రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అవలీలగా ఎంపిక చేసేస్తూంటారు ప్రధాని మోదీ,అమిత్ షా. బీజేపీలో వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. అందుకే శివరాజ్ చౌహాన్ అయినా…వసుంధర రాజే అయినా సీఎంలుగా తీసేసి పక్కన పడేస్తే సైలెంట్ గా ఉండిపోయారు. నోరు మెదపలేకపోతున్నారు. అంతటి పట్టు సాధించిన వారికి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మాత్రం సవాళ్లను సృష్టిస్తోంది. దానికి కారణం ఏమిటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. చాలా కాలంగా బీజేపీ అధ్యక్షుడ్ని ఖరారు చేయడం లేదు. తాజాగా ఎప్పుడూ లేని విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించారు. తర్వాత ఆయననే అధ్యక్షుడిని చేస్తారని అంటున్నారు.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ ఎమ్మెల్యే
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీహార్ కు చెందిన ఎమ్మెల్యే నితిన్ నబీన్ సిన్హా ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. మోదీ, షా ఇద్దరూ మాట్లాడుకుని ఆయన పేరును ప్రకటించారు. తర్వాత మోదీ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ నితీష్ నబీన్ ఎవరో బీజేపీలోనే చాలా మందికి తెలియదు. చాలా పెద్ద స్థాయి నేతలకు క్లారిటీ ఉంటుందేమో?. కానీ జాతీయస్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారంటే..అందరికీ తెలిసిన.. కాస్త పలుకుబడి ఉన్న నేతను నియమిస్తారు.కానీ మోదీ, షాలు మాత్రం అలాంటి సమీకరణాలు పట్టించుకోరు. ఎందుకంటే ఆ పలుకుబడి ఉంటే గింటే తమకే ఉంటుందని వారి నమ్మకం కావొచ్చు.
బీజేపీ అధ్యక్షుడిగా ఎవర్ని నియమించిన డమ్మీనే!
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన కు ఉన్న పలుకుబడి ఎంతో ఆ పార్టీలో అందరికీ తెలుసు. సొంతంగా ఒక్క నిర్ణయం తీసుకోలేరు. పార్టీని ఆయనే నడుపుతున్నారంటే ఎవరూ నమ్మరు. మొత్తం అమిత్ షా చేతుల మీదుగానే నడుస్తుంది. బీజేపీ పాలసీ ప్రకారం.. అమిత్ షా మరోసారి అధ్యక్షుడు కాలేరు కాబట్టి నడ్డాకు చాన్స్ ఇచ్చి..ఆయన స్టీరింగ్ తీసుకున్నారు. తర్వాత ఎవర్ని ఎంపిక చేసినా వారు కూడా అంతే. మోదీ, షాలు చెప్పేది చేయడం తప్ప..సొంతంగా ఏ పనీ చేయలేరు. మరి అలాంటి క్యాండిటేట్ ను కూడా ఎంపిక చేయడానికి మోదీ, షా ఎందుకు ఆలోచిస్తున్నారన్నదే కీలకమైన విషయం. నబీన్ సిన్హానే అధ్యక్షుడిగా ప్రకటించినా పరిస్థితి మారదు.
ప్రచారంలోకి బోలెడంతో మంది పేర్లు !
జేపీ నడ్డా పదవికాలం ముగిసిపోయి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కిషన్ రెడ్డి, పురందేశ్వరి, అన్నామలై, యడ్యూరప్ప ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి. కానీ ఎవరి పేరుపై అయినా మోదీ, షా పరిశీలన జరిపారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఎప్పటికప్పుడు అధ్యక్షుడి ఎంపిక మాత్రం వాయిదా వేస్తూ పోతున్నారు. పేరుకు పార్టీ అధ్యక్షుడే అయినా.. ఎవర్ని నియమించినా డమ్మీనే అయినప్పుడు.. ఎందుకు వారు నిర్ణయం తీసుకోవడం లేదన్నది రాజకీయవర్గాలకూ అర్థం కాని విషయం. ఆ రాజకీయం వారికే తెలియాలి.
