బోగాపురం ఎయిర్ పోర్టు దాదాపుగా పూర్తి అయింది. ఫ్లైట్ ట్రయల్స్ జనవరి నాలుగు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఢిల్లీ నుంచి తొలి ఫ్లైట్ రాబోతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ విమానంలో రానున్నారు. జూన్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. కూటమి అధికారంలోకి రాక ముందు నత్తనడకన సాగుతున్న పనులను .. ఏడాదిన్నరలోనే పరుగులు పెట్టించారు. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రి కావడంతో తిరుగులేకుండా పోయింది.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల బోగాపురం ఎయిర్ పోర్టు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఎయిర్ పోర్టు రన్‌వేపై జనవరి 4వ తేదీన తొలిసారిగా ఒక భారీ కమర్షియల్ విమానం ల్యాండ్ కాబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం నేరుగా భోగాపురం చేరుకోనుంది. ఈ ట్రయిల్ రన్ కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ , జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత, వివిధ విమానయాన సంస్థలతో చర్చలు జరిపి రెగ్యులర్ సర్వీసుల నిర్వహణపై స్పష్టత తీసుకు వస్తారు.
కూటమి ప్రభుత్వ వేగం – రామ్మోహన్ నాయుడు చొరవ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరపు రామ్మోహన్ నాయుడు , తన సొంత ప్రాంతం కావడంతో భోగాపురం పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిధుల విడుదల, పర్యావరణ అనుమతులు , సాంకేతిక అడ్డంకులను తొలగించడంలో ఆయన చూపిన చొరవ వల్ల పనులు ఊపందుకున్నాయి. గడిచిన కొద్ది నెలల్లోనే పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతమై, ప్రస్తుతం 95 శాతం నిర్మాణం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం చూస్తుంటే, పౌర విమానయాన మంత్రి ప్రకటించినట్లుగా జూన్ 2026 నాటికి ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కేవలం విమానాశ్రయమే కాకుండా, విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు నిర్మించ తలపెట్టిన సిక్స్-లేన్ హైవే పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం ,విశాఖపట్నంల ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
ఉత్తరాంధ్రకు ఆర్థిక ఊతం
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల పారిశ్రామికంగా, పర్యాటకంగా ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక్కడి నుంచే ప్రారంభం కానుండటంతో, ఐటీ రంగం, ఫార్మా కంపెనీలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. గత ప్రభుత్వం హయాంలో మందకొడిగా సాగిన పనులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో బుల్లెట్ వేగంతో పూర్తికావడంతో.. పనిమంతుడి పట్టుదలకు ఈ పనులే సాక్ష్యమని ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
