కేరళ ప్రజలు తమ రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో కేరళం అని పిలుచుకుంటారు. ఈ సెంటిమెంట్‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా పేరు మార్పునకు సానుకూలత తెలిపింది. కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. మలయాళీ అస్తిత్వాన్ని తాము గౌరవిస్తామనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా, ఆ రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, కేరళా సమాజంతో మమేకమవ్వడానికి వేసిన ఒక బలమైన అడుగు.
బెంగాల్ ఫార్ములా అమలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కొన్ని కీలక విజయాలు సాధించడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల కంచుకోటలను ఎలాగైతే బద్దలు కొట్టిందో, ఇప్పుడు కేరళలోనూ అదే తరహా వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. కాంగ్రెస్ బలహీనపడటం, అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వంటి అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కమలదళం అడుగులు వేస్తోంది.
హిందూ ఓటు బ్యాంకుతో పాటు క్రైస్తవ మద్దతుపై కన్ను
కేరళలో కేవలం హిందూ ఓట్లపైనే ఆధారపడి గెలవడం సాధ్యం కాదని బీజేపీకి తెలుసు. అందుకే, గత కొంతకాలంగా క్రైస్తవ సామాజిక వర్గాలతో సఖ్యత పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. పేరు మార్పు వంటి నిర్ణయాల ద్వారా రాష్ట్ర గౌరవాన్ని పెంచుతున్నామని చెబుతూ, అన్ని వర్గాల మద్దతు కూడగట్టాలని చూస్తోంది. మెజారిటీ ఓటర్లు ఇప్పుడు అభివృద్ధి, జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది.
కమ్యూనిస్టుల స్థానాన్ని భర్తీ చేసే దిశగా..
కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ మూడో బలమైన శక్తిగా ఆవిర్భవించింది. త్రిపురలో ఏవిధంగా అయితే కమ్యూనిస్టులను మూడో స్థానానికి నెట్టేసి అధికారంలోకి వచ్చిందో, కేరళలో కూడా అదే పునరావృతం అవుతుందని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తూ, స్థానిక సెంటిమెంట్లను గౌరవిస్తూ ముందుకు సాగడం ద్వారా.. కమ్యూనిస్టుల ప్లేస్‌ను తాము భర్తీ చేయగలమని బీజేపీ బలంగా నమ్ముతోంది. కేరళ ప్రజల ఆలోచనలు ఏమిటో అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
