దక్షిణాదిపై ఇక బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని కర్ణాటక ఫలితాల తర్వాత ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం కూడా దండగని చెబుతున్నారు. తెలంగాణలో మీడియా హైప్ ఉంది కానీ.. పట్టుమని పది మంది గట్టి అభ్యర్థులు లేరు. ఢిల్లీ స్థాయి నుంచి ఎంత తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా చేరికలు మాత్రం ఉండటం లేదు. దీంతో తెలంగాణలో గెలుస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కర్ణాటక ఫలితం తర్వాత ఇక ఆలోచించడం లేదు.
ఏపీలో ఆ పార్టీ ఉనికి లేదు. అక్కడి రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా బీజేపీకే మద్దతు అంటూ .. ఆ పార్టీ ఏపీలో పాతుకోకుండా చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు బలంగా ఉన్నంత కాలం బీజేపీ ఎదగదు. తమిళనాడులో సిద్దాంత వైరధ్యం ఉంది. అక్కడ ఎదగడానికి ప్రయత్నిస్తున్నా.. కష్టమేనని లెక్కలు చెబుతున్నాయి. ఇక కేరళలో అసలు సాధ్యం కాదు. ఇలా చూసినా.. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఆశలు గల్లంతయినట్లేనని చెప్పుకోవచ్చు.
బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి కారణం ఉత్తరాది లో వచ్చే సీట్లే. ఆ పార్టీకి ఉన్న 303 సీట్లలో 90 శాతానికిపైగా ఉత్తరాది నుంచి వచ్చేవే. ప్రతీ సారి ఉత్తరాదిలో అన్ని సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. మళ్లీ గెలవాలంటే దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే ముందు పార్టీ బలపడాలి. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా… దక్షిణాదిలో పార్టీని విస్తరించడం దుర్లభమవుతంది. అందుకే ఇప్పుడు బీజేపీ కంగారు పడుతోంది. దక్షిణాదికి ఏ దారిలో ఎంట్రీ ఇవ్వాలా అని ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా మత చిచ్చు పెట్టుకుని ప్రయత్నాలు చేయాలి కానీ ఇప్పుడల్లా ముందుకెళ్లడం కష్టమేనని భావిస్తున్నారు.