పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరులో భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,బీజేపీ కీలక నేత సువేందు అధికారి మధ్య మరోసారి హోరాహోరీ పోరు సాగనుంది.
నందిగ్రామ్ పగ.. భవానీపూర్ వేదికగా!
గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికగా జరిగిన పోరులో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ పరాభవానికి ప్రతికారం తీర్చుకోవడమే లక్ష్యంగా, ఈసారి తన సొంత గడ్డ అయిన భవానీపూర్ నుంచే సువేందును ఢీకొట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈసారి కేవలం భవానీపూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సువేందు అధికారిని తన ఇలాకాలోకి ఆహ్వానించి ఓడించడం ద్వారా తన రాజకీయ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఆమె వ్యూహం పన్నారు.
సువేందు అధికారి డబుల్ గేమ్
సువేందు అధికారి ఈ ఎన్నికల్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అటు నందిగ్రామ్ నుండి, ఇటు భవానీపూర్ నుండి రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని భవానీపూర్‌లో కట్టడి చేయడం ద్వారా ఆమెను రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఒకవేళ భవానీపూర్‌లో మమతను ఓడిస్తే, అది బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పతనానికి నాంది అవుతుందని సువేందు భావిస్తున్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ అనుచరుడు అనే సెంటిమెంట్‌ను బలంగా వాడుకుంటున్నారు.
సిట్టింగ్‌ల తొలగింపు – దీదీ క్లీన్ స్వీప్ వ్యూహం
ఈ ఎన్నికల్లో మమత కేవలం సువేందుపైనే దృష్టి పెట్టకుండా, పార్టీలో అంతర్గత ప్రక్షాళన కూడా చేపట్టారు. సుమారు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని చూస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని, పనితీరు సరిగా లేనివారిని పక్కన పెట్టి కొత్త రక్తాన్ని బరిలోకి దింపారు. మహిళా ఓటర్లు భారీగా తృణమూల్ వైపు మొగ్గు చూపుతుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. హిందూ ఓట్ల ధ్రువీకరణ ద్వారా మమతను దెబ్బతీయాలని సువేందు ప్రయత్నిస్తున్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా, బెంగాలీ అస్తిత్వం వర్సెస్ జాతీయవాదం అనే అంశాల చుట్టూ ఈ ఎన్నికల ప్రచారం సాగుతోంది.


