ఉద్య‌మ నాయ‌క‌త్వం కోసం భాజ‌పా ఆరాటం..!

ఏదైనా ఇబ్బంది వ‌చ్చిందీ అంటే.. ప్ర‌జ‌ల‌కి క‌ష్టం, కానీ రాజ‌కీయ పార్టీల‌కు అదే అవ‌కాశం! ఇలానే అనిపిస్తోంది తెలంగాణ‌లో భాజ‌పా తీరు చూస్తుంటే! ఆర్టీసీ కార్మికులు రోడ్డునప‌డ్డారు. ఆందోళ‌న తీవ్ర‌త‌ర‌మౌతోంది. స‌మ‌స్య‌లు తీర్చాల్సిన ప్ర‌భుత్వం మొండికేసి చోద్యం చూస్తూ కూర్చుంది. ఇలాంటి స‌మ‌యంలోనే రాజ‌కీయ ‌పార్టీలు స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారి త‌ర‌ఫున నిల‌బ‌డాలి. అలా నిల‌బ‌డే క్ర‌మంలో… స‌మ‌స్య‌పై పోరాటం చేస్తున్నామ‌నే కోణంలోనే స‌ద‌రు పార్టీకి చెందిన నాయ‌కులు స్పందించాలే త‌ప్ప‌… ఆ పోరాటం ద్వారా తాము పొందుతున్న రాజ‌కీయ ల‌బ్ధిని వ్య‌క్తీక‌రించే ప్ర‌య‌త్నం చెయ్య‌కూడ‌దు. భాజ‌పా నేత‌లు చేస్తున్న‌ది అలానే అనిపిస్తోంది. కార్మిక స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నామ‌న్న పేరుతో ఉద్య‌మాన్ని న‌డిపించే నాయ‌క‌త్వం త‌మ‌కే కావాల‌న్న ఆరాటం క‌నిపిస్తోంది.

భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… మ‌రో స‌క‌ల జ‌నుల స‌మ్మె జ‌ర‌గాల‌న్నారు. ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌నీ, కార్మికులు అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఈ సంద‌ర్భంలో సీఎం కేసీఆర్ తీరు మీద విమ‌ర్శ‌లు యాథావిధిగా చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే… ఉద్య‌మాన్ని రాజేస్తున్న‌ట్టుగా ఉందే త‌ప్ప‌, ప‌రిష్కార మార్గాల ఆలోచ‌నాధోర‌ణి క‌నిపించ‌డం లేదు. మాజీ ఎంపీ, భాజ‌పా నేత‌ వివేవ్ మాట్లాడుతూ… ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఫ‌ల్యం చెందార‌నీ, నైతిక బాధ్య‌త వ‌హిస్తూ వెంట‌నే రాజీనామా చేయాల‌న్నారు. భాజ‌పా ఎంపీ అర‌వింద్ మాట్లాడుతూ… నిజామాబాద్ లో కుమార్తె క‌విత‌కు ప‌ట్టిన గ‌తే రాష్ట్రంలో కేసీఆర్ కూడా త్వ‌ర‌లో ప‌డుతుందంటూ జోస్యం చెప్పారు! కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయేలా ఉంద‌నీ, కూలినా ప్ర‌జ‌లు బాధ‌ప‌డే ప‌రిస్థి‌తి ఉండ‌ద‌న్నారు. ఇత‌ర నేత‌లు బండి సంజ‌య్, జితేంద‌ర్ రెడ్డి, పెద్దిరెడ్డి.. వీళ్లంతా ఖ‌మ్మం వెళ్లి, అక్క‌డ ఆందోళ‌న‌లు చేయాల‌నే వ్యూహంలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాజ‌పా నేతృత్వంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌తో కేసీఆర్ స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంద‌న్నారు మ‌రో భాజ‌పా నేత‌.

ఇలాంటి స‌మ‌యంలో నాయ‌కులు, పార్టీలు కార్మికుల త‌ర‌ఫునే నిల‌బ‌డ‌తాయి. భాజ‌పా నేత‌ల‌దీ అదే ప్ర‌య‌త్నం. కానీ, ఆ క్ర‌మంలో నాయ‌కుల మాట‌లు గ‌మ‌నిస్తే… ఇదేదో రాజ‌కీయంగా త‌మ‌కు క‌లిసొస్తున్న అవ‌కాశంగా భావిస్తున్నారా అనే అభిప్రాయం క‌లుగుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయేలా ఉంద‌నీ, ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాల‌నీ, నిజామాబాద్ లో క‌విత ఓట‌మి అంశాన్ని ఇప్పుడు తెర మీదికి తేవ‌డం అప్ర‌స్తుతం క‌దా! స‌క‌ల జ‌నుల స‌మ్మె జ‌ర‌గాల‌నీ, నాయ‌క‌త్వం త‌మ‌దే అంటూ ప్ర‌క‌టించుకోవ‌డం కూడా వేరే ర‌క‌మైన సంకేతాల‌ను ఇస్తున్న‌ట్టుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com