Bhartha Mahasayulaku Wignyapthi Movie Telugu Review
Telugu360 Rating: 2.25/5
రిజల్ట్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాలని ఒక ఉద్యమంలా చేసిన రవితేజ..ఆ ప్రవాహానికి బ్రేక్ ఇచ్చి చేసిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ట్రైలర్, టీజర్ చూసాక ఒదొక ఇల్లాలు… ప్రియురాలు కథనే ఫీలింగ్ కలిగించింది. ఇలాంటి ఫ్యామిలీ కథలకు సంక్రాంతి మంచి సీజన్. మరి ఈ ఫ్యామిలీ కథకి సీజన్ కలిసొచ్చిందా? ఇంతకీ రవితేజ భర్త మహాశయులకు చేసిన విజ్ఞప్తి ఏమిటి?
రామసత్యనారాయణ అలియాస్ సత్య (రవితేజ)ది అనార్కలి పేరుతో వైన్ తయారు చేసే బిజినెస్. ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని స్పెయిన్ వెళ్తాడు. ఆ కంపెనీ ఎండీ మానస శెట్టి(ఆషిక రంగనాథ్)అందానికి మైమరచిపోతాడు. వారి మధ్య స్నేహం కుదురుతుంది. ఒక బలహీనమైన క్షణంలో శారీరకంగా ఒక్కటౌతారు. మానస సింగిల్. ఆ క్షణాన్ని స్పెషల్ గానే చూస్తుంది. కాకపోతే సత్య ఆల్రెడీ మ్యారిడ్. ఆ నిజం మానస దగ్గర దాచేస్తాడు. నిజం తెలుసుకున్న మానస ఎలా రియాక్ట్ అయ్యింది? మానస సంగతి తన భార్య బాలామణి( డింపుల్)కి తెలియకుండా సత్య ఎలాంటి పాట్లు పడ్డాడు? అసలు నిజం ఎందుకు దాచాడు? ఒక్కసారి నిజం తెలిసిన తర్వాత వాళ్లిద్దరి నుంచి ఎలాంటి ప్రశ్న ఎదురుకున్నాడు? ఆ ప్రశ్నకి సత్య దగ్గర వున్న సమాధానం ఏమిటి? అనేది మిగతా కథ.
పెళ్ళయిన మగాడి జీవితంలోకి మరో అమ్మాయి ఎందుకు వస్తుంది? దాని ద్వారా వచ్చే పరిణామాలు ఏమిటి? ఈ పాయింట్ మీద బోలెడు సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఈ లైన్ కథే. కాకపోతే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ కథని క్యారెక్టర్ మోరల్ కాన్ఫ్లిక్ట్ తో నడిపాడు. హెవీ డ్రామా, ఎమోషన్ జోలికి వెళ్ళకుడా రామసత్యనారాయణ క్యారెక్టర్ తో ఒక ఫన్ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం తొలిసగంలో కొంతవరకూ సఫలీకృతమైయింది.
స్పెయిన్ ట్రిప్ తో కథమొదలౌతుంది. మానస పీఏగా బెల్లంగా సత్య చేసే కామెడీ మరీ అంత హిలేరియస్ గా వుండదు. స్పెయిన్ పోర్షన్ ముగించి కథ హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత ఇందులో వినోదం ట్రాక్ లో పడుతుంది. సునీల్ పాత్ర భలే వర్క్ అవుట్ అయ్యింది. థర్డ్ ఎంపైర్ లా ప్రతి యాంగిల్ చూసి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ సీన్, అలాగే ‘కిరసనాయిల్’ ఫ్లాష్ బ్యాక్ థియేటర్స్ లో నవ్వులు పంచాయి. రవితేజ షాపింగ్ మాల్ లో గొంతుమార్చి మాట్లాడిన సీక్వెన్స్, ఆ బొంగురు గొంతుతో ‘కలలోనైన అనుకోలేదే’ పాట పాడిన విధానం చూస్తే.. ఇదీ కదా రవితేజ ఎనర్జీ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ వరకూ వినోదంకు లోటు వుండదు.
కాకపోతే సెకండ్ హాఫ్ లో సినిమాకి అసలు సమస్య మొదలౌతుంది. రామసత్యనారాయణకు ఒక ప్రశ్న వేసిన దర్శకుడు…సెకండ్ హాఫ్ ని నడిపిన విధానం చూస్తే.. ఆ ప్రశ్నకు సరైన సమాధానం తనదగ్గర లేదనే భావన కలుగుతుంది. అప్పటివరకూ సిట్యువేషన్ కామెడీ మీద ఆదారపడి నడిచిన కథనం.. ఒక్కసారి కామెడీ కోసమే సీన్ అన్నట్టుగా మారిపోవడంతో సహజత్వం కొరవడుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని నవ్వులు వున్నాయి కానీ అవేవి గుర్తుపెట్టుకునేలా వుండవు.
నిజానికి ఇలాంటి మోరల్ కాన్ఫ్లిక్ట్ కథలకు ముగింపు ఇవ్వడం సామన్యమైన విషయం కాదు. రామసత్యనారాయణ పాత్రతో ఒక నిజం, సమాధానం చెప్పిస్తాడు దర్శకుడు. రామసత్యనారాయణ పాయింట్ అఫ్ వ్యూలో నిజంగా అది నిజమే. కాకపొతే ఆ నిజం, సమాధానం తెలుసుకున్న తర్వాత దానికి కొనసాగింపులు, ఎన్నటికీ తెగని వాదోపవాదాలు వుంటాయి. అందుకే ఒక యాక్సిడెంట్ తో ఎమోషనల్ ఈ కథకు ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా దర్శకుడికి కన్వినియంట్ గానే ఉంటుంది.
రామసత్యనారాయణ లాంటి ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో రవితేజని చూడటం నిజంగా ఫ్రెష్ గా వుంటుంది. ఫ్యామిలీస్ ని అలరించే కథలు చేసే క్యాలిబర్ రవితేజకి వుంది. అప్పుడప్పుడు ఇలాంటి కథలు మీద కూడా దృష్టిపెడితే బావుంటుంది. ఆషికా అందంగా కనిపించింది. తన పాత్ర బలంగానే వుంటుంది. గ్లామరస్ పాత్రల్లో కనిపించే డింపుల్ ఇందులో పద్దతిగా కనిపించింది. సత్య పాత్రని ఇంకా బలంగా రాసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ధమ్సరత్ సీక్వెన్స్ లో సత్య మెరుస్తాడు. వెన్నెల కిశోర్ కూడా అంతే. సినిమా అంతా వుంటాడు కానీ తన నుంచి సరైన ఫన్ రాలేదు. సునీల్ ట్రాక్ మాత్రం పండింది. తారక్ పొన్నప్ప ట్రాక్ ఏ మాత్రం కలిసిరాలేదు. మురళిధర్ గౌడ్ పాత్రలో కొన్ని నవ్వులు వున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కొన్ని చోట్ల నవ్విస్తాడు. ముఖ్యంగా గర్భాశయం నొప్పి అనే డైలాగ్ థియేటర్లో పేలింది.
భీమ్స్ ఇచ్చిన పాటలు చూడటానికి బావున్నాయి కానీ ప్లేస్మెంట్ కుదరలేదు. బీజీఎం ఓ మాదిరిగా వుంది. ప్రసాద్ మురెళ్ళ ఫ్రేమ్స్ రిచ్ అండ్ కలర్ ఫుల్ గా వున్నాయి. లొకేషన్ విషయంలో మంచి ప్లాన్ తో తీసిన సినిమా ఇది. స్పెయిన్ టూర్ తప్పిస్తే ఓ షాపింగ్ మాల్, ఇల్లు, హాటల్.. ఇలా లిమిటెడ్ లొకేషన్స్ లో కథని ఫిట్ చేశారు. కాకపోతే ఆ ఫీలింగ్ ఎక్కడా రాదు. శ్రీకర్ ప్రసాద్ సినిమాని వీలైనంత పదునుగా చూపించే ప్రయత్నం చేశారు.
సెకండ్ హాఫ్ లో కబ్ల్ మెడ్లీ, సంక్రాంతి ఫెస్టివల్.. ఒకదాని తర్వాత ఒకటి రావడం ఒక స్కిట్ ఫీలింగ్ కలిగించింది. అంతకుముందు హోటల్ సిసి టీవీ పుటేజ్ చూసిన సీక్వెన్స్ కూడా స్కిట్ లానే వుంటుంది. సెకండ్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా ట్రీట్ చేసివుంటే రిజల్ట్ ఇంకా బావుండేది. ఏదేమైనా ధమాకా తర్వాత రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఇది.
Telugu360 Rating: 2.25/5


