“ప్రస్తుత రాజకీయాల్లో మోదీ, షాలను మించిన వ్యూహకర్త లేరు. వారు దృష్టి పెడితే ఎలాంటి చోట అయినా బీజేపీ జెండా ఎగరాల్సిందే” .. అని అందరూ అనుకుంటారు. ఇప్పటి వరకూ చేసి చూపించారు కూడా. భావజాలం ప్రకారం బీజేపీకి అసలు చోటే ఉండని బెంగాల్ లాంటి రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల్ని సైతం నిర్వీర్యం చేసి..ప్రధాన పార్టీగా ఎదిగింది. అధికారానికి అడుగు దూరంలోనే ఉంది చాన్సే లేని చోట బీజేపీని నిటారుగా నిలబెట్టిన ఆ రాజకీయ దురంధరలకు తెలుగు రాష్ట్రాల రాజకీయం మాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి వస్తున్న తప్పుడు సమాచారంతో వారు నిర్ణయాలు తీసుకుంటున్నారా ? లేకపోతే అసలు తెలుగు రాజకీయాలనే అర్థం చేసుకోలేకపోతున్నారా ? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్.రాంచంద్రరావును ప్రకటించడంతో అందరూ ఉసూరుమన్నారు. ఒకరు చంద్రబాబు చెబితే అధ్యక్షుడిగా నియమించారని అంటారు. మరొకరు కేసీఆర్ తో పొత్తుల కోసం బీజేపీ హైకమాండ్ రాంచంద్రరావును నియమించిందని తేల్చారు. అంతే కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రామచంద్రారవు బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు.. ఆ పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ ఎంతో ఆలోచించి చేసిన నియామకం అని అనుకోలేదు. ఈ నిర్ణయంపై ఎలాంటి ప్రచారం జరుగుతుందో బండి సంజయ్ లాంటి వారికి బాగా తెలుసు. అందుకే బండి సంజయ్ పదే పదే ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విషయం హైకమాండ్‌కు తెలియదా ?
పార్టీ బలోపేతం అయింది బండి సంజయ్ నాయకత్వంలో !
రాష్ట్ర విభజన వరకూ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా అంటే చాలా మైనర్ పార్టీ. సొంతంగా కిషన్ రెడ్డి ఒక్కరే గెలవగల కెపాసిటీతో ఉండేవారు. 2014లో టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఐదు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారు. తర్వాత కూడా ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా ఓడిపోయారు. కానీ గోషామహల్లో రాజాసింగ్ గెలిచి పరువు నిలబెట్టారు. అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ కన్నా.. ఆయన హిందూత్వ రాజకీయాలే గెలిపించాయి. అయినా సరే బీజేపీ పరువు నిలబడింది. అప్పటికి బీజేపీ ప్రభావం శూన్యం.. ఎవరికి పగ్గాలు ఇస్తే ఎలా బలోపేతం చేస్తారో తెలియని పరిస్థితి. కానీ 220 బండి సంజయ్‌కు పగ్గాలు ఇవ్వడంతో బీజేపీ రాత మారిపోయింది. అప్పటికి కరీంనగర్‌కు మాత్రమే పరిమితమైన నేత బండి సంజయ్. కానీ తన బలం ఏమిటో తనకు బాగా తెలుసు. తన బలాన్ని పార్టీ అభివృద్ధికి ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. 2023 జూలై వరకూ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ గ్రాఫ్ ఎంత పెరిగిందంటే.. ఆయనను పదవి నుంచి తప్పించే వరకూ బీజేపీనే బీఆర్ఎస్కు ప్రత్యర్థి అనుకున్నారు. తనకు ఇచ్చిన ముూడేళ్ల స్వల్పకాలంలోనే బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారు. పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నారు. పార్టీ కార్యకర్తలు కోరుకున్నంత జోష్ వచ్చింది. ఆయన వివాదాస్పద ప్రకటనలు చేసి ఉండవచ్చు కానీ.. బీజేపీకి అలాంటివి ఉపయోగపడ్డాయి. బలోపేతం అయ్యాయి. ఆయన ప్రకటనలు బీజేపీకి ఒక్క ఓటు కూడా నష్టం చేసే అవకాశం లేదు. పైగా బీసీ వర్గం నుంచి బలంగా ఎదుగుతున్న నేతగా గుర్తింపు పొందారు. ఆయననే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి వచ్చేదో లేదో కానీ.. ఉత్తర తెలంగాణలో మాత్రమే సీట్లు సాధించే స్థితికి మాత్రం దిగజారి ఉండదని రాజకీయాలపై అవగాహన ఉండే అందరికీ తెలుసు.
బండి సంజయ్‌ను మార్చడమే పెద్ద సెల్ఫ్ గోల్
“మా నోటి కాడ కూడును లాక్కున్నారని” కాంగ్రెస్ పార్టీపై అప్పుడప్పుడూ బండి సంజయ్ విమర్శిస్తూంటారు. అందులో వాస్తవం ఉంది. 2023లో జూలైలో బీజేపీ హైకమాండ్ ఏం ఆలోచించి.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి మళ్లీ కిషన్ రెడ్డికి అప్పగించిందో కానీ.. బీజేపీ గ్రాఫ్ ఒక్క సారిగా పడిపోయింది. ఎంతగా అంటే.. ఇక ఆ పార్టీ రేసులో లేదు.. కాంగ్రెస్ పార్టీదే గెలుపన్నట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారని అనుకున్నారు. అక్కడా ఎలాంటి నిర్ణయం జరగలేదు. దాంతో మొత్తం కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయింది. బీజేపీనే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ గెలుపు తధ్యమని బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు మళ్లీ ఇక బీజేపీతో లాభం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బండి సంజయ్ మూడేళ్ల పాటు కష్టాలు పడి పార్టీకి తీసుకొచ్చిన గ్రాఫ్ దాంతో పడిపోయింది. లక్కీగా ఉత్తర తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంక్‌ను కైవసం చేసుకుంటున్న సంకేతాలను మాత్రం అందుకుంది. తర్వాత ఆరు నెలల్లోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అత్యధికంగా బీజేపీకి బదిలీ అయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.1 శాతం ఓటు షేర్ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా డబుల్. BJP 8 లోక్ సభ సీట్లు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి 16.7 శాతం ఓటు షేర్ మాత్రమే సాధించింది. బీజేపీ గెలిచిన అన్ని చోట్లా బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది. అంటే క్రమంగా బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ దగ్గరకు చేరుతున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుంది?. బీఆర్ఎస్ పార్టీని మరింతగా టార్గెట్ చేసుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేసి.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను కైవసం చేసుకుని ప్రధాన పార్టీగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత తమదే అధికారం అని అనుకుంటారు.
ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఎదుగుదల నియంత్రణ
కానీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం చేసింది ?. పార్టీ వ్యవహారాలపై చాలా కాలం స్తబ్దుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన ఎన్నో పొరపాట్లపై కనీస పోరాటం చేయలేదు. పార్టీ నేతలంతా అంతర్గత రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతుంటే అలా వదిలేశారు. చివరికి ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టిన చందంగా… గత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపని రామచంద్రరావుకు పదవి ఇచ్చి పీఠంపై కూర్చోబెట్టారు. ఆయన కంటే బలమైన నేతలు లేరా అంటే.. చాలా మంది ఉన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ చాన్స్ ఇవ్వలేదు. ఆయన కాకపోతే బీఆర్ఎస్ పొడే గిట్టని .. అవకాశం కల్పించుకుని మరీ బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉండే ఎంపీ ధర్మపురి అర్వింద్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రెడీగా ఉన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి అవసరం లేదని.. రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానని బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని బండి సంజయ్ చెబుతున్నా… మోదీ, షాలకు ఎక్కలేదు. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పలుమార్లు ఆయన నాయకత్వాన్ని మోదీ ప్రశంసించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆశ్చర్యకర పలితాలను చూసి మోదీ స్వయంగా బండి సంజయ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మరి ఈ పొటెన్షియల్ ఉన్న లీడర్లను ఎందుకు వద్దనుకున్నారు?. రామచంద్రరావులో ఎం చూశారు?. మరో పార్టీ బలాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు అనుకుంటారని .. అనుకోలేం. ఎందుకంటే సొంతంగా తెలంగాణలో అధికారాన్ని చేపట్టడం కన్నా.. సంతోషం ఆ పార్టీ పెద్దలకు ఏముంటుంది ?. ఎందుకో కానీ.. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాదని అనుకుంటున్నారని ఈ ఎంపికలను బట్టి చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. నిర్వీర్యం అయిపోతున్న బీఆర్ఎస్ కు కాస్త బలం తెచ్చేలా చేసి ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని అనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.లేకపోతే ఆ పార్టీని పూర్తి స్థాయిలో విలీనం చేసుకునే ప్రక్రియ కోసం రామచంద్రరావును ఎంపిక చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. నిజానికి ఈ విలీన రాజకీయం చాలా రిస్క్. రాజకీయాల్లో ఎప్పుడైనా అధికారాలు రెండు పార్టీల మధ్య మారుతున్నప్పుడు మూడో పక్షం ప్రత్యామ్నాయంగా వస్తే ప్రజలు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తారు. ఎప్పుడూ వాళ్లేనా అని మూడో ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించడం వెనుక ఉన్న ఫార్ములా ఇదే. తెలంగాణలో బీజేపీ ఇతర ఏ లగేజీని నెత్తికెక్కించుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి ఓ అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ ఫార్ములాను .. నమ్మేందుకు.. తమ పార్టీ నేతలపై నమ్మకం పెట్టుకునేందుకు బీజేపీ హైకమాండ్ ఏ మాత్రం ఆసక్తిగా లేదని .. తాజా ఎంపికతో స్పష్టమయిందని అనుకోవచ్చు. ముందు ముందు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం చేసుకోవచ్చు..కానీ పొత్తులు పెట్టుకోవచ్చు.. తెలంగాణ ఎన్డీఏలో టీడీపీకి బదులుగా బీఆర్ఎస్ ఉండవచ్చు..కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను మాత్రం ఆ పార్టీ హైకమాండ్ ఉద్దేశపూర్వకంగా నియంత్రించినట్లే అనుకోవచ్చు. దీంతో ఏం సాధిస్తారో .. వారి వ్యూహం ఏమిటో మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే.. పార్టీ సొంతంగా గెలుపు కాకుండా ఇతరులపై ఆధారాపడేలా చేయడం.. ఏ విధంగానూ గొప్ప వ్యూహం అనిపించుకోదు. అంటే.. ఈ విషయంలో చాణక్యులైన మోదీ, షా తెలంగాణ రాజకీయాల్ని అర్థం చేసుకోలేకపోయారని అనుకోవచ్చు.
ఏపీలో ఏ ముద్రా లేని నేతకు పదవి!
ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ పెద్దగా కసరత్తు చేసి ఉండదు. ఎవరికీ ఆసక్తి కూడా లేదు. కానీ ఆ పార్టీలోనే కొంత మంది నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీని నమ్ముకుని సమర్థమైన యువనేతగా పేరున్న మాధవ్ ను ఖరారు చేశారు. ఆయన ఎంపిక విషయంలో.. బీజేపీలో పదవికి పోటీ పడిన కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేసి ఉంటారు కానీ.. ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు. అక్కడ ఎవరు ఉన్నా.. పార్టీ బలోపేతం కన్నా..కూటమి సంబంధాలను కాపాడేవారు కావాలి. ఏపీ బీజేపీకి మొదటి నుంచి ఉన్న సమస్య ఏమిటంటే.. ఆ పార్టీలో కొంత మంది నేతలు వైసీపీకి.. మరికొంత మంది నేతలు టీడీపీకి అనుకూలం అని ముద్రపడటం. నిక్కచ్చిగా బీజేపీ నేత అనే భావన ఉన్న నేతలు చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి వారిలో మాధవ్ ఒకరు. ఆయనకే అవకాశం కల్పించడం మాత్రం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యానికి అసంతృప్తికి గురి కానివ్వలేదు.