ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖకు చెందిన రూ.4వేల కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రే పేరు మారిపోయింది. కొండాపూర్ లో ఉన్న ఆ భూమి దేవాదాయశాఖ నుంచి భూపతి ఎస్టేట్స్ అనే కంపెనీ పేరు మీదకు మారిపోయింది. ఎవరు మార్చారో ఇంకా బయటకు రాలేదు కానీ ఇంత కన్నా పెద్దస్కాం ఉండదని జరిగిన వ్యవహారం చూస్తే అర్థమైపోతుంది.
ఏపీ దేవాదాయశాఖ భూమి
ఈ భూమి అసలు యజమాని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ. బాలసాయిబాబా ట్రస్ట్ కు చెందినది. ఆయన మరణం తర్వాత ఏపీ దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అలా ఈ భూమి కూడా ఏపీ దేవాదాయశాఖకు వచ్ిచంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు, అత్యంత రహస్యంగా ఈ భూమిని భూపతి ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థ పేరు మీదకు మారుస్తూ ధరణిలో రికార్డులు ట్యాంపర్ అయ్యాయి. దేవాదాయ శాఖకు చెందిన నిషేధిత భూముల జాబితా నుంచి ఈ భూమిని తొలగించి, పట్టాదారు కాలమ్‌లో ప్రైవేటు సంస్థ పేరు చేర్చడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలస్యంగా గుర్తించిన దేవాదాయశాఖ
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అప్రమత్తమై కోర్టును ఆశ్రయించింది. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్న భూమిని, తమకు నోటీసు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుండగా, తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం కోర్టుకు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నములుతోంది. అసలు ఏ ప్రాతిపదికన ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారో వివరించాలని కోర్టు కోరగా, అధికారుల వద్ద సరైన పత్రాలు లేకపోవడం ఈ స్కాం తీవ్రతను తెలియజేస్తోంది.
భూపతి ఎస్టేట్స్ ఎవరిది?
ఇంతకీ ఈ భూపతి ఎస్టేట్స్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. గత ప్రభుత్వంలోని ఒక కీలక నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఈ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ భూమిని చేజిక్కించుకోవడానికి దేవాదాయ చట్టాలను, రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, ధరణి సాఫ్ట్‌వేర్‌లో అక్రమంగా ప్రవేశించి డేటాను మార్చడం ద్వారా ఈ డిజిటల్ దందా కు తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుట్ర వెలుగులోకి వస్తే, ధరణి పోర్టల్‌లో జరిగిన అతిపెద్ద రికార్డుల ట్యాంపరింగ్ కుంభకోణం బయటపడుతుంది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ ముగింపునకు చేరితే, అక్రమంగా భూమిని పొందిన వారితో పాటు, సహకరించిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.