విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి చిత్రం ‘కింగ్ డమ్’ బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది. విడుదలకు ముందున్న అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. నిర్మాత నాగవంశీకి ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. బయ్యర్ల దీ అదే బాధ. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో చూడనివాళ్లు ఓటీటీలో చూసి, ఆదరిస్తారని నిర్మాత నాగవంశీ నమ్మకం. అయితే.. ఓటీటీ వెర్షన్ చూసిన వాళ్లు మరింత డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం.. ‘హృదయం లోపల’ అనే పాటని ఎడిట్ చేయడం.
విజయ్ – భాగ్యశ్రీ బోర్సేల పై తెరకెక్కించిన ఈపాటకు మంచి ఆదరణ లభించింది. అయితే థియేటర్ వెర్షన్లో ఈ పాట లేదు. దాంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ హర్టయ్యారు. ఈ పాట ఎందుకు తీసేశారు? అనే ప్రశ్నకు నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ‘కథ ఫ్లోకి అడ్డొచ్చింది. అందుకే ఈ పాటంటే ఎంత ఇష్టం ఉన్నా, తొలగించాల్సివచ్చింది’ అని చెప్పారు. ఈ పాటని కనీసం ఓటీటీ వెర్షన్ లో అయినా చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇక్కడా నిరాశే ఎదురైంది. థియేట్రికల్ కట్ నే ఓటీటీకి పంపారు. కొన్నిసార్లు ఓటీటీ సంస్థలు చాలా స్పష్టంగా ఉంటాయి. ‘మాకు థియేటర్ కట్ కావాలి’ అని అడుగుతాయి. ఇంకొన్నిసార్లు ఎడిట్ చేసిన సీన్లు, పాటలు కూడా జోడించాలని షరతు పెడతాయి. నెట్ ఫ్లిక్స్ లో.. డైరెక్టర్ కట్ వెర్షన్లు ఎక్కువ వస్తాయి. ‘యానిమల్’, ‘పుష్ప’ సినిమాలు థియేటర్ తో పోలిస్తే ఓటీటీలో లెంగ్తీగా ఉంటాయి. థియేటర్ లో చూడని కొత్త సీన్లు.. ఓటీటీలో కనిపించాయి. దాంతో… వాటికి ఓటీటీలోనూ మంచి మైలేజీ వచ్చింది. ‘కింగ్ డమ్’ కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థనే చేజిక్కించుకొంది. అందుకే ఈసారి ఓటీటీ వెర్షన్ లో పాట ఉంటుందని భావించారు. కానీ దాన్ని తొలగించేసరికి భాగ్యశ్రీ ఫ్యాన్స్ మళ్లీ ఫీలయ్యారు. పాట ఉన్నా, లేకున్నా… వ్యూవర్ షిప్లో పెద్దగా తేడా ఉండదని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భావించి ఉంటుంది. అందుకే దాన్ని ఈసారి కూడా లైట్ తీసుకొన్నారేమో?
