ప్రత్యేక హోదాపై ఏపిలో వేడి పెరిగినపుడల్లా తెదేపా నేతలు గట్టిగా మాట్లాడటం, ఆ సమయంలో రాష్ట్ర భాజపా నేతలు మౌనం వహించడం, ప్రజల మద్యకి రావడానికి కూడా జంకడం, మళ్ళీ వేడి తగ్గగానే బయటకి వచ్చి మిత్రపక్షమైన తెదేపా, ప్రతిపక్షాలపై విరుచుకుపడటం గత రెండేళ్లుగా అందరూ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తెదేపా వెనక్కి తగ్గి, మళ్ళీ కేంద్రంతో రాజీపడినట్లు కనిపిస్తోంది కనుక రాష్ట్ర భాజపా నేతలు బయటకి వచ్చి దానిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదాని సెంటిమెంటుగా మార్చడంలో కాంగ్రెస్ కొంత విజయం సాధించింది. తెదేపా కూడా దాని ఉచ్చులో పడినట్లే కనిపిస్తోంది. ఇంట్లో నా భార్య కూడా ప్రత్యేక హోదా ఇస్తారా లేదా? అని ప్రశ్నిస్తోందంటే అది ఎంత సెంటిమెంటుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లయితే దానికి సరిపోయేలాగ నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. దాని గురించి పార్టీలో చర్చిస్తున్నాము,” అని అన్నారు.
విష్ణుకుమార్ రాజు మాటలలో ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, తెదేపా కూడా ప్రతిపక్షాలతో గొంతు కలపి కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడం తప్పనే అభిప్రాయం స్పష్టంగా కనబడుతోంది. కానీ ఆ విషయాన్ని ఆయన చాలా సున్నితంగా చెప్పారనుకోవాలి అంతే. మంత్రి మాణిక్యాలరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని కుండబ్రద్దలు కొట్టినట్లే చెప్పారు. కనుక దాని గురించి తెదేపా చేస్తున్న హడావుడి సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు భావించవచ్చు.
ఇక తెదేపాని తీవ్రంగా వ్యతిరేకించే భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వేరే అంశం తీసుకొని తెదేపాపై విరుచుకు పడ్డారు. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో దేవాలయాలు, మసీదులు కూల్చి వేసి, వాటి స్థానంలో టాయిలెట్లు కట్టడం ఏమిటని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం ప్రజల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అభివృద్ధి పేరిట రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని విమర్శించారు. హిట్లర్ అనే మాట చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్నవేనని వేరేగా చెప్పనవసరం లేదు.
భాజపాకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా ప్రత్యేక హోదా కోసం డిల్లీలో చేస్తున్న పోరాటాల వలన కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రంలో భాజపాకి ఎంత నష్టం జరుగుతోందో, అదేవిధంగా రాష్ట్ర భాజపా నేతలు విజయవాడలో దేవాలయాల కూల్చివేత, భూసేకరణ గురించి చేస్తున్న విమర్శల వలన తెదేపా ప్రభుత్వానికి అంతే నష్టం జరుగుతోంది. ఈ విషయం ఆ రెండు పార్టీలకి కూడా తెలుసు కానీ ఎవరి పార్టీని వారు కాపాడుకోవాలి కనుక నష్టమైన కష్టమైనా పరస్పర విమర్శలు చేసుకోక తప్పడం లేదు. వాటి వలన రెండు పార్టీలకి కొంత నష్టం జరుగుతున్నప్పటికీ, వేరే ప్రయోజనం కూడా ఉందనే చెప్పాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని ఆసక్తిగా గమనిస్తున్న ప్రజల దృష్టిని వాటిపై నుంచి తమ మధ్య జరిగే ఈ యుద్దంపైకి మరల్చడం ద్వారా వారిని ప్రతిపక్షాల ప్రభావం నుంచి బయటకి రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవిధంగా తెదేపా, భాజపాలు తమ ఈ ప్రయత్నాలలో కొంతవరకు సఫలం అయినట్లే కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదాపై ప్రజలని పోరుబాట పట్టించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి నుంచి అంత సానుకూల స్పందన రావడంలేదని చెప్పవచ్చు.