బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ తన శక్తినంతా ఉపయోగించి ఇండీ కూటమిని గెలిపించేందుకు వ్యూహాలు పన్నుతూంటే ఆయన కాళ్లకు కాంగ్రెస్ అడ్డం పడుతోంది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ..పార్టీ నేతలతో నామినేషన్లు వేయిస్తోంది. ఫలితంగా కూటమి అంతా గందరగోళంగా మారింది. ఎవరు ఎక్కడ అధికారిక అభ్యర్థో తెలియక..పార్టీల నేతలు తంటాలు పడుతున్నారు. ఈ పరిణామంతో.. ఆర్జేడీ విజయావకాశాలు దెబ్బతింటున్నాయి.
2020లో చేసిన తప్పే చేస్తున్న కాంగ్రెస్
2020లో కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ , కమ్యూనిస్టులు కలసి కట్టుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి.. అప్పట్లో తేజస్వీ ఇంకా రాటుదేలలేదు కాబట్టి రాజకీయం చేసి..70 సీట్లు తీసుకుని పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అలా సీట్లు తీసుకుని పోటీ చేయడమే బీజేపీ, జేడీయూలకు మంచిది అయింది. కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సీట్లను ఆ కూటమి చేతుల్లో పెట్టింది. ఫలితంగా ప్రభుత్వాన్ని బీజేపీ, జేడీయూ కలిసి ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ నిర్వాకంతో తేజస్వీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కోల్పయారు.
ఆర్జేడీ గెలిచే సీట్లలో కాంగ్రెస్ రాజకీయం
ఆర్జేడీ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న సీట్లలోనే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది. తమకు ఆ సీట్లు కావాలని పట్టుబడుతోంది. గతంలో చేసిన తప్పు మళ్లీ జరగకూడదని.. ఆర్జేడీ తాము పోటీ చేయాలనుకున్న 143 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. తర్వాత మీ ఇష్టం అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది.కానీ ఇప్పటి వరకూ అధికారింగా కూటమి మధ్య సీట్ల పంపిణీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ రచ్చకు దిగడమే దీనికి కారణం. కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దాదాపుగా పది చోట్ల కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదంతా విశ్వాసం లేని కూటమి రాజకీయం అన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది.
సీట్ల సమస్య లేకుండా బీజేపీ సర్దుబాటు
మరో వైపు జేడీయూతో సీట్ల సర్దుబాటును బీజేపీ పక్కాగా పూర్తి చేసుకుంది. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు ఎప్పటికప్పుడు.. తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నా.. ఆయనను బుజ్జగించి ప్రాధాన్యత స్థాయిలో సీట్లను కట్టబెట్టారు. త్యాగాలు చేసుకుని అయినా ఏ సమస్య లేకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. అధికార వ్యతిరేకతతో పీఠం తమకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆర్జేడీకి కాంగ్రెస్ గండంగా మారింది. ఈ ఎన్నికల్లో ఫలితం తేడా వస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్..కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టి..కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో ఉంటే.. ఆ పార్టీ దరిద్రం తమకు అంటిస్తున్నారని ఆయన అనుభవం అయ్యాక తేల్చుకుంటారు.