తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు వేస్తున్నారు. గోశాల పరిశీలనకు సవాల్ చేసిన ఆయన.. తిరుపతి జిల్లా మొత్తం నుంచి రెండు వేల మందిని సమీకరించారు. గోశాల సమీకరణకు వెళ్తున్నాడా.. గోవులపై యుద్ధానికి వెళ్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. భూమన సవాల్ చేసినట్లుగా టీడీపీ నేతలు మాత్రమే అక్కడకు వచ్చారు. గోశాలను పరిశీలించడానికి భూమన ఇస్తాడేమో ఎదురు చూశారు.
కానీ రెండు వేల మందితో గోశాలను పరిశీలిస్తానని అందర్నీ అంగీకరించాలని భూమన కరుణాకర్ రెడ్డి వాదనకు దిగారు. కరుణాకర్ రెడ్డిని ఆయన ప్రైవేటుకార్యదర్శిని గోశాలకు అనుమతిస్తామని.. తామే తీసుకు వెళ్తామని.. అన్ని వందల మంది వెళ్తే గోవుల బెదరవా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే భూమనకు మాత్రం వెళ్లే ఉద్దేశం లేదు. వెళ్తే నిజాలేంటో తెలిసిపోతాయి. తాను చెప్పిన ఫేక్ వార్తలన్నీ బయట పడతాయి.దీంతో ఆయన అందర్నీ అనుమతిస్తేనే వెళ్తానని ఇంటి ముందు పడుకున్నారు.
పోలీసులు ఎవరూ అడ్డుకోకపోయినా ఆయన తీరుతో వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయాయి. తమను అంతా సమీకరించి తన ఇంటి వద్దే భూమన డ్రామాలు ప్రారంభించడం .. చూసి ఇలా కాదేమో రాజకీయం చేయడం అని ఎవరికి వారు సిగ్గుపడ్డారు. గోశాల పరిశీలనకు జన సమీకరణ చేయడం అంటే.. అసలు అక్కడకు వెళ్లకుండా.. ఉండటానికేనని ఎవరికైనా అర్థమైపోతుంది. తప్పుడు ప్రచారాలు చేసి అడ్డంగా దొరికి.. డ్రామాలు చేసి బయటపడాలనుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ముందు ముందు ఇలాంటి డ్రామాలు చాలా చేయిస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.