చంద్రబాబు గురించే మాట్లాడుతున్న బీజేపీ..!

GVL Narasimha Rao
GVL Narasimha Rao

తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా తాము మళ్లీ బీజేపీతో కలుస్తామని చెప్పలేదు కానీ… భారతీయ జనతాపార్టీ నేతలు మాత్రం.. తమకు చంద్రబాబుతో స్నేహం అక్కర్లేదనే ప్రకటనలు చేసేస్తున్నారు. గత వారం రోజులుగా.. ఏపీకి వస్తున్న బీజేపీ ఢిల్లీ నేతలు అదే చెబుతున్నారు. మొదటగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్..ఆ ప్రకటన చేయగా.. ఇప్పుడు… చాలా రోజుల తర్వాత ఏపీకి వచ్చిన యూపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా అదే చెబుతున్నారు. తమకు చంద్రబాబుతో స్నేహం అవసరం లేదని.. చెప్పుకొచ్చారు. బీజేపీతో స్నేహం వదులుకుని తప్పు చేశామని చంద్రబాబు ఇప్పుడు బాధపడుతున్నారని.. ఆ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని గుర్తు చేస్తున్నారు.

ఏపీలో పర్యటిస్తున్న సునీల్ ధియోధర్, జీవీఎల్ నరసింహారవు మీడియాతో వేర్వేరుగా మాట్లాడుతూ.. టీడీపీనే హైలెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించగా… తాము ఎంత శక్తిగా అవతరించబోతున్నామో.. వచ్చే ఎన్నికల్లో చూస్తారని.. జీవీఎల్ .. సవాల్ చేశారు. గట్టిగా ఎన్నికలు పూర్తయ్యి ఐదు నెలలు కూడా కాలేదు. అప్పుడే.. ఏపీలో బీజేపీ నేతలు.. వచ్చే ఎన్నికల గురించి మాట్లాడేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నేతలు బీజేపీతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారంటూ.. మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో.. బీజేపీ నేతల వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలి కాలంలో.. వైసీపీ దాడుల భయంతో.. పలువురు నేతలు బీజేపీలో చేరినప్పటికీ.. సంస్థాగతంగా బీజేపీకి బలం పెరిగిందేమీ లేదు. ఆయా నేతల వ్యక్తిగత బలం ఆధారంగా వచ్చే బలం మాత్రమే ఉంది. వారి ద్వారా ఎవరైనా లోకల్ బాడీస్ ఎన్నికల్లో గెలిస్తే.. అది బీజేపీ బలం అయ్యే అవకాశం లేదు. అయితే.. అలా గెలిచేవారందరూ బీజేపీ ఖాతాలోకే వస్తారు కాబట్టి.. బలమైన నేతల్ని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా.. క్షేత్ర స్థాయిలో బలపడాలనే లక్ష్యంతోనే ప్రస్తుతానికి బీజేపీ ఉంది. ఇప్పుడు మళ్లీ టీడీపీతో సన్నిహిత సంబంధాలంటే.. ఎదిగాలనే ఉత్సాహం చల్లబడిపోతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com