రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి రెడీ అవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘అద్దం ముందు’ అనే టైటిల్ తో పాట రిలీజ్ చేశారు. భీమ్స్ ఈ సాంగ్ మెలోడియస్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. శ్రేయా ఘోషాల్ వాయిస్ ఎప్పటిలానే కూల్ గా వుంది.
చల్లగాలి కావాలంటే చందమామని తీసుకొస్తాడే..
సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే
అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే
కోరింది తీరుస్తాడే.. వేరే కోరిక నాకింక లేకుండా చేస్తాడే
అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే..
నా అద్దం అంటే నువ్వే మరి నిజం దాచలేనే.. ఇలా సాగింది చంద్రబోస్ సాహిత్యం. భార్య భర్తలు పాడుకునే పాటిది. రవితేజ, డింపుల్ పై చిత్రీకరించిన విజువల్స్, ఫారిన్ లోకేషన్స్ కంటికి ఇంపుగా వున్నాయి. సంక్రాంతి వైబ్ ఈ పాటలో కనిపించింది.
రవితేజకు ఈమధ్య అస్సలు హిట్లు లేవు. వచ్చిన సినిమా…. వచ్చినట్టే వెనక్కిపోతోంది. ఈమధ్య విడుదలైన ‘మాస్ జాతర’కు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రవితేజ తన రూటు మార్చి, ప్రేక్షకుల్ని కొత్తదారిలో అలరించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాతో అది జరుగుతుందేమో చూడాలి.