తెలంగాణలో కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బలమైన పోరాటాంశాల కోసం వెతులాటలో పడ్డాయి! అలాంటి బలమైన అంశమే.. మద్యపానం. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందనీ, రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నారంటూ విపక్షాలు ఇంతకుముందు అపడపా దడపా కేసీఆర్ పై విమర్శలు చేస్తూ వచ్చేవి. కానీ, ఇప్పుడు మద్యపానంపై పోరాటం చేసేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పాలి. ముందుగా భాజపా ఈ పోరాటాన్ని నెత్తినేసుకుంది. టి.సర్కారు ఆబ్కారీ విధానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు భాజపా నాయకులు లక్ష్మణ్ ఈ మధ్యనే ప్రకటించారు. ఒకరోజు నిరాహార దీక్షకు కూడా ఓ భాజపా నాయకుడు సిద్ధపడ్డారు. మద్యపానానికి వ్యతిరేకంగా భాజపా చేపట్టబోతున్న కార్యక్రమానికి ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ తాగుబోతులు చేస్తున్నారనీ, ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారనీ, బెల్టు షాపుల విస్తరణపై ఉన్నశ్రద్ధ పాలనపై పెడితే బాగుంటుందనీ, ఇకపై మద్యపాన వ్యతిరేకంగా భాజపా కార్యక్రమాలు చేపడుతుందని ఆయన ప్రకటించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని తెరమీదికి తెస్తోంది. గ్రామగ్రామానా బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలకు తాగుబోతులను చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి మండిపడ్డారు. “నువ్వు తాగితే తాగు. కానీ ప్రజలతో ఎందుకు తాగిపిస్తవ్..? రాష్ట్రాన్ని ఎందుకు తాగుబోతును చేస్తున్నావ్..? ఇంతకీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్” అంటూ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఓపక్క కేంద్రం ఇస్తున్న నిధుల్ని భోంచేస్తూ, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని ఏం చేశారో ఎవ్వరికీ తెలీదంటూ ఆరోపించారు.
మొత్తానికీ, రెండు పార్టీలూ మద్యపాన వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమౌతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. భాజపా, కాంగ్రెస్ లు ఒకే ఇష్యూని పోరాటాంశంగా ఎన్నుకున్నాయని చెప్పాలి. అలాంటప్పుడు కలిసి పోరాడొచ్చు కదా అంటారా..? అన్ని పార్టీలూ ప్రజల బాగు కోసమే పోరాటం చేస్తాయి. ఆ పోరాటం వల్ల రాజకీయంగా ఎంతోకొంత లాభం ఉండాలని కోరుకుంటారు కదండీ! అంశం ప్రజలదే అయినా.. ప్రయోజనాలు పార్టీలకి సంబంధించినది కదా! మరి, మద్యం వ్యతిరేకంగా భవిష్యత్తులో కాంగ్రెస్, భాజపాల పోటీ పోరాటాల్లో ఎవరు ముందజవేస్తారో వేచి చూడాలి.