ప్రొ.నాగేశ్వర్: చంద్రబాబును దెబ్బతీసేందుకు బీజేపీకి వెంకన్న ఆయుధమాయె ..!

తెలుగుదేశం పార్టీ, బీజేపీల మధ్య ఘర్షణ వాతావణం ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడు కేంద్రం అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా టీడీపీని ఇబ్బంది పెట్టాలని.. ఏపీలో బలపడాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నం చేస్తోంది. హిందూ మత రాజకీయాల్లో ఆరితేరిపోయిన బీజేపీ ఇందు కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలను వాడుకునేందుకు సిద్ధమయింది. దీనిలో భాగంగా ముందుగా టీటీడీ ఆలయాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి తేవాలన్న ప్రయత్నాలను చేసింది. తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో.. వెనుకడుగు వేసింది. ఇప్పుడు తాజాగా రమణదీక్షితుల వ్వయహారాన్ని తెరమీదకు తెచ్చింది.

రమణ దీక్షితులు మీడియాకు చెబుతున్న అంశాల వల్ల.. హిందూ మత భావాలను రెచ్చగొట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. హిందూ మతాన్ని రాజకీయాలకు వాడుకునేంత నైపుణ్యం బీజేపీకి తప్ప మరొకరికి లేదు. తిరుమలలో అపచారం జరుగుతోందన్న భావన రెచ్చగొడితే రాజకీయ లాభం ఉంటుందని బీజేపీ అంచనా వేసుకుంటోంది. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై ఆరోపణలు ఇప్పటివి కావు. వైఎస్ హయాంలో కూడా టీటీడీపై అనేక ఆరోపణలు వచ్చాయి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా టీటీడీ బోర్డును మార్చారు. ఇసుక మాఫియా, లిక్కర్ వ్యాపారులకు … బోర్డు చైర్మన్లుగా పదువులిచ్చారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు.. అధికారం ఉన్న ప్రధాన పార్టీలన్నీ ఈ పని చేశాయి.

టీడీపీని ఇబ్బంది పెట్టే క్రమంలోనే ప్రస్తుతం రమణదీక్షితులు ఆరోపణలు ఉన్నాయి.తిరుమలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం .. అమిత్ షాను కలిశానని.. ఆలయాన్ని చూపించానని, పోటును కూడా చూపించానని రమణదీక్షితులు స్వయంగా చెప్పారు. ఆ తర్వాతే రమణదీక్షితులు టీటీడీపై, ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అంటే కచ్చితంగా ఈ వివాదం రాజకీయ పరంగా ప్రారంభమైనదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి అమిత్ షా ఓ ఎంపీ మాత్రమే. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడైతే మాత్రం ప్రొటోకాల్ వర్తించదు. రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్, సీఎం లాంటి పదవుల్లో ఉన్న వారికి ప్రోటోకాల్ వర్తిస్తుంది. కానీ అమిత్ షాకు వర్తించదు. కానీ ప్రోటోకాల్ ప్రకారమే అమిత్ షాకు ప్రధాన అర్చకుని హోదాలో స్వాగతం పలికి అన్నీ వివరాలు చెప్పానని రమణదీక్షితులు చెప్పుకొస్తున్నారు. ప్రోటోకాల్ లేని వారికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.

నిజానికి రమణదీక్షితులు చేసే ఆరోపణలపై… ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే.. ప్రధానికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు, గవర్నర్ కు కూడా పిర్యాదు చేయవచ్చు. అమిత్ షాకు ఫిర్యాదు చేయడంలోనే పూర్తిగా రాజకీయం అందని అర్థం చేసుకోవచ్చు. నిజానికి రమణదీక్షితులపై ఎన్నో ఆరోపణలున్నాయి. అంబానీ లాంటి వీఐపీలు ఇస్తే ప్రైవేటు ఆశీర్వాదాలు ఇస్తారు. శ్రీవారి సేవలను కాదని సైతం.. ప్రైవేటు కాళ్యాణోత్సవాలు జరిపిస్తారు. ఈ వివాదాలు చాలా ఉన్నాయి. తిరుమల కొండపై… ముఖ్యంగా ఆలయంలో రమణ దీక్షితులు ఓ వర్గం, డాలర్ శేషాద్రి మరో వర్గంగా చెలామణి అవుతూ ఉంటాయి. వీరిపై అనేక ఆరోపణలు వస్తూంటాయి. వీటిపై విచారణ చేయించడంలో తప్పులేదు.

రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయి. చోళులు, పల్లవ రాజులు ఇచ్చిన వజ్రవైఢూర్యాల కోసం పోటులో తవ్వకాలు జరిపారనేది.. రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణ. డిసెంబర్ తొమ్మిదో తేదీన ఇవి జరిగాయంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు. తనకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు చెబుతున్నారు…?. పోటులో జరిగింది తవ్వకాలు కాదని.. మరమ్మత్తులు మాత్రమేనని ఇతర అర్చకులు, సిబ్బంది చెబుతున్నారు. అయినా సరే రమణదీక్షితులు చెబుతున్న అంశాలపై కూడా దర్యాప్తు చేస్తే ఎలాంటి తప్పూ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com