Bhairavam Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్… ఈ ముగ్గురూ ఓ సినిమాలో నటించారంటే తప్పనిసరిగా ఆసక్తి ఏర్పడుతుంది. ఈ ముగ్గురికీ కాస్త గ్యాప్ వచ్చింది. కొంత విరామం తరవాత తెరపైకి వచ్చారు. కలిసి ఓ సినిమాలో నటించారంటే దానిపై ఫోకస్ పడుతుంది. పబ్లిసిటీ కూడా ముమ్మరంగానే చేశారు. దాంతో పాటు ‘బాయ్ కాట్ భైరవం’ అనే నినాదం ఈ సినిమా పబ్లిసిటీకి మరింత ప్లస్ అయ్యింది. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది? తమిళ ‘గరుడన్’ రిమేక్ని దర్శకుడు విజయ్ కనకమేడల న్యాయం చేశాడా?
భైరవం సినిమాలో ‘కురుక్షేత్రం’ రిఫరెన్సులు కొన్ని కనిపిస్తాయి. సొంత వాళ్లు కలబడిన యుద్ధం అది. ఆ యుద్ధంలో విషాదమే మిగిలింది. ‘భైవరం’ కథ కూడా ఇలాంటిదే. ఇద్దరు మిత్రులు, ఓ నమ్మిన బంటు మధ్య నడిచిన డ్రామా ఇది. వాళ్ల స్నేహానికి, పంతానికీ, పగకీ కారణం ఏమిటి? చివరికి ఈ యుద్ధంలో మిగిలిందేమిటి? అనేదే కథ. క్లుప్తంగా చెప్పుకోవాలంటే… గజపతివర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ఇద్దరూ మంచి మిత్రులు. ఒకటే మాట, ఒకటే బాట. వీరిద్దరి నమ్మిన బంటు శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). ఆ ఊర్లో దేవుడి మాన్యానికి సంబంధించిన భూములపై స్వార్థపరుల కన్ను పడుతుంది. ఆ కుట్రలో గజపతి వర్మ కూడా భాగస్వామి అవుతాడు. ఈ ప్రయత్నానికి వరద అడ్డు పడతాడు. ఆ తరవాత ఏమైంది? వరద, గజపతి మధ్య ఏం జరిగింది? మధ్యలో ఉన్న శ్రీను ఏం చేశాడు? అనేది మిగిలిన స్టోరీ.
తమిళ ‘గరుడన్’లోని మూల కథని తీసుకొని, దానికి తెలుగు సినిమా కమర్షియల్ కోటింగులు ఇచ్చి డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే ఆ కోటింగులు కొన్ని చోట్ల మెప్పించాయి. ఇంకొన్ని చోట్ల నొప్పించాయి. కథని చాలా నిదానంగా మొదలెట్టాడు దర్శకుడు. తొలి 20 నిమిషాలు చైల్డ్ వుడ్ ఎపిసోడ్ నడిపాడు. అక్కడే బోర్ మొదలవుతుంది. మెల్లగా అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. దేవస్ధానం భూముల్ని లాక్కోవాలని థియేటర్ (అజయ్) ప్రయత్నించడం దగ్గర్నుంచి కథలోకి వెళ్తాం. ఇద్దరు మిత్రుల మధ్య పేచీ ఎలా మొదలైంది? మిత్రుత్వం శత్రుత్వంగా ఎలా మారింది? అనేవి ఆసక్తికరంగా మలిచాడు. ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ తీర్చిదిద్దిన విధానం బాగుంది. దాదాపు 20 నిమిషాల ఎపిసోడ్ అది. గుడి నేపథ్యంలో సాగిన ఫైట్… శ్రీనుగా బెల్లంకొండ ఉగ్రరూపం దాల్చడం హై ఇస్తుంది. నిజానికి తమిళంలో ఈ ఎపిసోడ్ ఇంకాస్త రసవత్తరంగా తీశారు. తెలుగులో దానికి కొంత మేరే న్యాయం జరిగింది.
సెకండాఫ్‌లో వరద – గజపతి వర్మ మధ్య గ్యాప్ మొదలవుతుంది. గజపతిలో స్వార్థం పేరుకుపోవడంతో ఆ పాత్రలోని కొత్త పార్శ్వాలు బయటకు వస్తాయి. మామిడితోట ఫైట్ కూడా డీసెంట్ గానే తీశారు. శ్రీను తన ప్రతీకారం తీర్చుకోవడానికి కొంత సమయం తీసుకొన్నాడు. ఆమధ్యలో సాగిన డ్రామా పెద్దగా రక్తి కట్టలేదు. పోలీస్ స్టేషన్లో సీన్.. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నేరేషన్లో ఎడిట్ చేశారు. అక్కడ హీరోయిజం పండింది. క్లైమాక్స్ లో మళ్లీ శ్రీను ఉగ్రరూపం దాల్చి శత్రు సంహారం చేస్తాడు. డబ్బు, ఆస్తి, పరువు.. ఈ మత్తులో అయిన వాళ్లు ఒకరినొకరు కలబడిపోతే మిగిలేది విషాదమే అని చెప్పే కథ ఇది. తమిళంలో చాలా ‘రా’గా తీశారు. తెలుగులో అలా తీస్తే చూడరేమో అని కమర్షియల్ కోటింగ్ ఇచ్చారు. శ్రీను – వెన్నెల లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోదు. కథకు అది స్పీడ్ బ్రేకర్. ఒకే విషయం తిప్పి తిప్పి చూపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ కథలో బలమైన విలన్ లేడు. పరిస్థితుల్నే విలన్ అనుకోమంటే చేసేదేం లేదు. శ్రీను పాత్రకు గుక్కతిప్పుకోకుండా మాట్లాడడం అనే మేనరిజం పెట్టారు. అది ఏమాత్రం పండలేదు. పైగా ఎమోషన్ సీన్లో అది కామెడీగా మారిపోయింది. స్నేహితుల మధ్య బాండింగ్ మరింత బలంగా చూపించాల్సింది. సీన్లు పైపైకి బాగున్న.. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది. అది పెద్ద లోపం.
ముగ్గురు హీరోల సినిమా ఇది. ఎవరెక్కువ ఎవరు తక్కువ అని కాకుండా కథని బట్టే పాత్రల్ని వాటి పరిధుల్ని రాసుకొన్నాడు దర్శకుడు. ముగ్గురూ న్యాయం చేశారు. బెల్లంకొండ యాక్షన్ సన్నివేశాల్లో మెరిశాడు. `కాంతార`ని పోలిన ఎలివేషన్లు, పూనకాలు బాగానే సెట్ అయ్యాయి. తన బాడీ లాంగ్వేజ్‌కి కుదిరాయి. మరో హీరో ఇలాంటివి ట్రై చేసి ఉంటే అభాసుపాలయ్యేవారేమో..? మనోజ్ రోల్ పవర్ఫుల్ గానే ఉంది. తన డైలాగ్ డెలివరీ, మేనరిజం మోహన్ బాబుని గుర్తు చేశాయి. ‘రౌడీ’లో మోహన్ బాబు ఇలాంటి మాడ్యులేషన్‌లోనే డైలాగులు చెప్పారు. కొన్నిసార్లు తన నటన మరీ లౌడ్‌గా అనిపించింది. నారా రోహిత్ డీసెంట్ గా చేశాడు. తనకు తగిన పాత్ర ఇది. తన లుక్ కూడా బాగుంది. పాత్రకు సరిపోయింది. అతిథి శంకర్ (శంకర్ కుమార్తె) బెల్లంకొండ పక్కన ఏమాత్రం ఫిట్ అవ్వలేదు. తన డబ్బింగ్ కూడా కుదర్లేదు. వెన్నెల కిషోర్ ఓ సినిమాలో ఉండి కూడా నవ్వించలేకపోవడం బహుశా ఇదే తొలిసారేమో? తన కాల్షీట్లు వేస్ట్ చేశారు.
పాటల వరకూ ఓకే కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ డల్ అయిపోయింది. కామెడీ సన్నివేశాల్లో ఇచ్చిన ఆర్.ఆర్కి అయితే ఓ దండం పెట్టాలి. కొన్ని కథల్ని ‘రా’గానే చెప్పాలి. కమర్షియల్ కోటింగులు అవసరం లేదు.’గరుడన్’లా రా అండ్ రస్టిక్‌గా చెబితే బాగుండేది. కానీ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ విషయంలో మరీ అతి జాగ్రత్తకు పోయాడేమో అనిపిస్తుంది. ఓల్డ్ స్కూల్ ఫార్మెట్ లో రాసుకొన్న స్క్రీన్ ప్లే మరో మైనస్. కొన్ని సన్నివేశాలు బలంగా కనిపించాయి. ఇంకొన్ని తేలిపోయాయి. దాంతో మూడ్ కంటిన్యుటీ దెబ్బతింది. అయితే యాక్షన్‌లోని ఎమోషన్, ముగ్గురు హీరోల స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. మాస్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈ వారం ఓ ఆప్షన్.
తెలుగు360 రేటింగ్: 2.5/5