ప్రొ.నాగేశ్వర్ : ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు పనేంటి..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… ఏపీ రాజకీయాలపైనా దృష్టి పెట్టారు. కాలి నడకన తిరుమల వెళ్లారు. తిరుపతిలో బహిరంగసభలో పాల్గొన్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అదే సమయలో నరేంద్రమోడీ.. రెండు సార్లు ఏపీ పర్యటనకు వచ్చారు. ఓ సారి గుంటూరులో..మరోసారి విశాఖలో పర్యటించారు. బహిరంగసభల్లో చంద్రబాబును విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఏపీపై ఎందుకు ఫోకస్ పెట్టాయి. ఆ పార్టీలకు ఏపీపై ఆశలు ఉన్నాయా…?

ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా వచ్చే చాన్స్ లేదు…!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీల ఉనికి లేదు. అటు కాంగ్రెస్ కానీ.. ఇటు బీజేపీ కానీ… ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించే పరిస్థితులు లేవు. సీట్లు కాదు.. గణనీయమైన ఓట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. తమిళనాడులోలా…ఏపీలో జాతీయ పార్టీల పరిస్థితి ఉందని.. చాలా మంది చెబుతూ ఉంటారు కానీ… తమిళనాడు కన్నా ఘోరంగా.. ఏపీలో జాతీయ పార్టీల పరిస్థితి ఉంది. తమిళనాడులో.. డీఎంకేతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కాయి. అలాగే.. అన్నాడీఎంకే పొత్తులు పెట్టుకున్న బీజేపీకి ఐదు సీట్లు దక్కాయి. అంటే.. ఎక్కువగా సీట్లు దక్కినట్లే. కానీ ఏపీలో.. ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. బీజేపీతో పొత్తులు అంటేనే భయపడి పారిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. జాతీయ స్థాయిలో… సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత.. ఏపీలో మాత్రం పొత్తులు పెట్టుకుని సీట్లివ్వడానికి సిద్దపడలేదు. కాంగ్రెస్ బలపడి ఉంటే.. సీట్లు ఇచ్చే వారేమో.. అలాంటి సూచనలు లేకపోవడంతో… చంద్రబాబు కూడా దూరం పెట్టారు. కాంగ్రెస్‌ సీనియర్ నేతలు టీడీపీలో చేరుతున్నారు. టిక్కెట్లు అడుగుతున్నారు.

ప్రత్యేకహోదా అంశంతో టీడీపీ కోసం రాహుల్ ప్రచారం..!

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై తెలుగుదేశం లోనూ అభ్యంతరాలున్నాయి. మొదట్లోనే కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు లాంటి వారు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా.. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల లాభం లేదనుకున్నారు. ఏపీలో పొత్తులు లేకపోయినా… చంద్రబాబుతో రాహుల్ గాంధీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే… ఇక్కడ టీడీపీ గెలవడం వల్ల.. దేశంలో.. బీజేపీ వ్యతిరేకపక్షాలు బలపడతాయి. కాంగ్రెస్ కు మద్దతిచ్చే పార్టీలకు బలం చేకూరుతుది. చంద్రబాబు ఢిల్లీలో తీసుకున్న కాంగ్రెస్ అనుకూల వైఖరిని జస్టిఫై చేయడానికి రాహుల్ గాంధీ ఏపీకి వస్తున్నారు. దానికో ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ప్రత్యేకహోదా. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎందుకు కలిశాడు.. అంటే ప్రత్యేకహోదా కోసం.. అన్న సమాధానం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు.

జగన్‌ను బలపరిచేందుకు మోడీ, అమిత్ షాల టూర్లు..!

ఇక భారతీయ జనతా పార్టీ ఎందుకు వస్తుంది..? ఏపీలో బీజేపీకి ఏమీ లేదు. తెలంగాణలోనే ఆ పార్టీకి దిగజారిపోయింది. కొంత అవకాశం ఉన్న… సీనియర్లు నేతలు ఉన్న తెలంగాణలోనే… భారతీయ జనతా పార్టీ.. ఒక్క సీటుకు పడిపోయింది. నిజానికి… బీజేపీకి తెలంగాణలో… కొంత బేస్ ఉంది. మత పొలరైజేషన్ ను చూసుకున్నా.. బీజేపీకి.. తెలంగాణలో..ఎంతో కొంత బలం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అయినా.. ఆ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. ఐదు సీట్ల నుంచి ఒక్క సీటుకు తగ్గిపోయారు. అక్కడి పరిస్థితితో కలిస్తే.. ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అయినా మోడీ ఏపీకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు..? తమ గెలుపుతో పాటు మిత్రుల గెలుపు కూడా.. వారికి ముఖ్యమే. అందుకే… వస్తున్నారు. మోడీ రెండు సార్లు ఏపీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి… మోడీ, అమిత్ షా ల పర్యటనలపై ఒక్క మాట కూడా మాట్లాడరు. దీన్ని బట్టి చూస్తే.. అసలు బీజేపీ నేతలు.. ఏపీలో చేసే రాజకీయాలు తమ కోసం కాదు.. జగన్మోహన్ రెడ్డి కోసం అని అర్థం చేసుకోవచ్చు. అంటే.. ఏపీలో ఏ మాత్రం అవకాశాలు లేకపోయినా.. ఎందుకు జాతీయ పార్టీల అగ్రనేతలు… పర్యటిస్తున్నారంటే… తమ మిత్రుల కోసం..అని నిర్ణయించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.