తెలుగు360 ఎడిటర్స్ కామెంట్ : బీజేపీ, జగన్, కియా.. క్యా కియా..?

సినీ, రాజకీయ వార్తల్లో లోతైన అంశాలను పాఠకులను అందించడంలో అందరి కన్నా ముందున్న తెలుగు360 ప్రతి శుక్రవారం.. ఆ వారం.. ఆ వారం రాజకీయాలపై ఓ విశ్లే్షణను ఇవ్వాలని సంకల్పించింది. ఈ వారం నుంచి “360 ఫ్రైడే కామెంట్” పేరుతో దాన్ని ప్రారంభిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నమైనవి. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం… ఒకటో రోజు నుంచే రేస్ ప్రారంభిస్తారు. ఏ రాజకీయ పార్టీ కూడా వెనక్కి తగ్గదు. ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా అని అనుకోరు. సర్వశక్తులు ఒడ్డుతారు. అందుకే.. ఏపీ రాజకీయాలు.. గత ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతంగానే ఉన్నాయి. ఇవి ఈ వారం కీలక మలుపులు తిరిగాయని అనుకోవచ్చు. ఆ మలుపు… ఓ అధికార పార్టీ నుంచి.. మరో అధికార పార్టీకి వచ్చిన బెదిరింపులు. విశేషం ఏమిటంటే.. ఇదే ఫార్ములాను జగన్ సర్కార్ పై… కియా కంపెనీ ప్రయోగించడం..!

మండలిని రద్దు చేయకపోతే “హోదా”ను లేవనెత్తుతానని బీజేపీకి జగన్ సందేశం..!

జల్సా సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అడవిలో ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్.. వెళ్తూ.. ఎవరి చేతిలో తుపాకీ ఉంటే.. వారి వాదనను కరెక్ట్ అని తుపాకీ గురి పెట్టి బలవంతంగా ఒప్పించుకుంటారు. అక్కడ సిద్ధాంతపరమైన వాదనను కామెడిగా చెప్పారు.. కానీ.. రాజకీయాల్లో సిద్ధాంతానికి..హాస్యానికి చోటు ఉండదు. అధికారం అనే గన్ పెట్టి బెదిరించి.. తమ పని తాము చేసుకుపోవడమే. ప్రస్తుతం ఏపీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇదే గేమో నడుస్తోందని… ఈ వారం జరిగిన పరిణామాలతో నిరూపితమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ ఫైన్ మిడిల్‌నైట్ … ప్రత్యేకహోదా గుర్తుకు వచ్చింది. ఓ నాలుగు పేజీల లేఖ రాసేశారు. ప్రత్యేకహోదా… అనే పదం.. భారతీయ జనతా పార్టీకి పీడకల లాంటిది. హోదా అంశంతో ప్రజల్లో తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారని.. బీజేపీ .. చంద్రబాబును టార్గెట్ చేసింది. ఓడించే వరకూ వదిలి పెట్టలేదు. వైసీపీ. ఎంపీలందర్నీ గెలిపిస్తే.. కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా మెడలు వంచి హోదా తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేసిన నేత జగన్మోహన్ రెడ్డి. అయితే… అనుకున్న రేంజ్‌లో గెలిచిన తర్వాత జగన్ మెడలు వంచే ప్రయత్నం చేయకపోయినా… కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది కాబట్టి… ప్లీజ్ .. ప్లీజ్ అని.. ఇచ్చే వరకూ అడుగుతానని జగన్ మొదట్లోనే ప్రకటించారు. ఇప్పుడు లేఖ రాశారు. కానీ ఇందులో మేటర్.. ప్లీజ్ ..ప్లీజ్ అన్నట్లుగా లేదు. లేఖ రాసిన సమయం.. సందర్భం బట్టి చూస్తే.. ఇది .. బీజేపీకి ఉన్న “ప్రత్యేకహోదా” ఫోబియాను భయపెట్టేందుకు వాడిని అస్త్రమని స్పష్టమవుతుంది.

హోదా మాటెత్తితే రాజకీయ భవిష్యత్ అంతమవుతుందని బీజేపీ రివర్స్ …!

ఏపీ సర్కార్ కు సంబంధించిన అనేక అంశాలు… కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవి ఎప్పుడూ ఉంటాయి. కానీ వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కూడా కేంద్రం వద్ద ఉన్నాయి. అందులో ఇప్పటికిప్పుడు.. తమ అజెండాలో కీలకంగా నిర్దేశించుకున్నది మండలి రద్దు. అసెంబ్లీ తీర్మానం చేసి.. పంపితే.. కేంద్రం పట్టించుకోవడం లేదని జగన్ గుర్రుగా ఉన్నారు. మండలి రద్దు తీర్మానాన్ని బిల్లుగా చేసి ఆమోదించకపోతే… ప్రత్యేకహోదాను మళ్లీ తెరపైకి తెస్తానని..జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి డైరక్ట్ గా పంపిన వార్నింగ్ ఆ లేఖ అని ఢిల్లీకి కూడా… నేరుగానే సందేశం పంపారు. జగన్ హెచ్చరికలు.. బీజేపీకి బాగానే అర్థమయ్యాయి. ఓ చిన్న రాష్ట్రానికి సీఎం అయిన మీకే అంతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మాకెంత ఉండాలని… నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేకహోదా మాటెత్తితే.. ప్రమాదంలో పడతారని హెచ్చరికలు జారీ చేసేశారు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలిగి తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్‌లో ఏపీకి రూపాయి కేటాయించకపోయినా.. ఆయన స్పందించనిది అందుకే. బడ్జెట్ అన్యాయం మాత్రమే కాదు.. గత ప్రభుత్వం పోలవరం కోసం ఖర్చు చేసిన ఐదు వేల కోట్లు.. వెనుక బడిన జిల్లాలకు నిధులు సహా… ఏ ఒక్క అంశంలోనూ… జగన్ ..కేంద్రాన్ని అడుగుతున్న దాఖలాలు లేవు. ఎందుకంటే.. బీజేపీని నొప్పింపకూడదనేదే.. జగన్ లక్ష్యం.

ఢిల్లీ అహంకారానికి.. కడప పౌరుషానికి మళ్లీ పోరాటం ఉంటుందా..?

బీజేపీ తల్చుకుంటే ఏమైనా చేయగలదని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు నిరూపిచాయి. చంద్రబాబును ముఫ్పై సీట్లలోపే పరిమితం చేస్తామని… పొత్తు తెంచుకున్న తర్వాత ఆ పార్టీ నేతలు బహిరంగంగా సవాల్ చేశారు. అన్నట్లుగానే… టీడీపీ పరిస్థితి అలాగే అయిపోయింది. ఇక తమిళనాడులో బీజేపీ టార్గెట్ చేస్తే.. తెల్లవారితో ముఖ్యమంత్రి కావాల్సిన శశికళ… జైల్లో ఊచలు లెక్కబెట్టింది. ఇవన్నీ…కళ్ల ముందున్న సాక్ష్యాలు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఫిక్స్ చేయడం బీజేపీకి క్షణాల్లో పని. చంద్రబాబుపై ఎలాగైనా అవినీతి కేసులు పెట్టాలని.. ఎనిమిది నెలలుగా తవ్వుతూనే ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు ఏమీ దొరకలేదు. కానీ.. బీజేపీకి అంత శ్రమ అవసరం లేదు. ఇంకా కావాలంటే.. కోల్ కతా నుంచి సెర్బియా వరకూ.. కొత్త కొత్త కోణాలను ఆవిష్కరించగలిగే కెపాసిటీ కూడా ఉంది. అందుకే.. బీజేపీ హెచ్చరికల్ని అంత తేలికగా తీసుకోవడం లేదు రాజకీయ వర్గాలు. జీవీఎల్ నరసింహారావు ఓ ఎంపీగా నేరుగా ఓ ముఖ్యమంత్రిని హెచ్చరించేంత ధైర్యం చేయకపోవచ్చు. ఆయన వెనుక ఉన్నది బీజేపీనే. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు జగన్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకహోదా అనే మాటను తన డిక్షనరీ నుంచి తొలగించడం … రెండోది.. గతంలో సోనియాగాంధీపై తాను పోరాడానని చెప్పుకుని.. ఢిల్లీ అహంకారానికి.. కడప పౌరుషానికి మధ్య పోరాటం అన్నట్లుగా రంగంలోకి దిగడం.

ఆపేసిన ప్రోత్సాహకాల కోసం కియాది కూడా బెదిరింపే..!

బెదిరింపుల రాజకీయ వ్యూహంలోకి.. వ్యూహాత్మకంగా కియా కూడా ఎంటరవడం.. ఏపీ రాజకీయాల్లో కొత్త కోణం. కియా పరిశ్రమపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి నిర్లక్ష్యం చూపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో… కియాకు ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల ఏపీకి రూ. 20వేల కోట్ల నష్టం వస్తుందని.. ఓ మంత్రి నేరుగా చెప్పారు. ఆ అభిప్రాయానికి తగ్గట్లే కియాకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు అన్నీ నిలిపివేశారు. ఇప్పుడు… ఉన్న రాజకీయ పరిస్థితులతో.. తాము వెళ్లిపోతున్నామన్న అభిప్రాయం కల్పించి ప్రభుత్వాన్ని బెదిరించడానికే.. కియా కొరియా యాజమాన్యం… తన స్థాయికి తగ్గట్లుగా అంతర్జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చింది. కియా వెళ్లిపోతే.. జగన్ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రచ్చ … ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి.. కియాకు చంద్రబాబు ఇవ్వాలనుకున్నదాని కన్నా ఎక్కువే.. ఇచ్చి అయినా కియాను.. కామ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు సిద్ధాంతాల వాదనల్లో.. ఎవరికి అధికారం ఉంటే… వారి సిద్ధాంతం గొప్పదని అంగీకరించాల్సి వచ్చేది. ఇప్పుడు… ఆ అధికారం… ఉపయోగించుకునే విధానం మారింది. అది రాజకీయం అయినా.. వ్యాపారం అయినా… ఈ పరిణామాలు… ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close