భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంకును ఇప్పటికే చాలా వరకూ కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ నేతల్ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగా తమ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి చేర్పించేందుకు మిషన్ ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకోవడం ప్రారంభమే.
పాలమూరు జిల్లా బీఆర్ఎస్ కీలక నేతలంతా బీజేపీలోకే ?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బోల్తా పడింది. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు అందరూ దూరమవుతూ వస్తున్నారు. యాక్టివ్ గా ఉన్న వారు హైదరాబాద్లోనే తన చురుకుదనం చూపిస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో అసలు పార్టీని పట్టించుకోవడం లేదు. తమ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉందో లేదో వారికి అర్థం కావడం లేదు. అందుకే ప్రత్యామ్నాయాలు చూసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారు. వారి ఆలోచనలను బీజేపీ నాయకత్వం పసిగట్టింది. భవిష్యత్ బీజేపీదేనని.. భరోసా ఇచ్చిపార్టీలోకి రావాలని సంకేతాలు పంపుతోంది.
బీఆర్ఎస్ పుట్టి ముంచనున్న విలీన ప్రచారం
భారత రాష్ట్ర సమితి ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీలో విలీనం కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. స్వయంగా కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత అదే అంశంపై తనతో చర్చించారని.. సీఎం రమేష్ కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించలేదని అంటున్నారు. అందుకే విలీనం ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. తమ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్నా.. నోరెత్తలేకపోతున్నారు. అంటే..బీజేపీ ఎప్పటికైనా దయ తలుస్తుందేమో అన్న ఆలోచనతో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అయితే వీరికి ఉన్నంత ఓపిక ఇతర నేతలకు ఉండకపోవచ్చు. విలీనం వరకూ ఎందుకు వేచి చూడాలని వారు అనుకునే ప్రమాదం కనిపిస్తోంది.
ముందు ముందు రాష్ట్ర వ్యాప్త చేరికలు
బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీలో కన్నా బీజేపీలో చేరేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ .. ..బీజేపీలో విలీనం అవుతుందని.. తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. పరిస్థితులు చూస్తూంటే.. దాన్ని తోసి పుచ్చలేమని రాజకీయవర్గాలు అంటున్నాయి. చుట్టుముడుతున్న కేసులు, విచారణలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు అంత తేలిక కాదన్న వినిపిస్తోంది. అదే సమయంలో.. కవిత సమస్య ఉండనే ఉంది. ఇప్పటికే తలసాని లాంటి వాళ్లు సైలెంట్ అయ్యారు. ముందు ముందు రోజుకే బ్రేకింగ్ న్యూస్ రాజీనామాల విషయంలో వచ్చినా ఆశ్చర్యం ఉండదని ఇప్పటికే అందరూ ఫిక్సయిపోతున్నారు.