వచ్చే శుక్రవారం, అంటే సెప్టెంబర్ 2న భారత దేశంలో అంతా బంద్. సార్వత్రిక సమ్మె పేరుతో భారత్ బంద్ కు అనేక కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వామపక్షాలతో పాటు ఇతర సంస్థల అనుబంధ టేడ్ యూనియన్లు సమ్మె చేసి తీరాలని పట్టుదలతో ఉన్నాయి. బంద్ ను ఆపడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన మరో ప్రయత్నం పలించ లేదు. డిమాండ్లపై యూనియన్లు పట్టు వీడటం లేదు. ప్రభుత్వం కొన్ని డిమాండ్లపై సానుకూలంగా కనిపించడం లేదు. వెరసి, ప్రజలకు కష్టం, దేశానికి నష్టం తప్పేలా లేదు.
సమ్మె చివరి ఆయుధం కావాలి. అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైతేనే సమ్మె చేయాలి. కానీ మన దేశంలో కొన్ని యూనియన్లకు అంత ఓపిక లేదు. ప్రభుత్వాలకు అంత తీరికా లేదు. చివరకు ప్రజలే బాధితులవుతున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ బంద్ ను ఆపడానికి మంగళవారం ప్రయత్నించారు.
ఫలితంగా, తక్కువ నైపుణ్యం గల వ్యవసాయేతర కార్మికుల రోజూ వారీ కనీస వేతనాన్ని ప్రభుత్వం రూ. 246 నుంచి 350కి పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లుగా పెండింగులో ఉన్న బోనస్ ను ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే తమప్రధాన డిమాండ్లను ఒప్పుకోలేదు కాబట్టి సమ్మె చేయడానికే యూనియన్లు నిర్ణయించుకున్నాయి.
అంటే, దేశంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలు, కార్ఖానాలు, ఆఫీసులు, వగైరాలన్నీ మూతపడతాయి. ప్రజా రవాణా వ్యవస్థకు బ్రేక్ పడుతుంది. లక్షల మంది సమ్మెలో పాల్గొంటారు. ఆ మేరకు భారీగా పనిదినాలను దేశం కోల్పోతుంది. ఉత్పత్తి నష్టాన్ని ఆర్థిక కోణంలో చూస్తే నష్టం భారీగా ఉంటుంది. కనీసం 50 వేల కోట్ల రూపాయల వరకూ నష్టం కలగవచ్చని ఒక అంచనా.
సమ్మె చేసే వారికి, ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలి. వాస్తవిక కోణంలో ఒప్పందానికి రావాలి. బీమా, రక్షణ ఉత్పాదక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న ఆంక్షలను తొలగించడాన్ని కొన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం పునరాలోచనకు అవకాశం లేదని అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. అంటే, ఒక్క రోజు కాదు ఎన్ని రోజులు సమ్మె చేసినా ఆ డిమాండ్ నెరవేరేది కాదు. అలాంటి వాటికోసం ప్రజలను కష్టపెట్టడం, దేశానికి నష్టం కలిగించడం అవసరమా అనేది ఆలోచించాలంటోది సర్కార్.
కష్టపడే శ్రమజీవికి తగిన ప్రతిఫలం అందాల్సిందే. అయితే, ప్రభుత్వం పట్టించుకోక పోతే అది వేరే సంగతి. కానీ ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సెప్టెంబర్ 2నే అనే పంతానికి పోవడం ఎందుకు. మరికొన్ని రోజులు వాయిదా వేసి, ప్రభుత్వంతో చర్చలు జరిపితే చాలా వరకు డిమాండ్లకు అంగీకారం రావచ్చు. అలా కాకుండా సమ్మె చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక వేళ పంతానికి పోయి ఏమీ పట్టించుకోక పోతే? మళ్లీ సమ్మె చేస్తారా? ఆవేశానికి కాదు, ఆలోచనకు సమయమిది.