Bhale Unnade Movie review
తెలుగు360 రేటింగ్: 1.5/5
మారుతి కాన్సెప్ట్ లు భలే గమ్మత్తుగా ఉంటాయి. కథ సింపుల్ గా ఉన్నా, ట్రీట్మెంట్ వినోదాత్మకంగా ఉంటుంది. కాన్సెప్ట్ కి కావాల్సినంత కమర్షియాలిటీ జోడించడం ఆయన స్పెషాలిటీ. అందుకే మారుతి బ్రాండ్ తో ఒక సినిమా వస్తుందంటే అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన పర్యవేక్షణలో వచ్చిన సినిమా ‘భలే ఉన్నాడే’. ఈ సినిమాకి ప్రజెంటర్ గా ఉండటంతో పాటు స్టోరీ ఐడియా ఆయనదే. రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడు సాయి వర్ధన్ ఆ ఐడియా సినిమాగా మలిచాడు. మరి ఇంతకీ ఏమిటా కొత్త ఆలోచన? మారుతి స్టాంప్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షుకుల్ని అలరించేలా ఉందా? చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కి విజయం దక్కిందా?
రాధ(రాజ్ తరుణ్) వైజాగ్ లో శారీ డ్రాపర్. రాధ తల్లి గౌరీ(అభిరామి) బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటారు. రాధ కొంచెం వెరైటీ. ఆడవాళ్ళకి ఆమడదూరంలో ఉంటాడు. ఇంటిపని, వంట పని చేయడంలో తల్లికి సాయం చేస్తుంటాడు. గౌరీ పని చేసే బ్యాంక్ లో కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ (మనిషా). లంచ్ సమయంలో గౌరీ తెచ్చిన వంటకాలు తిని రాధకి ఫ్యాన్ అయిపోతుంది. లంచ్ బాక్స్‌లో చీటీలు రాసి తన ఇష్టాల్ని రాధకి చెబుతుంటుంది. ఇద్దరూ చూసుకోకుండానే ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకుంటారు. రాధ, గౌరీ కొడుకే అని తెలుసుకొని రాధతో పెళ్ళికి సిద్ధపడుతుంది కృష్ణ. ఇంతలో తనకు రాధపై అనుమానం వస్తుంది. రాధ ప్రతిసారి కృష్ణని ఫిజికల్ గా దూరం పెడుతుంటాడు. రాధలో తేడా లక్షణాలు వున్నాని గ్రహించిన కృష్ణ ఏం చేసింది? అసలు రాధ ఎందుకు కృష్ణ ని ఫిజికల్ గా దూరంగా పెడుతున్నాడు? అనేది మిగతా కథ.
ఐడియా అనేది పుస్తకానికి ముందుమాట లాంటింది. ముందుమాట అద్భుతంగా రాసినంత మాత్రాన పుస్తకంలో విషయం ఉన్నట్టు కాదు. చివరివరకూ చదివించగల క్రియేటివిటీ ప్రతిపేజీలో వుండాలి. సినిమా కూడా అంతే. ఐడియా కొత్తగా వుంటే అది టీజర్ లో ఆకట్టుకోవడానికి సరిపోతుంది. కానీ టికెట్ కొని థియేటర్ లో అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకుడ్ని లీనం చేయగల కథ, కథనాలు కుదరాలి. రంజింప చేసే సన్నివేశాల అల్లిక వుండాలి. అలాకాకుండా కేవలం ఐడియాతోనే సరిపెడితే అంతకుమించిన ట్రాజీడీ మరొకటి లేదు. భలే ఉన్నాడే లో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకి మారుతి ఇచ్చిన ఒక ఐడియా అయితే వుంది. కానీ ఆ ఐడియాతో ఏం చేయాలో దర్శకుడికి ఒక ఐడియా లేకుండాపోయింది. అదే విధి విచిత్రం.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ లోనే ఆ ఐడియా ఏమిటనేది ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇలాంటప్పుడు సినిమాలో వీలైనంత తొందరగా ఐడియాని రివిల్ చేసి.. దాని తర్వాత వచ్చే కాన్ఫ్లిక్ట్ మీద మిగతా డ్రామా నడిపితే ప్రేక్షకుడు పాత్రల మీద ఎంపతైజ్ అవుతాడు. ఉదాహరణ భలే భలే మగాడివోయ్ తీసుకుందాం.. వెరీ ఫస్ట్ సీన్ లోనే హీరోకి మతి మరుపు, ప్రతి ఐదు నిమిషాలకి టాపిక్ ని మర్చిపోతాడనే చైల్డ్ ఎపిసోడ్ లోనే చెప్పేసి, దాని నుంచి వచ్చే కాన్ ఫ్లిక్ట్ పై మిగతా డ్రామా నడిపారు. చూస్తున్న ఆడియన్ నాని క్యారెక్టర్ తో ప్రేమలో పడిపోతారు. ఇలాంటి మతిమరుపోడు ఎలా తన ప్రేమని సాధించుకుంటాడో అనే సింపతి క్రియేట్ అయిపోతుంది. క్యారెక్టర్ ని డ్రైవ్ చేసే విధానం అంత ఆసక్తికరంగా వుండాలి. భలే ఉన్నాడే కే వద్దాం.. రాధ క్యారెక్టర్ కి ఒక సమస్య వుంటుంది. అదేదో సస్పెన్ థ్రిల్లర్ లా చివరి వరకూ చెప్పరు. దాని చుట్టూ అడల్ట్ కామెడీ నడపడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నం నవ్వుతెప్పించకపోగా ఒక దశలో చిరాకు కలిగిస్తుంది. పోనీ అసలు సమస్య రివిల్ అయ్యాక.. హీరో క్యారెక్టర్ పై ఎంపతీ వస్తుందా అంటే అదీ వుండదు. తలకి దెబ్బ తగిలితే మోకాలి కట్టుకట్టినంత తెలివిగా వుంటుందా ట్రీట్మెంట్.
ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అర్గానిక్ గా, మనస్పూర్తిగా నవ్వుకొద్దగ్గ సీన్లే వుండవు. ఏదో ర్యాండమ్ గా నడిచిపొతుంటుంది. హీరో క్యారెక్టర్ ని చాలా తప్పుడు దారిలో నడిపారు. ‘లంచ్ బాక్స్’ లవ్ స్టోరీ బోరింగ్. ఇంటర్వెల్ వరకూ జరిగిందంతా మీకు మీరే కితకితలు పెట్టి నవ్వుకోండనే తీరులో ఉంటుంది. పోనీ ఇంటర్వెల్ తర్వాత అద్భుతం జరిగిందా అంటే.. అదీ లేదు. ఆశ్రమం ఎపిసోడ్ అంతా తేలిపోయింది. సింగీతం, లీలా సాంసన్ లాంటి దిగ్గజాలని తీసుకొని కథలో మెటాఫర్ గా ఏదో చెప్పేయాలని చూశారు కానీ అదేం అతకలేదు.
కొన్ని సీన్లు ముతక సీన్లు రాశారు. రచ్చరవి వయాగ్రా ట్యాబ్లెట్లు తిని ఆంబోతులా ప్రవర్తించే ఓ వికారమైన ఎపిసోడ్ వుంది. అలాంటి సీన్లులో నవ్వించాలని ఆలోచన నుంచి అర్జెంట్ గా బయటపడిపోవాలి.
ఇందులో అండర్ లైన్ చేసుకొని చెప్పదగ్గ ఓ సీన్ వుంది. ఇద్దరు ప్రేమికులు. ప్రేమికుడు తన ప్రేమని వ్యక్తం చేసే ఆనందపారవశ్యంలో చేతిలో రింగ్ పట్టుకొని దూరంగా నిలబడి అమ్మాయి వంకగా ప్రేమగా చూస్తుంటాడు. ఇంతలో ఓ లారీ వచ్చి టపీమని ప్రేమికుడ్ని కొట్టేస్తుంది. తెరపై ఈ సీన్ చూసినప్పుడు 2024లో కూడా ఇలాంటి సీన్లు రాస్తున్నారా? మారుతి సమర్పణలో ఈ సీన్ బయటికి వచ్చిందా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. అది ఈ సినిమా బేసిక్ ఐడియానే. తన చిన్నప్పటి నుంచి ఓ పరిస్థితి ఎదుర్కున్న ఓ కుర్రాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అక్కడి వరకైతే ఓకే. ఆ ఐడియాకి ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టేలా తయారైయింది. క్లైమాక్స్ లో తల్లీ కొడుకుల సెంటిమెంట్ బావుంది కానీ అప్పటివరకూ నడిపిన సన్నివేశాలతో సంబంధం లేకపోవడంతో ఆ ఎమోషన్ తో ఆడియన్ కి కనెక్షన్ రాదు.
రాజ్ తరుణ్ స్మార్ట్ గా కనిపించాడు. తన పాత్ర వరకూ డీసెంట్ గా చేశాడు. కొత్త అమ్మాయి మనిషా చలాకీగా కనిపించింది. అమ్మగా అభిరామి హుందాగా కనిపించింది. హైపర్ అది సింగిల్ లైనర్స్ కొన్ని పేలాయ్. మరికొన్ని నాన్ సింక్ అనిపించాయి. సింగీతం, లీలా పాత్రలు గౌరవార్ధం అన్నట్టుగా వుంటాయి. నెల్లూరు సుదర్శన్ చివర్లో నవ్వించే ప్రయత్నం చేశాడు. గణేష్ కథలో యాంకర్ లాంటి పాత్ర. తనదైన డిక్షన్ తో చేశాడు. చాలా మంది నటులు కనిపిస్తారు కానీ చెప్పుకోదగ్గ పాత్రలుగా వుండవు. శేఖర్ చంద్ర పాటలు పెద్దగా కలిసిరాలేదు. ట్రిమ్ చేయదగ్గ సీన్లు చాలా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. చాలా రోజులుగా హిట్ కోసం ఎదుచూస్తున్నాడు రాజ్ తరుణ్. తన ఎదురుచూపుల్ని ఈ సినిమా ఇంకా పొడిగించింది.
తెలుగు360 రేటింగ్: 1.5/5