిమాకి వస్తే పరిస్థితి కొంచెం భిన్నం. ప్రేక్షకుల అభిరుచి మారినా, దర్శక-నిర్మాతల దృష్టి ఇంకా ఎక్కువగా పాటలపైనే వుంది. బీజీఎంకి అవసరమైన సమయం, శ్రమ ఇంకా పూర్తిగా గుర్తించలేదు. తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఈ సినిమా చాలా కాలం ప్రొడక్షన్లో ఉంది. మధ్య మధ్యలో వచ్చిన ఫుటేజ్ ఆధారంగా బీజీఎం ట్రాక్స్‌ను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కొన్ని డమ్మీ ట్రాక్స్ కూడా కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. కానీ వాటిని ఫైనల్ లెవెల్‌కు తీసుకెళ్లాలంటే మరింత సమయం అవసరం. అనుకోని పరిస్థితుల్లో సినిమా రిలీజ్‌కి రావడంతో ఆ సమయం దొరకలేదు.
మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి క్లారిటీ ఉంది. ఒక ప్రాజెక్ట్‌కు ప్రేక్షకులు మెచ్చే స్థాయి మ్యూజిక్ ఇవ్వాలంటే ఎంత సమయం అవసరమో ఆయనకి తెలుసు. అందుకే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఇవ్వలేక ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యరు. ఈ విషయంలో ఆయనను తప్పుపట్టడం సరికాదు.
తర్వాత ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తమన్ తన స్టైల్లో ఫాస్ట్‌గా పని పూర్తి చేశారు. ఆయన పనిని ఆయన చేశారు. ఆ మ్యూజిక్ వినడానికి ఎనర్జిటిక్ గ వున్నా ఎమోషన లో ఆత్మ మాత్రం కనిపించలేదు. ఇక్కడ తమన్‌ను కూడా పూర్తిగా తప్పుపట్టలేం. ఎందుకంటే ఒక సీన్లోని ఎమోషన్‌ను పట్టుకొని, దానికి న్యాయం చేసే మ్యూజిక్ ఇవ్వాలంటే సమయం చాలా అవసరం. అదే ఇక్కడ కొరతగా మారింది.
సినిమా చూసిన తర్వాత చాలా మంది “దేవిశ్రీ బీజీఎం చేసుంటే ఎలా ఉండేదో?” అనే ప్రశ్న వేసుకున్నారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో ఆయన ఇచ్చిన బీజీఎం ట్రాక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఒక మాస్ సినిమాకి ఐకానిక్ సౌండ్ ఎలా ఉండాలో ఆయన అప్పుడే చూపించారు.
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలా హమ్ చేసుకునే ట్రాక్స్ మాత్రం మిస్ అయ్యాయి. ఇక్కడ ఎవరినీ వ్యక్తిగతంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం సిస్టమ్‌లో ఉన్న ఒక గ్యాప్. సినిమా విజయంలో సంగీతం సగం కథ చెబుతుంది. అంత కీలకమైన సగానికి సరైన సమయం ఇవ్వకపోతే… తెరపై మేజిక్ పుట్టడం కష్టం. సంగీతం తనకు కావాల్సిన సమయం కోరుకుంటుందనే వాస్తవాన్ని గ్రహించుకొని అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి గజిబిజి పరిస్థితుల నుంచి బయటపడొచ్చు.

