‘భ‌ర‌త‌నాట్యం’ రివ్యూ: త‌డ‌బ‌డ్డ అడుగులు

Bharatanatyam Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2/5

-అన్వ‌ర్‌

క్రైమ్ కామెడీ, డార్క్ కామెడీ… ఇలా ఏమైనా పేర్లు పెట్టుకోండి. ఈ జోన‌ర్‌లో ఓ సౌల‌భ్యం ఉంది. స్టార్లు అవ‌స‌రం లేదు. కొత్త వాళ్ల‌యినా క‌రెక్ట్ కంటెంట్‌తో వ‌స్తే బాక్సాఫీసుని మెస్మ‌రైజ్ చేయొచ్చు. బ‌డ్జెట్లు అవ‌స‌రం లేదు. మినిమం బ‌డ్జెట్‌తో మాక్సిమం రిజ‌ల్ట్ రాబ‌ట్టొచ్చు. కొత్త త‌ర‌హా ప్ర‌యోగాల‌కు ఈ జోన‌ర్ ఓ వేదిక‌. అందుకే యేడాదికి 150 సినిమాలు వ‌స్తే, అందులో పదో, పాతికో.. ఈ జోన‌ర్ ఆక్ర‌మించుకొంటుంది. ఆ జాబితాలో చేరే సినిమా ‘భ‌ర‌త‌నాట్యం’. ‘దొర‌సాని’తో ఆక‌ట్టుకొన్న కె.వి.ఆర్ మ‌హేంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, ప‌బ్లిసిటీ రంగంలో పేరు తెచ్చుకొన్న ధ‌ని ఏలె కుమారుడు సూర్య తేజ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం కావ‌డంతో కాస్తో కూస్తో అటెన్ష‌న్ తెచ్చుకొంది. మ‌రి ఈ నాట్యం ఎలా ఉంది? తాళం స‌రిగా కుదిరిందా? లేదా?

రాజు సుంద‌రం (సూర్య‌తేజ‌) ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. త‌న‌క‌న్నీ క‌ష్టాలే. క‌థ‌లు చెబితే, నిర్మాత‌లు ఛాన్సులు ఇవ్వ‌రు. గాళ్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) పెళ్లి చేసుకోమ‌ని పోరెడుతుంటుంది. ఇంట్లో అమ్మ ఆప‌రేష‌న్ కు డ‌బ్బులు కావాలి. మ‌రోవైపు దిల్‌షుఖ్ న‌గ‌ర్ దామోద‌ర్ (హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌) క‌థ న‌డుస్తుంటుంది. త‌ను గంజాయి డీల‌ర్‌. త‌న ద‌గ్గ‌ర‌కు భ‌ర‌త‌నాట్యం కావాల‌ని ఓ పార్టీ వ‌స్తుంది. రూ.10 కోట్ల‌కు బేరం సెట్ అవుతుంది. ఆ డ‌బ్బులు చేతులు మారుతున్నాయ‌న్న విష‌యం రాజు సుంద‌రంకి తెలుస్తుంది. ఆ డ‌బ్బులు కాజేస్తే.. త‌న జీవితం సెటిలైపోతుంద‌ని అనుకొంటాడు. మ‌రి.. ఆ ప్ర‌య‌త్నం నెర‌వేరిందా? ఇంత‌కీ ‘భ‌ర‌త‌నాట్యం’ అంటే ఏమిటి? దాని చుట్టూ న‌డిచిన డ్రామా ఏమిటి? అనేది మిగిలిన క‌థ‌.

ఈజీ మ‌నీ కోసం ఆశ‌ప‌డితే ఎలాంటి చిక్కుల్లో ప‌డిపోతామో చెప్పిన క‌థ‌లు, సినిమాలు చాలా వ‌చ్చాయి. ఇది కూడా అలాంటి సినిమానే. కాబ‌ట్టి క‌థా ప‌రంగా ఎలాంటి కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ఇక మిగిలింది టేకింగ్‌. స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు ఎంత చ‌క్క‌గా రాసుకొన్నాడు? క‌థ‌ని ఎంత ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు? అనేదానిపైనే ఇలాంటి క‌థ‌ల జాత‌కాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఆ విష‌యంలోనూ ఈ సినిమాని అర‌కొర మార్కులే ప‌డ‌తాయి. దిల్‌షుఖ్ న‌గ‌ర్ దివార‌క‌ర్ చేసే అరాచ‌కాల‌తో సినిమా మొద‌ల‌వుతుంది. రాజు సుంద‌రం సినిమా క‌ష్టాల్ని స‌మాంత‌రంగా చూపిస్తూ ప్రేక్ష‌కుడ్ని ఎంగేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. భ‌ర‌త‌నాట్యం కోసం డీల్ సెట్ అవ్వ‌డం ద‌గ్గ‌ర్నుంచి క‌థ ఊపందుకొంటుంది.

భ‌ర‌త‌నాట్యం అంటే… ఏదో కొత్త విష‌యాన్ని రివీల్ చేస్తాడేమో అనుకొంటారంతా. ‘భ‌ర‌త‌నాట్యం’ అంటే ఏమిటో తెర‌పైనే చూడాలి అని చిత్ర బృందం కూడా ఊద‌ర‌గొట్టింది. దాంతో భ‌ర‌త‌నాట్యం అంటే ఏమై ఉంటుందా అనే ఆస‌క్తి నెల‌కొంది. తీరా చూస్తే.. ఆ స‌స్పెన్స్ తెర‌పై తుస్సుమంది. డ్ర‌గ్‌కి ద‌ర్శ‌కుడు పెట్టిన పేరు అది. ఆ మాత్రం దానికి ‘భ‌ర‌త‌నాట్యం’ అనే ఎందుకు? మ‌రేదైనా పెట్టుకోవొచ్చు. బ్యాగులు మారిపోవ‌డంతో హీరో క‌ష్టాలు రెట్టింపు అవుతాయి. ఆ బ్యాగులు మారిపోయే ప్ర‌క్రియ బాగానే ఉన్నా, అందుకోసం హీరో వేసిన స్కెచ్ చాలా నార్మ‌ల్‌గా, మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. తొలి స‌గం హీరో బాధ‌లు, ఏమాత్రం ఎమోష‌న్ లేని ల‌వ్ స్టోరీ, క‌థ‌కు అడ్డుప‌డే పాట‌తో.. నీర‌సంగా సాగుతుంది. అసలు క‌థ‌, ట్విస్టూ సెకండాఫ్‌లోనే ఉంద‌నుకొంటాడు ప్రేక్ష‌కుడు. అక్క‌డా నిరాశే ఎదుర‌వుతుంది. ఈ బ్యాగ్ కోసం శ‌కుని (అజ‌య్ ఘోష్‌) ఆడే డ్రామా, అందులోంచి పుట్టిన థ్రిల్.. ఏమాత్రం స‌రిపోలేదు. మ‌ధ్య‌లో వైవా హ‌ర్ష చేసే కామెడీ కాస్త న‌వ్విస్తుంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క్యారెక్ట‌ర్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ఆ టెంపోని చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగించ‌లేదు. క్లైమాక్స్ మ‌రీ సినిమాటిక్‌గా సాగిపోయింది.

సినిమాల‌కు లాజిక్ లేద‌ని చెబుతుంటారు. కానీ బేసిక్ సూత్రాల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం మాత్రం ఉంది. రెండువేల నోట్లు ఎప్పుడో ర‌ద్ద‌యిపోయాయి. వాటిని సినిమాలో తెగ చూపించారు. పోనీ… నోట్ల ర‌ద్దుకు ముందు జ‌రిగిన క‌థ ఇద‌ని అనుకొంటే..ఇదే సినిమాలో కొత్త ఐదొంద‌ల నోట్లు కూడా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఒకేసీన్‌లో ర‌ద్ద‌యిపోయిన రెండు వేల నోట్లు, కొత్త ఐదొంద‌ల నోట్ల‌ని చూపించిన ద‌ర్శ‌కుడి క్రియేటివిటీకి దండం పెట్టుకోవాలి.

సూర్య తేజ‌కు ఇదే తొలి సినిమా. ఈ చిత్రానికి క‌థ కూడా అత‌నే అందించాడు. న‌టుడిగా ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సివుంది. ఏ ర‌క‌మైన ఎక్స్‌ప్రెష‌న్ అయినా ఒకేలా ఇస్తున్నాడు. డ‌బ్బింగ్ కూడా సింక్ అవ్వ‌లేదు. మీనాక్షి గోస్వామి గురించి ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిది. త‌ను ఈ సినిమాలో హీరోయిన్ అనే విష‌యం చాలాసేప‌టి వ‌ర‌కూ రిజిస్ట‌ర్ కాదు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ కి ఇది కొత్త త‌ర‌హా పాత్ర‌. త‌న న‌ట‌న మెప్పిస్తుంది. వైవాహ‌ర్ష ఉన్నంత‌లో కాస్త రిలీఫ్ ఇచ్చాడు. టెంప‌ర్ వంశీకి కూడా ఇది కొత్త పాత్రే.

‘దొర‌సాని’తో విమ‌ర్శ‌కుల్ని మెప్పించాడు మ‌హేంద్ర‌. ఈ సినిమా మాత్రం త‌న మార్క్‌ని బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయింది. హీరో రాసుకొన్న క‌థ‌ని మ‌హేంద్ర ఓన్ చేసుకోలేక‌పోయాడేమో అనిపించింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. క‌థ‌నం కూడా అలానే త‌యారైంది. వివేక్ సాగ‌ర్ సంగీతం కూడా రొటీన్‌గానే సాగింది. పాట‌లు అన‌వ‌స‌రం. సెకండాఫ్‌లో వ‌చ్చిన పాటైతే… మ‌రీనూ.
చిన్న సినిమా, కొత్త వాళ్ల‌తో తీస్తున్నప్పుడు ఏదో ఓ మెస్మ‌రైజ్ చేసే విష‌యం ఉండాలి. అది.. ఈ సినిమాలో లోపించింది. అక్క‌డ‌క్క‌డ కొన్ని జోకులు, సాదా సీదా టేకింగ్ తో సినిమాని న‌డిపేద్దాం అనుకొంటే ఫ‌లితాలు రావు అని చెప్ప‌డానికి ‘భ‌ర‌త‌నాట్యం’ లేటెస్ట్ ఉదాహ‌ర‌ణ‌.

తెలుగు360 రేటింగ్ : 2/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close