జేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబీన్ సిన్హాను పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు. 45 ఏళ్ల వయస్సులోనే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, బీహార్ మంత్రిగా పనిచేసిన నబీన్‌ను ఎంపిక చేయడం ద్వారా పార్టీ పగ్గాలను యువ నాయకత్వానికి అప్పగించాలనే సంకేతాన్ని మోదీ-షా ద్వయం పంపిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దగా పాపులారిటీ లేని నేతలను ఎంచుకోవడం మోదీకి కొత్తేమీ కాదు; గతంలో జేపీ నడ్డాను కూడా ఇదే తరహాలో తెరపైకి తెచ్చారు. ఇప్పుడు నబీన్‌ను ఆయన వారసుడిగా సిద్ధం చేస్తున్నారు.
నేషనల్ ఇమేజ్ లేని నేతలకే ప్రాధాన్యం
నితిన్ నబీన్ ఎంపికలో విధేయత , సంస్థాగత పట్టు కీలక భూమిక పోషించాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో హైప్రొఫైల్ ఉన్న నేత కంటే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిశబ్దంగా పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తామని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమైంది. చత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్చార్జ్గా ఆయన సాధించిన విజయాలు, పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఆయనకున్న నైపుణ్యం అమిత్ షాను మెప్పించాయని చెబుతున్నారు. సొంత ఇమేజ్ కంటే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నేత అయితేనే మోదీ-షా చెప్పిన వ్యూహాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయగలరనేది వారి నమ్మకం.
అన్ని సమీకరణాలు చూసుకున్నట్లుగా ప్రచారం
సామాజిక సమీకరణాల పరంగా చూస్తే, నబీన్ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన వారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీహార్, యూపీలలో ఈ వర్గం బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, హిందీ బెల్ట్‌లో పట్టు కోల్పోకుండా ఉండటానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని మోదీ-షా అమలు చేశారు. అలాగే, తూర్పు భారతం నుంచి ఒక యువ నేతను జాతీయ స్థాయికి తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
సొంత నిర్ణయాలు తీసుకోరు – మోదీ, షా చెప్పినట్లుగా చేస్తారు !
నితిన్ నియామకం వెనుక మరో కీలక అంశం ఆయన సొంత నిర్ణయాలు తీసుకోరు. పాపులారిటీ ఉన్న నేతలైతే సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే నబీన్ వంటి నేత అయితే, మోదీ-షాల మార్గదర్శకత్వంలో పార్టీ యంత్రాంగాన్ని పకడ్బందీగా నడిపిస్తూ, 2029 లక్ష్యంగా పనిచేస్తారని అధిష్టానం అంచనా వేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎవరైనా అత్యున్నత పదవికి వెళ్లవచ్చు అనే సందేశాన్ని సామాన్య కార్యకర్తల్లోకి తీసుకెళ్లడంలో మోదీ-షా సఫలమయ్యారు. అయితే ఎక్కడికెళ్లినా అధికారం మాత్రం మోదీ, షా చేతుల్లోనే ఉంటుంది.
