సాధారణంగా ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఉచితంగా అది ఇస్తాం, ఇది ఇస్తాం అని వరాల జల్లు కురిపిస్తారు. కానీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక బీజేపీ నేత మాత్రం దానికి భిన్నంగా, కాస్త ఘాటు గా ఉండే వినూత్న హామీని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకు అధికారం ఇస్తే.. ఉత్తరప్రదేశ్ తరహాలో ఎన్కౌంటర్లు చేయిస్తాం అని ఆయన ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
వరాల జల్లు కాదు.. తూటాల జల్లు!
బెంగాల్ బీజేపీ సీనియర్ నేత, ఖరగ్‌పూర్ సదర్ అభ్యర్థి దిలీప్ ఘోష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 4వ తేదీ తర్వాత అంతా మారిపోతుంది. ఇప్పుడు నేరగాళ్లతో కూర్చుని టీ తాగుతున్న పోలీసులు, అప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసుల్లాగా ఎన్కౌంటర్లు చేస్తారు అని ఆయన హామీ ఇచ్చారు. దీంతో అందరూ ఔరా అని అనుకోక తప్పలేదు.
యూపీ ఎన్కౌంటర్లు కథ ఇదీ!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో నేరస్థులను ఏరిపారేయడానికి పోలీసులు ఎన్కౌంటర్లను ఆయుధంగా చేసుకున్నారు. వందల మంది నేరస్తులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. దాంతో చాలా మంది నేరస్థులు భయంతో పోలీస్ స్టేషన్లకు వచ్చి లొంగిపోయారు. ఇప్పుడు దిలీప్ ఘోష్ గారు అదే ఫార్ములాను బెంగాల్‌కు దిగుమతి చేస్తానని అంటున్నారు. అంటే, రసగుల్లాలు, సందేశ్‌లు తినే బెంగాల్ గడ్డపై ఇక నుంచి తూటాల చప్పుడు వినిపిస్తుందని ఆయన గ్యారెంటీ ఇస్తున్నారు. అభివృద్ధి మంత్రం కంటే ఎన్కౌంటర్ మంత్రం బాగా పనికొస్తుందని ఆయన గట్టి నమ్మకం కాబోలు!
తృణమూల్ అసాఘింక శక్తుల అడ్డా అని బీజేపీ ఆరోపణలు
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలను అరికట్టాలంటే ఈ యోగి స్టైల్ ఒక్కటే మార్గమని దిలీప్ ఘోష్ భావిస్తున్నారు. ప్రతిపక్ష టిఎంసి మాత్రం దీనిపై మండిపడుతోంది. బెంగాల్లో సాగేది చట్టబద్ధమైన పాలన, మీ యూపీ లాంటి ఎన్కౌంటర్ రాజ్ ఇక్కడ నడవదు” అని కౌంటర్ ఇస్తోంది. హామీలంటే స్కూళ్లు, ఆసుపత్రులు కట్టిస్తామని ఇవ్వాలి కానీ, ఇలా ఎన్కౌంటర్లు చేస్తామనడం ఏమిటని బీజేపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. అందుకే పెద్దగా ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు.
