బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ ఎంపీ శత్రుఘన్ సిన్హా క్రమంగా తన పార్టీ నుండి దూరంగా జరుగుతూ, ప్రస్తుతం అధికార జేడీయు పార్టీకి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి దగ్గరవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనకు వచ్చినప్పుడు నితీష్ కుమార్ ని చాలా తీవ్రంగా విమర్శించారు. అదేరోజు శత్రుఘన్ సిన్హా బీహార్ ముఖ్యమంత్రి చాలా గొప్ప పరిపాలనాదక్షుడు, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని పొగిడి బీజేపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు.
ఒకవైపు బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంటే, శత్రుఘన్ సిన్హా నితీష్ కుమార్ వంటి మంచి ముఖ్యమంత్రి దొరకడం బీహార్ ప్రజల అదృష్టమని చెపుతుంటే బీజేపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. నితీష్ కుమార్ కూడా శత్రుఘన్ సిన్హాని చాలా తెలివిగా వాడేసుకొంటున్నారు. బీజేపీ నేతలు తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, అదే పార్టీకి చెందిన శత్రుఘన్ సిన్హా ద్వారా తన ప్రభుత్వ పనితీరు గురించి నితీష్ కుమార్ డప్పుకొట్టించుకొంటున్నారు. దాని వలన బీజేపీ కంటిని బీజేపీ వేలుతోనే పొడుస్తున్నట్లయింది.
ఇదంతా చూస్తున్న బీజేపీ నేతలు శత్రుఘన్ సిన్హా గురించి ఏదో అనడం, దానికి మీడియా మరికొంత మసాలా తగిలిస్తుండటంతో బీజేపీకి ఆయనకి మధ్య రాన్రాను దూరం పెరిగిపోతోంది. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తారని మీడియాలో వచ్చిన వార్తలపై తను స్పందించబోనని చెపుతూనే మళ్ళీ “దమ్ముంటే తనను బహిష్కరించమని” బీజేపీ అధిష్టానానికి ఆయన సవాలు విసిరారు. ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుందనే సూత్రం ఎవరూ మరిచి పోకూడదని పార్టీని పరోక్షంగా హెచ్చరించారు.
పార్టీకి ఆయనకి మధ్య నడుస్తున్న ఈ యుద్ధం నితీష్ కుమార్ కి చాలా కలిసివచ్చింది. కానీ శత్రుఘన్ సిన్హా బీజేపీలో కొనసాగుతున్నంత కాలమే నితీష్ కుమార్ కి ఆ ప్రయోజనం దక్కుతుంది. ఆయన బీజేపీకి ఎన్నికల సమయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ పార్టీ నుండి బహిష్కరించలేని పరిస్థితి నెలకొని ఉంది. ఒకవేళ పార్టీలో నుండి బహిష్కరిస్తే ఆయన వెంటనే జెడీయులో చేరిపోయి బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేయవచ్చును. ఒకవేళ బీజేపీ ఆయనని పార్టీలో నుండి బహిష్కరిస్తే బీజేపీలో బీహారీలకు స్థానం, సముచిత గౌరవం లేదని నితీష్ కుమార్ గట్టిగా ప్రచారం చేసుకొంటే బీజేపీ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక బీజేపీ కక్కలేక మింగలేక సతమతమవుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి మాత్రం ఆయనని వాడేసుకొంటున్నారు.