సెలబ్రిటీల వెంట పరుగులు పెడుతున్న బీజేపీ..! సన్నిడియోల్‌కు ఎంపీ టిక్కెట్..!

మీడియాలో కొద్దిగా ప్రచారం తెచ్చుకుని సెలబ్రిటీ అనే హోదా వచ్చినట్లుగా ఉంటే చాలు.. భారతీయ జనతా పార్టీ పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తోంది. ఆ సెలబ్రిటీ హోదా.. సినిమాలతోనే రావాలని ఏం లేదు.. క్రీడలు దగ్గర్నుంచి… హిందూత్వ అతివాదం వరకూ.. ఏ అంశంలో అయినా వివాదాస్పదం అయి.. తెచ్చుకున్న సెలబ్రిటీ హోదా అయినా చాలు… భారతీయ జనతా పార్టీ… రెడ్ కార్పెట్ పరుస్తోంది. టిక్కెట్ కూడా ఇచ్చేస్తోంది. ఈ జాబితాలో తాజాగా… హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్, సన్నీడియోల్ కూడా చేరారు. బాలీవుడ్‌లో చాలా మందిని.. ఈ సారి బీజేపీ తన పార్టీలో చేర్చుకుని… ఎన్నికల బరిలో నిలబెట్టాలనుకుంది. అలాంటి వారిలో మాధురీ దీక్షిత్ దగ్గర్నుంచి అక్షయ్ కుమార్ వరకూ ఉన్నారు. కొంత మంది ఒప్పుకున్నా.. మరికొంత మంది అంగీకరించలేదు. బీజేపీ వలలో.. తాజాగా.. సన్నీడియోల్ పడ్డారు.

పంజాబ్‌లో ఏ మాత్రం ఆశలు లేని… బీజేపీ… సినిమా స్టార్లతో ఒకటి, రెండు సీట్లు అయినా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఉన్న పదమూడు సీట్లలో.. పది చోట్ల అకాలీదళ్.. మూడు చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. ఈ మూడింటిలో ఒకటి సన్నిడియోల్‌కు కేటాయించేలా ఒప్పందం చేసుకుని ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి సన్నిడియోల్ ది.. భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీనే. ఆయన తండ్రి ధర్మేంద్ర.. రాజస్థాన్ లోని బికనీర్ నుంచి ఓ సారి పోటీ చేశారు. ధర్మేంద్ర భార్య హేమమాలిని… సుదీర్ఘ కాలంగా బీజేపీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో మధుర నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి అక్కడ్నుంచే పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కూడా… ఎన్నికల్లో నిలబెట్టేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కంచుకోటల్ని నిలబెట్టుకోవడానికి… రేసుగుర్రం విలన్ , భోజ్ పురి హీరో…రవికిషన్ కు టిక్కెట్ ఇచ్చారు. ఇలా పలు రాష్ట్రాల్లో ఏ మాత్రం సెలబ్రిటీ హోదా ఉండి.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబర్చినా.. వెంటనే..వారికి కండువా కప్పేసి.. టిక్కెట్ ఇచ్చేస్తున్నారు బీజేపీ నేతలు. వారి వ్యూహం ఫలిస్తుందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com