బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఇరవై ఏళ్ల నుంచి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా, ఆయన ఆరోగ్యం బాగో లేదని.. తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది ప్రజలు అనుకుంటున్నారని సర్వేలు తేల్చినా.. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. దీనికి కారణం రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు.
రాహుల్ గాంధీ ఓటు చోరీ పేరుతో బీహార్ లో రాజకీయం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచి.. వారిని తమ పథకాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసుకోవాల్సిందిగా పోయి.. ప్రజలతో కనెక్షన్ చెదిరిపోయేలా ఓటు చోరీ గురించి మాట్లాడటం ప్రారంభించారు. చివరికి బీహార్ లో ఓటర్ సాధికార యాత్ర చేపట్టారు. దాని వల్ల కూటమికి ఒరిగిందేమీ లేదు. పైగా.. అదే సమయంలో బీజేపీ కూటమి పెద్ద ఎత్తున ప్రజలకు తాయిలాలు పంచింది. మహిళా ఓటర్ల ఖాతాల్లో పదివేల చొప్పున జమ చేశారు. ఉచిత కరెంట్ లాంటి పథకాలు అమలు చేశారు.
ఎన్నికలకు ముందుతేజస్వీ యాదవ్ భారీ పథకాలతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాహుల్ రాలేదు. ఇంటికో ఉద్యోగం సహా అనేక ఉచిత హామీలు అందులో ఉన్నాయి. రాహుల్ రాకపోవడం వల్ల ఆ మేనిఫెస్టోకు పెద్దగా విశ్వసనీయత లేకుండా పోయింది. తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ అంతంతమాత్రంగానే పాల్గొన్నారు.
ఇక బలం లేకపోయినా 61 స్థానాల్లో పోటీ చేసి కనీసం పది సీట్లలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. మరో పది సీట్లలో ఫ్రెండ్లీగా పోటీ అని పోటీ చేసి ఆర్జేడీని కూడా ఓడగొట్టింది. ఎన్డీయే ఘన విజయం క్రెడిట్ రాహుల్ గాంధీ నాయకత్వానికే దక్కుతుంది.

