బీహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడ్ని చేశారు. ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపిస్తున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 45 ఏళ్ల వయస్సులోనే దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీకి సారథిగా ఉంటూ, ఇప్పుడు పెద్దల సభకు వెళ్తుండటం ఆయన ఎదుగుదలలో మరో కీలక మైలురాయి.
నితిన్ నబీన్ను రాజ్యసభకు పంపడం వెనుక ఉన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్లో పరివర్తన్ యాత్ర ను నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా పర్యటించాల్సిన బాధ్యత ఉండటంతో, ఆయనను పార్లమెంటరీ విధుల్లోకి మార్చడం ద్వారా మరింత స్వేచ్ఛ, ప్రోటోకాల్ కల్పించాలని అధిష్ఠానం భావించినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటే, ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలను సమన్వయం చేస్తూనే, పార్లమెంటులో విపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి బలమైన వాయిస్ గా ఉంటారని మోదీ,షా ఆలోచన అనుకోవచ్చు.
బీహార్ రాజకీయాల్లో నితిన్ నబీన్ ఒక బ్రిడ్జ్ లాంటి నాయకుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవంతో పాటు, జాతీయ స్థాయిలో సంస్థాగత పట్టు ఉండటంతో ఆయనను రాజ్యసభకు పంపడం ద్వారా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. జేపీ నడ్డా హయాం ముగిసి, నవీన్ శకం ప్రారంభమైన తరుణంలో.. ఈ రాజ్యసభ నామినేషన్ ఆయనకు మరింత పొలిటికల్ వెయిటేజ్ ఇస్తుందని భావిస్తున్నారు.
