రవితేజ రూటు మార్చాల్సిన తరుణం ఇది. వరుస పరాజయాలకు బ్రేక్ వేయాల్సిన సమయం ఇది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చేస్తున్న సినిమా. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈరోజు టీజర్ వచ్చింది. టీజర్ లో యాక్షన్ హంగామాకు అస్సలు చోటివ్వకుండా ఫన్, ఫ్యామిలీ డ్రామాని నమ్ముకోవడం గమనించ దగిన విషయం. ఓ భర్తకు వచ్చిన సమస్య, దాన్ని డాక్టర్ కి చెప్పుకోవడం, ఆయన హీరోకి ఇచ్చే సలహాలూ, వాటి చుట్టూ తిరిగే ఫన్ తో టీజర్ కట్ చేశారు. `కురిసింది వాన` అనే పాత సూపర్ హిట్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించింది. వెన్నెల కిషోర్, సత్య తదితరులతో కామెడీ బ్యాచ్ సెటప్ కాస్త పటిష్టంగానే కనిపిస్తోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ అందించే బాధ్యత పంచుకొన్నారు. అయితే ఈ సినిమాలో హీరోకి వచ్చే సమస్య ఏమిటన్నది సస్పెన్స్. దాన్ని ట్రైలర్ లో అయినా లీక్ చేస్తారేమో చూడాలి.
టీజర్ చూస్తే… ‘పెళ్లాం ఊరెళితే’ లాంటి సెటప్పులో రాసుకొన్న కథలా అనిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలకు సంక్రాంతి సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఫన్, ఫ్యామిలీ డ్రామా వర్కవుట్ అయితే రవితేజ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిట్ అందుకొనే అవకాశం ఉంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఫస్ట్ సింగిల్ కి మంచి స్పందన వచ్చింది. ఆల్బమ్ లో మరో మంచి పాట వస్తే… సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది.
