రివ్యూ: భ‌గ‌వంత్ కేస‌రి

Bhagavanth Kesari Movie Review

తెలుగు360 రేటింగ్ : 3/5

హీరోలు మార‌నంత వర‌కూ క‌థ‌లూ మార‌వు. సినిమాలూ మార‌వు. `మా అభిమానుల‌కు ఇవే కావాలి.. కాబ‌ట్టి ఇలానే ఉంటాం` అని హీరోలు మొండి ప‌ట్టు ప‌ట్టుకూని కూర్చొనేంత వ‌ర‌కూ సినిమాలు మార‌వు. వాటి ఫ‌లితాలూ మార‌వు. అలాగ‌ని.. హీరోలు త‌మ‌ది కాని దారిలో వెళ్లి అద్భుతాలు చేయ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌డం లేదు. కాస్త కొత్త‌గా ట్రై చేస్తే చూడాల‌న్న‌ది అభిమానుల ఆశ‌. అలాంటి క‌థ‌ల‌కే ఇప్పుడు ప‌ట్టం క‌డుతున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ లాంటి మాస్ హీరో ఆలోచ‌న‌లు అభిమానుల చుట్టేనే తిర‌గ‌డంలో పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌డం మాస్ హీరోల‌కు అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం. అదే స‌మ‌యంలో.. కాస్త భిన్నంగా ఏదో చేద్దామ‌న్న ఆలోచ‌న‌తో చేసిన సినిమా `భ‌గ‌వంత్ కేస‌రి`. అటు.. అనిల్ రావిపూడికీ అంతే. త‌ను వ‌రుస‌గా హిట్లు కొట్టాడు. అవ‌న్నీ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమాలే. ఆ ఇమేజ్‌ని, ఆ ఛ‌ట్రాన్నీ దాటి… ఓ సీరియ‌స్ క‌థ‌ని, ఎమోష‌న్ డ్రామానీ తీయాల‌నుకొన్నాడు. అదే భ‌గ‌వంత్ కేస‌రి. మ‌రి బాల‌య్య‌, అనిల్ రావిపూడి త‌మ ల‌క్ష్యాన్ని చేరుకొన్నారా, లేదా? భ‌గ‌వంత్ కేస‌రిలో ఉన్న ఆ కొత్త ఫార్మెట్ ఏమిటి?

భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ‌) హ‌త్యానేరం మోప‌బ‌డిన జైలు ప‌క్షి. జైల‌ర్ (శ‌ర‌త్ కుమార్‌) అత‌ని క‌థ తెలుసుకొని.. స్వేచ్ఛ‌ని ప్ర‌సాదిస్తాడు. అయితే అనుకోకుండా జైల‌ర్ రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణిస్తే.. ఆ జైల‌ర్ కూతురు విజ్జు (శ్రీ‌లీల‌) బాధ్య‌త‌ల్ని తాను భుజానెత్తుకొంటాడు. విజ్జుని ఆర్మీకి పంపుతాన‌ని జైల‌ర్‌కి మాటిస్తాడు భ‌గవంత్ కేస‌రి. విజ్జుకి మాత్రం ఆర్మీలోకి వెళ్లాల‌ని ఉండ‌దు. పెళ్లి చేసుకొని సెలిటైపోవాల‌నుకొంటుంది. మ‌రి.. భ‌గ‌వంత్ కేస‌రి ఇచ్చిన మాట ఎలా నిల‌బెట్టుకొన్నాడు? ఈ ప్ర‌యాణంలో త‌న‌కు ఎలాంటి ఆటంకాలు ఎదుర‌య్యాయి? అనేది మిగిలిన క‌థ‌.

అనిల్ రావిపూడి రాసుకొన్న క‌థేం కొత్త‌ది కాదు. ఇలాంటి క‌థ‌లు బాల‌య్య‌కు కొత్తంతే! బాల‌య్య‌ని కొత్త‌గా చూపించాలి, `నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌`లో తీర్చిదిద్దాల‌న్న త‌ప‌న‌… అనిల్ రావిపూడిలో అణువ‌ణువుగా క‌నిపించింది. జైలు సీన్ నుంచే కొత్త బాల‌య్య‌ని చూస్తారు ప్రేక్ష‌కులు. సెటిల్డ్ గా కూర్చుని డైలాగులు చెప్ప‌డం, సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌, బేటీకో షేర్ బ‌నావో కాన్సెప్ట్ ఇవ‌న్నీ రొటీన్ మాస్ మ‌సాలా క‌థ‌కి కొత్త హంగులు తీసుకొచ్చాయి. అనిల్ రావిపూడి ఈ క‌థ‌ని చెప్ప‌డంలో ఓ మీట‌ర్ ఫాలో అయ్యాడు. కొంత క‌థ‌.. కొంత ఎలివేష‌న్‌.. కొంత ఎమోష‌న్ ఇలా పేర్చుకొంటూ పోయాడు. పోలీస్ స్టేష‌న్‌లో టీని వెచ్చ‌బెట్టి ఇవ్వ‌డం, ర‌విశంక‌ర్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇవ్వ‌డం అభిమానుల్ని మెప్పించే విష‌యాలే. ఊచ‌కోత ఎపిసోడ్ డైలాగుల్లో చెప్ప‌డం `బాషా` స్టైల్‌ని గుర్తుకు తెస్తుంది. ఇంట్ర‌వెల్ ఫైట్‌.. రెగ్యుల‌ర్ పేట్ర‌న్‌లోనే సాగినా.. అక్క‌డే.. విల‌న్ కీ, హీరోకీ లింక్ పెట్ట‌డం బాగుంది. ఎవ‌రిదో క‌థ‌లోకి హీరో వెళ్తున్నాడేమో అనిపించినా, ఈ క‌థే. హీరోదే అని ప్రేక్ష‌కుడూ ఓన్ చేసుకొనే అవ‌కాశం ఇచ్చింది. ఫ‌స్టాఫ్ లోకాజ‌ల్ ట్రాక్ కాస్త విసుగెత్తిస్తుంది. క‌థ‌లోకి వెళ్ల‌డానికీ ద‌ర్శ‌కుడు కొంత టైమ్ తీసుకొన్నాడు. విజ్జితో.. భ‌గ‌వంత్ కేస‌రి బాండింగ్ కూడా స‌రిగా చూపించ‌లేక‌పోయాడేమో అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న కంప్లైంట్స్ త‌ప్ప‌.. ఫ‌స్టాఫ్ లో పెద్ద‌గా లోటుపాట్లేం లేవు.

సెకండాఫ్‌లో బాల‌య్య‌లోని మ‌రో కోణం బ‌య‌టకు వస్తుంది. పోలీస్ గా బాల‌య్య చేసిన సినిమాల‌న్నీ దాదాపుగా హిట్టే. ఆ గెట‌ప్పులో బాల‌య్య కూడా బాగుంటాడు. కానీ… సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో బాల‌య్య‌ని చూసిన‌ప్పుడు క‌లిగిన తృప్తి.. యంగ్ లుక్‌లో ఉండ‌దు. మ‌ళ్లీ ఎంత త్వ‌ర‌గా సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ వ‌స్తుందా? అని ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానులూ ఎదురు చూస్తుంటారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంది త‌ప్ప‌.. అక్క‌డ ట్విస్టులూ, ట‌ర్న్‌లూ ఏం క‌నిపించ‌వు. దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడించే ఓ వ్యాపార వేత్త‌.. ఓ పీఏ (బ్ర‌హ్మాజీ)ని ప‌ట్టుకోవ‌డానికి ఆపపోపాలు ప‌డుతుండ‌డం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సినిమాటిక్ లిబ‌ర్టీ కూడా ద‌ర్శ‌కుడు చాలానే తీసుకొన్నాడు. ఓ స‌న్నివేశంలో.. హీరో చిన్న‌పిల్ల‌ల‌కు గుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ గురించి చెబుతాడు. నిజానికి ఈ క‌థ‌కు అవ‌స‌రం లేని సీన్‌. కానీ.. స‌మాజానికి ఏదో చెప్పాల‌న్న ద‌ర్శ‌కుడి తాప‌త్ర‌యం మంచిది కాబ‌ట్టి.. అక్క‌డా పాస్ మార్కులు ప‌డ‌తాయి. ఆడ‌పిల్ల‌ని లేడి పిల్ల‌లా కాదు.. పులి పిల్లలా పెంచాల‌న్న ఆలోచ‌న‌ని గ‌ట్టిగా జ‌నంలోకి పంపాల‌నుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ఆ విష‌యాన్ని చెప్ప‌డం కోసం కొన్ని అస‌వ‌ర‌మైన స‌న్నివేశాల్ని సైతం రాసుకోవాల్సివ‌చ్చింది. ముఖ్యంగా ఆర్మీ ట్రైనింగ్ ఆఫీస‌ర్ (భ‌ర‌త్) ఎపిసోడ్‌. ప్రీ క్లైమాక్స్ ద‌గ్గ‌రే పెద్ద ఫైట్ పెట్టి సినిమాని ముగించొచ్చు. కానీ బేటీకో షేర్ బ‌నావో కాన్సెప్ట్ అక్క‌డితో ఆగిపోతుంది. అందుకే.. దాన్ని క్లైమాక్స్ వ‌ర‌కూ పొడిగించాడు. చివ‌రి ఫైట్ లో బాల‌య్య‌తో క‌లిసి శ్రీ‌లీల ఫైట్ చేయ‌డం.. అభిమానుల‌కు సైతం స‌ర్‌ప్రైజ్‌చేసే ఎలిమెంట్. దాన్ని బాగా వాడుకొన్నాడు. సెకండాఫ్‌లో విల‌న్ త‌న బ‌లాన్ని చూపించ‌లేక‌పోవ‌డం, హీరోకి ఎదురు లేక‌పోవ‌డం సినిమాటిక్‌గా అనిపించినా.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో అనిల్ రావిపూడి మార్క్ సీన్లు బాగా పేలాయి. ముఖ్యంగా క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూడు అనే ఓ రొమాంటిక్ పాట‌ని… ఫైట్ సీన్ కి వాడుకోవాల‌న్న ఆలోచ‌న బాగుంది. అక్క‌డే రావిపూడిలోని కామెడీ టైమింగ్ బాగా ప‌నికొచ్చింది.

ఈమ‌ధ్య ఏ సినిమా చూసినా.. పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు దీపావ‌ళి చేసే ఓ సీన్ క‌నిపిస్తోంది. ఇది వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. ఈ సినిమాలోనూ ఓ పెద్ద మిష‌న్ గ‌న్ ఎత్తుకొచ్చారు. దాంతో.. ఇక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు రొటీన్ గా ఆలోచించాడు అనిపించింది. స‌డ‌న్ గా.. హీరో వాటిని ప‌క్క‌న పెట్టి.. `నా నుంచి ఇంకా ఏదో ఆశిస్తారు` అంటూ సిలిండ‌ర్ల‌ను పేల్చ‌డం కొత్త‌గా అనిపించింది. అలా.. ఫైట్ సీన్స్ లో కూడా రావిపూడి లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది.

నేలకొండ భ‌గ‌వంత్ కేస‌రిని బాల‌య్య ఆవ‌హించేశాడు. ఆ పాత్ర‌కు నూరుశాతం న్యాయం చేశాడు. బాల‌య్య‌ని ఇలా సెటిల్డ్ గా చూస్తే ఫ్యాన్స్‌కి కూడా న‌చ్చేస్తుంది. అక్క‌డ‌క్క‌డా బోయ‌పాటి మార్క్ హీరోయిజం క‌నిపించింది. బాల‌య్య‌ని ఇక మీద‌ట ఇలాక్కూడా చూపించొచ్చు అనే ఆలోచ‌న రాబోయే ద‌ర్శ‌కుల‌కు వ‌స్తుంది. శ్రీ‌లీల కొత్త‌గా క‌నిపించింది. త‌న‌ని మంచి డాన్స‌ర్‌గా చూసిన క‌ళ్లు.. ఇప్పుడు త‌న‌లోని న‌టినీ చూస్తాయి. కాజ‌ల్ ట్రాక్ పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. కాజ‌ల్ లో ఇది వ‌ర‌క‌టి ఛార్మ్ కూడా లేదు. అర్జున్ రాంపాల్ పాత్ర‌ని ముందు బీభ‌త్సంగా ప‌రిచ‌యం చేసి, ఆ త‌ర‌వాత‌.. త‌ను కూడా హీరోయిజం ముందు త‌ల‌వొంచుకొని మౌనంగా నిల‌బ‌డిపోయేలా తీర్చిదిద్దారు. కాక‌పోతే.. అర్జున్ రాంపాల్ విల‌న్ పాత్ర‌ల‌కు వాడుకోవ‌చ్చ‌న్న హింట్‌… భ‌గ‌వంత్ కేస‌రి ఇచ్చింది.

రెగ్యుల‌ర్ క‌థే రాసుకొన్నా.. మ‌హిళా సాధికారిత అనే ఓ పాయింట్ జోడించి ఈ క‌థ‌కు కొత్త రంగు తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. శ్రీ‌లీల పాత్ర‌, దాని చుట్టూ న‌డిచే స‌న్నివేశాలు, ఆ పాత్ర కోసం హీరో ప‌డే ఆరాటంతో రెగ్యుల‌ర్ ర‌మర్షియ‌ల్ సినిమానే అయినా, కొత్త‌గా అనిపిస్తుంది. పైగా బాల‌య్య‌ని చాలా సెలిల్డ్ గా చూపించి మార్కులు కొట్టేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య‌తో సినిమా అంటే బోయ‌పాటే చేయాలి అనుకొనేవాళ్లు కూడా ఇప్పుడు రావిపూడి పేరు జోడిస్తారు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఊపు తీసుకొచ్చాడు. పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ఉన్న ఒక‌ట్రెండు పాట‌లు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. అనిల్ రావిపూడి ర‌చ‌యిత‌గానూ మార్కులు కొట్టేస్తాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేట‌ప్పుడు తాను రాసుకొన్న డైలాగులు మ‌రింత బాగున్నాయి. సినిమా అంతా భారీద‌నం క‌నిపించింది. ఈద‌స‌రాకి ఓ కొత్త ఫ్లేవ‌ర్ ఉన్న‌ క‌మర్షియ‌ల్ సినిమానీ, కొత్త బాల‌య్య‌ని చూడాల‌నుకొనే ప్రేక్ష‌కుల‌కు `భ‌గ‌వంత్ కేస‌రి` మంచి ఆప్ష‌న్‌.

తెలుగు360 రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close