జూబ్లిహిల్స్ ఉపఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ అంటీ ముట్టనట్లుగా ఉంది. అభ్యర్థి గురించి ఎలాంటి కసరత్తు చేయలేదు. నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్న ముగ్గురు ఎవరో చాలా మందికి తెలియదు. ఎవరికీ తెలియని నేతలు పార్టీ అభ్యర్థిని సిఫారసు చేయడం ఏమిటో తెలియక చాలా మంది బీజేపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
గత ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఈ సారి కూడా పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారు. అదే సమయంలో తాము పోటీ చేస్తామని ఆ పార్టీలో పోటీపడుతున్న వారు కూడా లేరు. సాధారణంగా ఇలాంటి ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది ముందుకు రావాలి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉంది. హైకమాండ్ ప్రకటించేలా ప్రాసెస్ ప్రారంభించింది.
బీజేపీకి జూబ్లిహిల్స్‌లో కొంత బలం ఉంది. విజయానికి ఎప్పుడూ దగ్గరగా రాలేదు కానీ.. స్థిరమైన ఓటు బ్యాంక్ మాత్రం ఎప్పుడూ ఫలితాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా గెలిచే అవకాశం లేదన్న కారణంగా .. పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. కానీ మూడు పార్టీల మధ్య హోరాహోరీలో ఏమైనా జరగవచ్చని బలమైన అభ్యర్థిని నిలబెడితే.. పోటీలో ఉండవచ్చని బీజేపీ క్యాడర్ అనుకుంటున్నారు.