ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లకు. వరుసగా రెండు ఫ్లాపులు తగిలితే చాలు…వాళ్ల మెడలో ఐరెన్ లెగ్ అనే దండ వేసేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆ ట్యాగ్ భాగశ్రీ బోర్సే దగ్గర ఉంది. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, కాంత సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు సొంతం చేసుకొంది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. ఆ సినిమా కూడా భాగ్యశ్రీకి తొలి హిట్ అందించలేకపోయింది. అయితే ఆమె అవకాశాలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఏదో ఓ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తూనే ఉంది. స్వప్నదత్ ఇప్పుడు ఓ కొత్త సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంచుకొంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా. కథలో హీరోయిన్‌ది కీలక పాత్ర. అందుకు అభినయం ఉన్న హీరోయిన్ కావాలి. సమంత, రష్మిక లాంటి పలు పేర్లు పరిశీలించి, చివరికి భాగ్యశ్రీకి ఓటేశారు. ఈ చిత్రానికి ‘చుక్కలు తెమ్మన్నా… తెంచుకురానా’ అనే పేరు ఖాయం చేశారు. అధికారిక ప్రకటన రావాల్సివుంది. మద్యపాన నిషేదం చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రీ కూతుర్ల అనుబంధం ఈ కథకు బలం. తండ్రిగా ఓ పేరున్న నటుడు కనిపించే అవకాశం ఉంది.
సాధారణంగా… వరుసగా ఫ్లాపులు తింటుంటే.. ఆ హీరోయిన్ జోలికి వెళ్లడానికి దర్శక నిర్మాతలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. కానీ భాగ్యశ్రీ విషయంలో ఈ ట్రాక్ రికార్డు అస్సలు పట్టించుకోవడం లేదు. గ్లామర్ విషయంలో భాగ్యశ్రీకి తిరుగులేదు. నటన కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో చేస్తుంది. ‘కాంత’ సినిమా ఫ్లాప్ అయినా, అందులో భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందుకే మళ్లీ మళ్లీ ఆమెకు అవకాశాలు అందుతూనే ఉన్నాయి.
